Corn Pakoda: మొక్కజొన్నతో ఇలా వేడి వేడి పకోడీ చేయండి, రుచి అదిరిపోతుంది, రెసిపీ ఇదిగో
Corn Pakoda: మొక్కజొన్న పొత్తులు మార్కెట్లో ఎప్పుడూ దొరుకుతాయి. వీటితో వేడివేడిగా పకోడీ చేస్తే సాయంత్రం స్నాక్‌గా ఉపయోగపడుతుంది. ఇది శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది.
Corn Pakoda: మొక్కజొన్నలు అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. వీటిని కాల్చుకొని, ఉడకబెట్టుకొని తినేవారి సంఖ్య ఎక్కువే. అలాగే మొక్కజొన్నల గారెలను ఇష్టంగా తింటారు. ఎప్పుడూ వీటినే కాదు ఒకసారి పకోడీలను కూడా చేసుకొని తినండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ముఖ్యంగా మొక్కజొన్నలు ఆరోగ్యానికి మంచివి. కాబట్టి వీటితో చేసిన ఆహారాలు రుచిగా ఉంటాయి. మొక్కజొన్న పకోడీలు ఇప్పుడు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం.
మొక్కజొన్న పకోడీ రెసిపీకి కావలసిన పదార్థాలు
మొక్కజొన్న గింజలు - ఒక కప్పు
జీలకర్ర - ఒక స్పూను
పచ్చిమిర్చి తరుగు - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
కరివేపాకులు - గుప్పెడు
వంట సోడా - చిటికెడు
అల్లం తరుగు - ఒక స్పూను
బియ్యంప్పిండి - రెండు స్పూన్లు
శెనగపిండి - అర కప్పు
మొక్కజొన్న పకోడీలు రెసిపీ
1. తాజా మొక్కజొన్న గింజలను పకోడీ చేయడానికి తీసుకోవాలి. అప్పుడే ఇవి టేస్టీగా ఉంటాయి.
2. అల్లం తరుగు, పచ్చిమిరపకాయలు, జీలకర్రను మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి.
3. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో మొక్కజొన్న గింజలను కూడా వేసి రుబ్బుకోవాలి.
4. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులో శెనగపిండి, బియ్యంప్పిండి వేసి కలుపుకోవాలి.
5. అందులో కరివేపాకుల తరుగు, కొత్తిమీర తరుగును కూడా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి.
6. స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేసుకోవాలి.
7. నూనె వేడెక్కాక ఈ మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకోవాలి.
8. ఈ రంగు మారే వరకు కాల్చుకోవాలి. అంతే ఈ పకోడీలు రెడీ అయినట్టే.
9. ఈ మొక్కజొన్న పకోడీలను నేరుగా తినవచ్చు. లేదా ఏదైనా చట్నీతో తిన్నా టేస్టీగా ఉంటాయి.
మొక్కజొన్న తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఒకప్పుడు వీటిని పశువుల దాణాగా, కోళ్ల దాణాగా వినియోగించేవారు, వీటిలోని ఆరోగ్య పోషకాలు గురించి తెలిసాక మనుషులు తినడం ప్రారంభించారు. ఈ రెండూ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి సహాయపడుతుంది. తరచుగా తింటే శరీరంలో, వాపు, మంటను తగ్గిస్తాయి. కాల్చిన మొక్కజొన్న కన్నా ఉడికించిన మొక్కజొన్న ఆరోగ్యానికి చాలా మంచిది.
ఈ మొక్కజొన్న గింజల్లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇవన్నీ కూడా రక్తహీనత సమస్య నుంచి మనల్ని బయటపడేస్తాయి. ముఖ్యంగా గర్భవతులు మొక్కజొన్న గింజలు తినడం చాలా అవసరం. ఎందుకంటే దీనిలో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. తక్కువ బరువుతో బాధపడేవారు త్వరగా బరువు పెరగాలనుకుంటే... ప్రతిరోజు రెండు మొక్కజొన్నలను తినడం అలవాటు చేసుకోండి. నీరసం కూడా తగ్గిపోతుంది. మొక్కజొన్నలో పీచు అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.