Asthma: పాల ఉత్పత్తులు అధికంగా తింటే ఆస్తమా సమస్య పెరుగుతుందా?
Asthma: ఆస్తమా ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి ఎప్పుడూ ట్రిగ్గర్ అవుతుందో చెప్పలేము. పాల ఉత్పత్తుల వల్ల ఆస్తమా పెరుగుతుందనే భావన కొంతమందిలో ఉంది. అది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం.
Asthma: పాలు మన శరీరానికి అత్యవసరమైన పోషకాలను కలిగి ఉంటుంది. పాలల్లో కాల్షియం, ప్రోటీన్, ఇతర విటమిన్లు ఉంటాయి. అవన్నీ కూడా మన ఆరోగ్యానికి అవసరమైనవి. అయితే దీర్ఘకాలికంగా పాల ఉత్పత్తులను ప్రతిరోజూ అధికంగా తింటే ఆస్తమా పెంచుతుందనే వాదన ఉంది.
ఉబ్బసం లక్షణాలు
ఉబ్బసం అనేది ఒక దీర్ఘకాలిక శ్వాసకోశ అనారోగ్యం. ఇది ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది. వాయు మార్గాలు సంకోచించడం, గురక రావడం, ఊపిరి ఆడక పోవడం, ఛాతి బిగుతుగా మారడం, దగ్గు అధికంగా రావడం... ఇవన్నీ ఆస్తమా లక్షణాలు. అలెర్జీ కారకాలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, వ్యాయామం అధికంగా చేయడం, గాలి కాలుష్యం వల్ల కూడా ఆస్తమా ఎక్కువగా పెరుగుతుంది. ఇది అన్ని వయసుల వారికి వచ్చే అవకాశం ఉంది.
ఆస్తమా పెరగడానికి పాల ఉత్పత్తులు కారణమవుతాయో లేదో వివరిస్తున్నారు పోషకాహార నిపుణులు. పాల ఉత్పత్తుల్లో కేసైన్ అనే ప్రోటీన్ ఉంటుంది. కొంతమంది జీర్ణవ్యవస్థ సున్నితంగా ఉంటుంది. అలాంటివారు పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల శరీరంలో తాపజనక ప్రతిస్పందన పెరుగుతుంది. ఆస్తమాతో బాధపడుతున్న వారు పాల ఉత్పత్తులను అధికంగా తీసుకుంటే వారి శ్వాస నాళాల్లో శ్లేష్మం అధికంగా ఉత్పత్తి పెరగొచ్చు. ఊపిరాడడం కష్టంగా మారచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవ్వొచ్చు.
కొంతమందిలో పాలు అలెర్జీకి కారణం అవుతాయి. ఆస్తమా ఉన్న కొంత మందిలో కూడా ఈ పాల అలెర్జీ ఉండే అవకాశం ఉంది. పాల ఉత్పత్తులు ఏవి తిన్నా వెంటనే దద్దుర్లు, దురద వంటి లక్షణాలు కనిపిస్తే మీకు డైరీ ప్రొడక్ట్స్ పడడం లేదని అర్థం. ఇలా పడకపోవడం కూడా ఆస్తమా లక్షణాలను తీవ్రంగా మారుస్తుంది. పాలు తాగిన వెంటనే దురద, దద్దుర్లు, ఊపిరాడకపోవడం వంటి సమస్యలు కనిపిస్తే మీకు డైరీ ప్రొడక్ట్స్ అలెర్జీ ఉందేమో చెక్ చేయించుకోవడం ఉత్తమం.
పాలకు ఆస్తమాకు మధ్య సంబంధాన్ని తెలుసుకునేందుకు ఎన్నో పరిశోధనలు జరిగాయి. కొన్ని పరిశోధనలు పాలు తీసుకోవడం వల్ల ఆస్తమా పెరిగే అవకాశం ఉందని చెబితే, మరికొన్ని పరిశోధనలు అలాంటివేమీ లేదని తేల్చాయి. కొందరిలో లాక్టోస్ ఇన్‌టాలరెన్స్ అనే సమస్య ఉంటుంది. అంటే వారు పాలల్లో ఉన్న లాక్టోజ్‌ను అరిగించుకోలేరు. అలాంటి వారికి ఆస్తమా లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి ఆస్తమా ఉన్నవారు పాల ఉత్పత్తులను తీసుకున్నాక ఊపిరి ఆడడంలో ఇబ్బంది రావడం లేదా దద్దుర్లు, దురదలు వంటి అలెర్జీల కనిపించడం, ఛాతీ బిగుతుగా పట్టినట్టు అనిపించడం, దగ్గు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆపేయడమే ఉత్తమం.