Diabetes: ఈ 5 ముఖ్యమైన పోషకాలతో డయాబెటిస్‌కు చెక్ పెట్టండి-diabetes 5 important nutrients that can lower diabetes risk ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diabetes: ఈ 5 ముఖ్యమైన పోషకాలతో డయాబెటిస్‌కు చెక్ పెట్టండి

Diabetes: ఈ 5 ముఖ్యమైన పోషకాలతో డయాబెటిస్‌కు చెక్ పెట్టండి

HT Telugu Desk HT Telugu
Feb 13, 2023 05:12 PM IST

Diabetes: 5 ముఖ్యమైన పోషకాలతో డయాబెటిస్‌కు చెక్ పెట్టొచ్చని న్యూట్రిషనిస్ట్ చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూడండి.

5 ముఖ్యమైన పోషకాలతో డయాబెటిస్‌కు చెక్
5 ముఖ్యమైన పోషకాలతో డయాబెటిస్‌కు చెక్ (Pexels)

ప్రిడయాబెటిస్ ఉన్నవారు విటమిన్ డి తగినంత తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుందని ఇటీవల మసాచుసెట్స్‌లోని టఫ్ట్స్ మెడికల్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు కనుగొన్నారు. శరీరం తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయనప్పుడు లేదా ఇన్సులిన్‌ను నిరోధించినప్పుడు టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. ఇది శరీరంలో రక్తంలో చక్కెర అసమతుల్యతను కలిగిస్తుంది. అదనపు చక్కెర మన అంతర్గత ప్రక్రియలకు హాని కలిగించవచ్చు. విటమిన్ డి, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, సెలీనియం, క్రోమియం మధుమేహాన్ని నిరోధించడంలో సహాయడతాయి. మీరు తినే ఆహారం మీ సంపూర్ణ ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. పోషకాహార లోపం వల్ల కొన్ని వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. రక్తహీనత లేదా బోలు ఎముకల వ్యాధి (ఆస్టియోపోరోసిస్) వంటి అనేక వ్యాధుల వెనుక ఉన్న ప్రధాన కారకాల్లో పోషకాహార లోపం కూడా ఒకటి.

‘టైప్ 2 డయాబెటిస్ అనేది జీవనశైలి రుగ్మత. ఇది పోషకాహారం తీసుకోవడం, శారీరకంగా చురుగ్గా ఉండటం వల్ల అదుపులో ఉంటుంది. శరీరంలో ఇన్‌ఫ్లేషన్ వల్ల కూడా డయాబెటిస్ వస్తుంది. ఆహారాల సరైన కలయికకు ఈ మంటను తగ్గించే శక్తిని కలిగి ఉంటుంది. సరైన పోషకాహారం తీసుకుంటే ప్రారంభ దశలో మధుమేహాన్ని తిప్పికొట్టవచ్చు..’ అని న్యూట్రిషనిస్ట్ అవంతి దేశ్‌పాండే చెప్పారు. డయాబెటిస్ ముప్పు తగ్గించేందుకు 5 అతి ముఖ్యమైన పోషకాలను న్యూట్రిషనిస్ట్ సూచించారు.

1. Vitamin D: విటమిన్ డి

మధుమేహం నివారణలో విటమిన్ డి పాత్ర ఇటీవలి కాలంలో విస్తృతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. విటమిన్ డి లోపం వల్ల ఇన్సులిన్ విడుదల తగ్గడం, ఇన్సులిన్ నిరోధకత పెరగడం సంభవిస్తోంది. విటమిన్ డి లోపాన్ని నివారిస్తే అది ఇన్సులిన్ స్రావాన్ని పునరుద్ధరిస్తుంది. దీనికి కారణం కాల్షియం సంశ్లేషణకు విటమిన్ డి అవసరం. ఇన్సులిన్ స్రావం కాల్షియం-ఆధారిత ప్రక్రియ. అందువల్ల విటమిన్ డి లోపం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది.

