Irregular Periods: అమ్మాయిలు అతిగా జిమ్ చేస్తే పీరియడ్స్ ఆ నెల రాకుండా ఆగిపోతాయా? ఇందులో నిజమెంత?-do girls who do too much gym stop their periods from coming that month how true is this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Irregular Periods: అమ్మాయిలు అతిగా జిమ్ చేస్తే పీరియడ్స్ ఆ నెల రాకుండా ఆగిపోతాయా? ఇందులో నిజమెంత?

Irregular Periods: అమ్మాయిలు అతిగా జిమ్ చేస్తే పీరియడ్స్ ఆ నెల రాకుండా ఆగిపోతాయా? ఇందులో నిజమెంత?

Haritha Chappa HT Telugu
Aug 22, 2024 04:30 PM IST

Irregular Periods: క్రమం తప్పకుండా నెలసరి రావడం అనేది ప్రతి అమ్మాయిలో కనిపించే ఒక ఆరోగ్య లక్షణం. అయితే ఇప్పుడు వ్యాయామం చేసే అమ్మాయిల సంఖ్య పెరిగిపోతోంది. అతిగా జిమ్ చేస్తే అమ్మాయిల్లో ఆ నెల పీరియడ్స్ మిస్ అయ్యే అవకాశం ఉందని ఒక భావన ఉంది.

అతి వ్యాయామంతో వచ్చే నష్టాలు
అతి వ్యాయామంతో వచ్చే నష్టాలు

Irregular Periods: బరువు తగ్గించుకోవడానికి, ఫిట్‌గా ఉండేందుకు శారీరకంగా, ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో మంది అమ్మాయిలు ప్రతిరోజు జిమ్‌కి వెళ్తున్నారు. అయితే అతిగా జిమ్ చేసే అమ్మాయిల్లో పీరియడ్స్ పై ప్రభావం పడే అవకాశం ఉందని కొంతమంది నమ్మకం. అది నిజమేనని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అధిక వ్యాయామం చేసినా, సుదీర్ఘ గ్యాప్ తర్వాత వ్యాయామం అధికంగా చేసిన మీ శరీరం పై ఆ ప్రభావం పడుతుంది. అమ్మాయిల్లో వారి రుతు చక్రంపై ఇది ప్రభావం చూపవచ్చు. అధిక సమయం పాటూ తీవ్ర వ్యాయామాలు చేసే అమ్మాయిల్లో పీరియడ్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది.

పీరియడ్స్ మిస్ అవ్వడం అంటే?

ప్రతి మహిళకు ఋతుస్రావం దాదాపు 21 నుంచి 35 రోజుల్లో వస్తుంది. అంటే కొంతమంది మహిళలకు పీరియడ్స్ వచ్చిన 21 రోజులకే మళ్లీ పీరియడ్స్ రావచ్చు. లేదా కొంతమందికి 35 రోజులు తర్వాత రావచ్చు. ఇది సాధారణ రుతుచక్రం పరిధి. అయితే కొంతమందిలో పీరియడ్స్ పరిధి పెరిగిపోవచ్చు. ఈ నెల పీరియడ్స్ వచ్చాక 35 రోజులు దాటుతున్నా కూడా మళ్లీ పీరియడ్స్ రాలేదంటే... దాన్ని మిస్డ్ పీరియడ్స్ గా పిలుస్తారు. గర్భం ధరించడం, హార్మోన్ల అసమతుల్యత, అధికంగా బరువు పెరగడం, తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఇలా పీరియడ్స్ సమస్య మొదలయ్యే అవకాశం ఉంది. పీరియడ్స్ రాకపోవడంతో పాటు వికారంగా అనిపించడం, వక్షోజాలు సున్నితంగా మారడం, తీవ్రమైన అలసట, మానసిక స్థితిలో మార్పులు రావడం కూడా కనిపిస్తూ ఉంటాయి.

వ్యాయామానికీ, పీరియడ్స్ రాకపోవడానికి సంబంధం ఏమిటి?

పీరియడ్స్ సమయంలో తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల పొట్టనొప్పి, పొట్ట తిమ్మిరి వంటి నెలసరి సమస్యల నుండి తప్పించుకోవచ్చు. అయితే సాధారణ సమయాల్లో అధిక వ్యాయామం చేయడం అనేది పీరియడ్స్ ఆలస్యం కావడానికి లేదా పీరియడ్స్ మిస్ అవ్వడానికి కారణాలలో ఒకటని చెబుతోంది యూకే నేషనల్ హెల్త్ సర్వీస్.

2014లో జరిగిన ఒక అధ్యయనంలో క్రమం తప్పకుండా ప్రతిరోజూ వ్యాయామం చేసే మహిళల్లో సగం మందిలో నెలసరి సమస్యలు ఉన్నట్టు తేలింది. తీవ్రంగా వ్యాయామం చేసే మహిళల్లో 44 శాతం మందికి పీరియడ్స్ క్రమరహితంగా వస్తున్నాయని అధ్యయనం తేల్చింది. శారీరక శ్రమ, హార్మోన్లలో మార్పులు, శక్తి అసమతుల్యత... ఇవన్నీ కూడా వ్యాయామం వల్ల తీవ్రంగా ప్రభావం అవుతాయి. కాబట్టి పీరియడ్స్ రాకపోవడానికి అతి వ్యాయామం కారణమే అని చెప్పుకోవాలి.

పీరియడ్స్ రావు

తీవ్రమైన వ్యాయామం వల్ల శక్తి అధికంగా ఖర్చవుతుంది. శరీరంలో ఉన్న ఆహారం శక్తి ఉత్పత్తికి సరిపోకపోతే తీవ్ర అలసట వస్తుంది. శక్తిని ఆదా చేయడానికి శరీరం దానికి తగిన తగినట్టు స్పందిస్తుంది. ముఖ్యంగా పునరుత్పత్తి వ్యవస్థలోని కొన్ని పనులను శరీరం తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది. దీనివల్ల పునరుత్పత్తి హార్మోన్ల ఉత్పత్తిలో తగ్గుదల ఉంటుంది. ఇది నెలసరికి అంతరాయం కలిగిస్తుంది. దీనివల్ల ఒక నెల పీరియడ్స్ రాకపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి.

తీవ్రమైన వ్యాయామం హార్మోన్ల ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తుంది. ఇది ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ స్థాయిలను తగ్గిస్తుంది. ఈ రెండు హార్మోన్లు రుతుచక్రం సక్రమంగా నిర్వహించడానికి అవసరమైనవి. ఎప్పుడైతే ఈ రెండింటి ఉత్పత్తి తగ్గుతుందో, ఇది క్రమరహిత పీరియడ్స్‌కు కారణం అవుతుంది.

లెప్టిన్ అనే హార్మోను శక్తిసమతుల్యతకు, ఆకలి నియంత్రణకు పనిచేస్తుంది. తీవ్రమైన వ్యాయామం వల్ల లెప్టిన్ ఉత్పత్తి స్థాయిలు తగ్గిపోతాయి. దీనివల్ల రుతుచక్రం సరిగా పనిచేయదు. లెప్టిన్ స్థాయిలు తగ్గిపోవడంతో శరీరంలోని శక్తి స్థాయిలు కూడా తగ్గిపోతాయి. పునరుత్పత్తి హార్మోన్లను ఈ పరిస్థితి ఎంతగానో ప్రభావితం చేస్తుంది. దీనివల్ల కూడా పీరియడ్స్ ఆ నెల రాకపోయే అవకాశం ఉంది.

అధిక వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని కొవ్వు స్థాయిలు తగ్గిపోతాయి. శరీరంలో తగినంత కొవ్వు ఉండడం, ఈస్ట్రోజన్ ఉత్పత్తికి చాలా అవసరం. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గిపోతాయో అప్పుడు రుతుచక్రం తప్పే అవకాశం ఉంది.

తీవ్రమైన శారీరక శ్రమ శరీరంలో ఒత్తిడి హార్మోన్ అయినా కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. ఎప్పుడైతే కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయో... పునరుత్పత్తి హార్మోన్లు ప్రభావితం అవుతాయి. దీనివల్ల హార్మోన్ల అసమతుల్యత సమస్య వస్తుంది. ఇది నెలసరి సమస్యలను కలిగిస్తుంది.

కాబట్టి అమ్మాయిలు గంటల తరబడి తీవ్రమైన కఠోరమైన వ్యాయామాలు చేయడం మానేయాలి. వారి సున్నిత శరీరానికి, తేలికపాటి వ్యాయామాలు చేస్తే సరిపోతుంది. నడక, కార్డియో, రన్నింగ్, యోగా, ధ్యానం వంటి వాటితో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.