Coconut Upma: టేస్టీ కొబ్బరి ఉప్మా రెసిపీ, బ్రేక్ ఫాస్ట్‌లో అందరికీ నచ్చడం ఖాయం
Coconut Upma: ఉప్మా పేరు చెప్పగానే చాలామందికి తినాలనిపించదు. కానీ కొబ్బరి ఉప్మాను ట్రై చేయండి. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఈ రెసిపీ కూడా చాలా సులువు.
Coconut Upma: కొబ్బరి ఉప్మా సాధారణ ఉప్మాతో పోలిస్తే టేస్టీగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు. తమిళనాడులో ఈ కొబ్బరి ఉప్మాకు క్రేజీ ఎక్కువ. బ్రేక్‌ఫాస్ట్‌లో కొత్త రుచులు కావాలనుకునేవారు ఒకసారి కొబ్బరి ఉప్మాను ప్రయత్నించండి. కొబ్బరి ఉప్మా రెసిపీ ఇక్కడ ఇచ్చాము. దీన్ని ఫాలో అయిపోండి.
కొబ్బరి ఉప్మా రెసిపీకి కావలసిన పదార్థాలు
ఉప్మా రవ్వ - ఒక కప్పు
కరివేపాకులు - మూడు స్పూన్లు
ఆవాలు - అర స్పూను
మినపప్పు - ఒక స్పూను
పచ్చి శనగపప్పు - ఒక స్పూను
కొబ్బరి తురుము - పావు కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
నెయ్యి - రెండు స్పూన్లు
నూనె - రెండు స్పూన్లు
ఎండు మిర్చి - రెండు
పచ్చి మిర్చి - రెండు
క్యారెట్ తరుగు - మూడు స్పూన్లు
అల్లం తరుగు - అర స్పూను
నీళ్లు - సరిపడా
కొబ్బరి ఉప్మా రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నెయ్యి వేయాలి.
2. ఆ నెయ్యిలో ఉప్మా రవ్వను వేసుకొని వేయించుకోవాలి.
3. రంగు మారేవరకు ఉంచి తర్వాత స్టవ్ కట్టేయాలి.
4. ఇప్పుడు మరొక కళాయి స్టవ్ మీద పెట్టుకొని నూనె వేయాలి.
5. ఆ నూనెలో ఆవాలు వేసి చిటపటలాడించాలి.
6. తర్వాత మినప్పప్పు, శనగపప్పు కూడా వేసి వేయించాలి.
7. తర్వాత కొబ్బరి తరుగు, క్యారెట్ ముక్కలు, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, అల్లం తరుగు వేసి బాగా వేయించుకోవాలి.
8. ఆ తర్వాత నీళ్లు వేయాలి. నీళ్లు సలసలా మరుగుతున్నప్పుడు కొబ్బరి తురుమును అందులో వేసుకోవాలి.
9. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి బాగా కలుపుకోవాలి.
10. నీళ్లు చిన్న మంట మీద మరుగుతున్నప్పుడు ముందుగా వేయించుకున్న రవ్వని వేసి గరిటెతో కలుపుతూ ఉండాలి.
11. ఒక స్పూను నెయ్యిని మళ్ళీ వేసి కలపాలి.
12. చిన్న మంట మీద ఈ మిశ్రమాన్ని ఉంచి గరిటతో కలుపుతూనే ఉండాలి.
13. ఈ మొత్తం ఉప్మాలాగా దగ్గర పడ్డాక స్టవ్ కట్టేయాలి. అంతే టేస్టీ కొబ్బరి ఉప్మా రెడీ అయిపోయినట్టే.
14. దీన్ని చట్నీతో తింటే రుచి అదిరిపోతుంది. సాధారణ ఉప్మా కన్నా ఈ కొబ్బరి ఉప్మా రుచిగా ఉంటుంది.
బ్రేక్ ఫాస్ట్‌లో కొత్త రుచులను టేస్ట్ చూడాలనుకునే వారు ఈ కొబ్బరి ఉప్మాను కచ్చితంగా తినండి. దీన్ని చేయడం చాలా సులువు. సాధారణ ఉప్మాకు కొబ్బరి తురుమును జోడిస్తే సరిపోతుంది. కాబట్టి చేయడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే రవ్వను నెయ్యిలో వేయించడం మాత్రం మర్చిపోవద్దు. నేరుగా రవ్వను వేయడం వల్ల మంచి రుచి రాదు. ఇలా నెయ్యిలో వేయించి రవ్వను వేస్తే ఆ రుచి అదిరిపోతుంది. పిల్లలకి ఇది బాగా నచ్చుతుంది. కావాలనుకుంటే జీడిపప్పులను కూడా చల్లుకోవచ్చు.