ఆహార వనరులలో విటమిన్ డి పరిమితంగా ఉంటుంది. గుడ్డు సొన, కొవ్వు చేపలు, కొన్ని రకాల పుట్టగొడుగులలో విటమిన్ డి ఉంటుంది. విటమిన్ డిని సూర్యరశ్మి విటమిన్ అంటారు. చర్మం కింద ఉండే డి2 విటమిన్ యాక్టివ్ డి3గా మారుతుంది. చాలా మంది వ్యక్తులు చలికాలంలో సూర్యరశ్మి పరిమితంగా ఉండే ప్రదేశాలలో నివసించడం వల్ల లేదా ఎక్కువ సమయం లోపల ఉండటం వల్ల సూర్యరశ్మి పరిమితమవుతుంది. దీని కారణంగా విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. మధుమేహం అదుపులో ఉండాలంటే మీ విటమిన్ డి స్థాయిలను ఆరు నెలలకు ఒకసారి పరీక్షించడం, అవసరమైతే సప్లిమెంట్ తీసుకోవడం ఉత్తమం.

2. Fiber: ఫైబర్

డయాబెటిస్ ఉన్న వారు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఫైబర్ మీ బరువును అదుపులో ఉంచడమే కాకుండా మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో పెడుతుంది. ఫైబర్ రెండు రకాలు. కరగనిది, కరిగేది. పొట్టు, కూరగాయలు, తృణధాన్యాలలో ఉండే కరగని ఫైబర్ జీర్ణవ్యవస్థను సజావుగా నడిపిస్తుంది. ఓట్‌మీల్, గింజలు, బీన్స్ వంటి కాయధాన్యాలు, బఠానీలలో ఉండే కరిగే ఫైబర్ మీ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, రక్తంలో గ్లూకోజ్ నియంత్రణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆహారంలో పండ్లు, కూరగాయలను చేర్చడం, ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించడం మరిచిపోకండి.

3. Omega 3 fatty acids: ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్

సాధారణ పెరుగుదల, అభివృద్ధికి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అవసరం. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ప్లాస్మా ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించి, హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ను పెంచుతాయని అనేక అధ్యయనాలు నివేదించాయి.

ఇన్‌ఫ్లమేషన్ వల్ల మధుమేహం వస్తుంది. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు డీహెచ్ఏ, ఈపీఏ రూపంలో మొక్కల్లో లభిస్తాయి. అలాగే సార్డినెస్, మాకేరెల్, సాల్మన్, ట్యూనా, హెర్రింగ్ మొదలైన సముద్ర చేపల్లో లభిస్తాయి. శాఖాహారంలో అయితే అవిసె గింజలు, గుమ్మడికాయ, పుచ్చకాయ గింజలు, బాదం, వాల్‌నట్ వంటి గింజలలో కూడా లభిస్తాయి.

వారానికి కనీసం 2 సార్లు చేపలను ఆహారంలో చేర్చుకోవడం, ప్రతిరోజూ 1-2 టేబుల్ స్పూన్ల గింజలు ఆహారంలో చేర్చుకోవడం మరిచిపోవద్దు.

4. Selenium: సెలీనియం

సెలీనియం ఒక యాంటీఆక్సిడెంట్ పోషకం. ప్యాంక్రియాటిస్ పనితీరును మెరుగుపరుస్తుంది. 75 మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు 6 నెలల పాటు ఖాళీ కడుపుతో 200 మైక్రోగ్రాముల సెలీనియం తీసుకున్నప్పుడు వారి రక్తంలో చక్కెర, హెచ్‌బిఎ1సి, కొలెస్ట్రాల్, ఎల్‌డిఎల్‌లో తగ్గుదల, హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్‌లో పెరుగుదల కనిపించినట్టు ఓ అధ్యయనంలో తేలింది.

బీన్స్, కాయధాన్యాలు, చేపలు, బలవర్థకమైన తృణధాన్యాలు, గోధుమలలో సెలీనియం లభిస్తుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా ఉండే ఆహారం మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

5. Chromium: క్రోమియం

క్రోమియం ఇన్సులిన్ చర్యను మెరుగుపరిచే ముఖ్యమైన ఖనిజం. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో క్రోమియం లోపం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. క్రోమియం సప్లిమెంట్స్ ఇన్సులిన్ చర్యను మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా అధిక బరువు ఉన్న వ్యక్తులలో గుండె సంబంధ వ్యాధులకు సంబంధించిన ముప్పును తగ్గిస్తాయి. మాంసం, గింజ ధాన్యాలు, పండ్లతో సహా అనేక ఆహారాలలో క్రోమియం ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం