Allam Pachadi: ఆంధ్ర స్టైల్‌లో అల్లం నిల్వ పచ్చడి, ఒక్కసారి చేసుకుంటే మూడు నెలలు తినవచ్చు-allam pachadi recipe in telugu know how to make this chutney ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Allam Pachadi: ఆంధ్ర స్టైల్‌లో అల్లం నిల్వ పచ్చడి, ఒక్కసారి చేసుకుంటే మూడు నెలలు తినవచ్చు

Allam Pachadi: ఆంధ్ర స్టైల్‌లో అల్లం నిల్వ పచ్చడి, ఒక్కసారి చేసుకుంటే మూడు నెలలు తినవచ్చు

Haritha Chappa HT Telugu
Apr 25, 2024 06:00 PM IST

Allam Pachadi: ఆంధ్ర స్టైల్ లో అల్లం నిల్వ పచ్చడి చేసి చూడండి. ఇడ్లీ, దోశెల్లోకి అదిరిపోతుంది. స్పైసీగా చేసుకుంటే ఆ రుచి వేరు. దీని రెసిపీ చాలా సులువు.

అల్లం నిల్వ పచ్చడి రెసిపీ
అల్లం నిల్వ పచ్చడి రెసిపీ

Allam Pachadi: దోశ, ఇడ్లీలో ఎన్ని చట్నీలు ఉన్నా... పక్కన అల్లం పచ్చడి ఉంటే ఆ రుచే వేరు. ప్రతిరోజూ అల్లం పచ్చడి ప్రత్యేకంగా చేసుకోవడం చాలా కష్టం. ఒక్కసారి చేసుకుంటే మూడు నెలలు తాజాగా ఉండే అల్లం పచ్చడి రెసిపీ ఇక్కడ ఇచ్చాము. ఎక్కువగా ఆంధ్రాలో ఈ అల్లం పచ్చడి తింటారు. ముఖ్యంగా హోటల్స్, వీధి బండ్ల మీద అమ్మే టిఫిన్స్ దగ్గర అల్లం పచ్చడి కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఇంట్లోనే టేస్టీగా చేసుకోవచ్చు. ముదురుగా ఉండే అల్లాన్ని తీసుకుంటే ఈ పచ్చడి రుచిగా వస్తుంది. దీని చేయడం చాలా సులువు.

అల్లం పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు

అల్లం తరుగు - ఒక కప్పు

బెల్లం తరుగు - పావు కప్పు

ఉప్పు - రుచికి సరిపడా

చింతపండు - 50 గ్రాములు

వేడి నీళ్లు - ఒక గ్లాసు

జీలకర్ర - ఒక స్పూన్

వెల్లుల్లి రెబ్బలు - 10

నూనె - మూడు స్పూన్లు

ధనియాలు - రెండు స్పూన్లు

మినప్పప్పు - ఒక స్పూను

పచ్చిశనగపప్పు - ఒక స్పూన్

ఎండుమిర్చి - 50 గ్రాములు

అల్లం నిల్వ పచ్చడి రెసిపీ

1. అల్లాన్ని ముదురుగా, పీచుతో ఉన్నది తీసుకుంటే ఈ నిల్వ పచ్చడి టేస్టీగా వస్తుంది.

2. అల్లాన్ని శుభ్రంగా కడిగి తరిగి పక్కన పెట్టుకోవాలి.

3. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

4. ఆ నూనెలో ధనియాలు, శెనగపప్పు, మినప్పప్పు వేసి చిన్న మంట మీద వేయించాలి.

5. అవి రంగు మారేవరకు వేగాక ఎండుమిర్చిని వేసి వేయించుకోవాలి.

6. ఆ తర్వాత అల్లం ముక్కలను కూడా వేసి వేయించాలి.

7. వీటన్నింటినీ మిక్సీలో వేసుకోవాలి.

8. మిక్సీ జార్లో రుచికి సరిపడా ఉప్పు, బెల్లం, నానబెట్టిన చింతపండు రసం కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

9. అందులో వేసేందుకు వేడి నీళ్లను మాత్రమే ఉపయోగించాలి.

10. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మెత్తగా రుబ్బాలి.

11. దీన్ని గాలి చొరబడని ఒక సీసాలో వేసి నిల్వ ఉంచుకోవాలి.

12. తినాలనిపించినప్పుడు వేసుకొని తినాలి. ఇది ఇలా ఉంచితే మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది. రుచిలో కూడా అద్భుతంగా ఉంటుంది.

ఆహారంలో అల్లాన్ని భాగం చేసుకోవడం అన్ని రకాలుగా మంచిది. పురాతన కాలం నుంచి అల్లాన్ని ఔషధంగా, మసాలాగా భావిస్తున్నారు. అనేక రకాల చికిత్సల నివారణలో కూడా దీన్ని వినియోగిస్తారు. ఇప్పటికీ ఆయుర్వేద వైద్యంలో అల్లానిది ముఖ్యపాత్ర. దీనిలో విటమిన్ సి, కెరటోనాయిడ్స్, జింక్, ఐరన్, ఫాస్పరస్, మాంగనీస్, కాపర్, ప్రోటీన్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ అల్లాన్ని తినాల్సిన అవసరం ఉంది. అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరం నుంచి అధిక ఆక్సికరణ ఒత్తిడిని బయటికి పంపిస్తాయి. ఇది నాడీ వ్యవస్థ పై మంచి ప్రభావాన్ని చూపిస్తాయి.

బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, జ్ఞాపకశక్తి బలహీనతలు వంటి సమస్యలను తగ్గిస్తాయి. నొప్పి, వాంతులు నుంచి ఉపశమనం కలిగేలా చేస్తాయి. అల్లం వాడకం వల్ల వికారం, వాంతులు వంటివి రాకుండా ఉంటాయి. ముఖ్యంగా మహిళలు అల్లాన్ని ఆహారంలో తినడం చాలా ముఖ్యం. వారికి నెలసరి సమయంలో వచ్చే పొట్టనొప్పి అల్లం వల్ల రాకుండా ఉంటుంది.

Whats_app_banner