Herbal tea: రోగ నిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీ.. ఎన్ని రకాలుగా చేయొచ్చంటే..-different herbal tea benefits in monsoon and their types ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Herbal Tea: రోగ నిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీ.. ఎన్ని రకాలుగా చేయొచ్చంటే..

Herbal tea: రోగ నిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీ.. ఎన్ని రకాలుగా చేయొచ్చంటే..

Koutik Pranaya Sree HT Telugu
Jul 11, 2023 01:02 PM IST

Herbal tea: వర్షాకాలంలో హెర్బల్ టీలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, హెర్బల్ టీ రకాలు ఏంటో తెలుసుకుందాం.

హెర్బల్ టీ ప్రయోజనాలు
హెర్బల్ టీ ప్రయోజనాలు (pexels)

వర్షాకాలంలో చల్లటి సాయంత్రం వేళల్లో టీ తాగితే ఆ ఆనందమే వేరు. ఈ కాలంలో ఆరోగ్యం కాపాడుకోవడం కూడా ముఖ్యమే. అందుకే రోగ నిరోధక శక్తిని పెంచే వివిధ టీ రకాల గురించి తెలుసుకోండి.

1. అల్లం టీ:

జీర్ణశక్తి పెంచడంలో, వాంతులు, తలతిరగడం లాంటి సమస్యలు తగ్గించడంలో అల్లం టీ ఉపయోగపడుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వర్షాకాలంలో వచ్చే చిన్న చిన్న ఆరోగ్య సమస్యల్ని తగ్గిస్తుంది.

2. మందార టీ:

దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తపోటు తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తి పెంచుతుంది. గుండె, కాలేయం ఆరోగ్యంగా ఉండేలా సాయపడుతుంది.

3. మసాలా టీ:

అల్లం, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు కలిపి చేసే మసాలా టీ రుచిలో మేటి. అంతేకాదు దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రోగ నిరోధక శక్తి పెంచుతాయి. ఇన్పెక్షన్లతో పోరాడతాయి. ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. వర్షాకాలంలో సాయంత్రం వేళల్లో ఇది చక్కని పానీయం.

4. పెప్పర్ మింట్ టీ:

కడుపులో అజీర్తి, అసౌకర్యం లాంటి సమస్యలను ఇది పూర్తిగా తగ్గిస్తుంది. నీళ్లు, ఆహారం కాలుష్యం వల్ల ఈ సమస్యలు తరచుగా రావచ్చు. అందుకే వర్షాకాలంలో ఇది మంచి ఉపశమనం ఇస్తుంది.

5. తులసి టీ:

తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు, రోగ నిరోధక శక్తి పెంచే ఏజెంట్లుంటాయి. శ్వాస సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం ఇస్తుందీ టీ. వర్షాకాలంలో ఈ టీ చాలా రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.

6. దాల్చినచెక్క టీ:

ఈ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. దాల్చిన చెక్క ప్రసరణ పెంచుతుంది. శ్వాస సంబంధిత ఇన్పెక్షన్లు రాకుండా కాపాడుతుంది.

7. చేమంతి టీ:

రోజులో కాస్త దిగులుగా, ఒత్తిడిగా, ఆలసటగా ఉంటే ఈ చేమంతి టీ తాగితే ఉపశమనం ఉంటుంది. గొంతులో మంట, శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది, పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని కూడా ఈ టీ తగ్గిస్తుంది. నిద్ర పట్టకపోతే ఒక కప్పు చేమంతి టీ తాగితే ఫలితం ఉంటుంది.

మసాలా టీ, అల్లం టీ లాంటి సాంప్రదాయ టీలు టీ పొడి, పాలు కలిపి తయారు చేస్తారు. వీటిని తినక ముందు, లేదా తిన్న తరువాత గంట సమయం ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే టీ పొడిలో ఉండే కొన్ని పదార్థాల వల్ల మనం తినే ఆహారం నుంచి ఐరన్ శోషణ జరగకుండా అడ్డుకుంటుంది. కాబట్టి తిన్న వెంటనే లేదా ముందు టీ తాగకపోవడమే మంచిది. అలాగే ఉపశమనంగా ఉందని టీ రోజులో ఎక్కువసార్లు తాగితే ఆకలి మీద ప్రభావం పడుతుంది. ఒత్తిడి పెరగొచ్చు. పెప్పర్ మింట్, దాల్చిన చెక్కతో చేసిన టీలు మాత్రం తిన్నాక ఒక అరగంటాగి తాగొచ్చు. ఇవి జీర్ణశక్తిని పెంచుతాయి.

టాపిక్