Children Sleep: పిల్లలు సరిగా నిద్రపోవడం లేదా? తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన అధ్యయనం
Children Sleep: వివిధ కారణాల వల్ల కొందరు పిల్లలు సరిగా నిద్రపోకుండా ఉంటారు. నిద్ర నాణ్యత సరిగా ఉండదు. అయితే, పిల్లలు తగినంద నిద్రపోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి రావొచ్చని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది.
ప్రస్తుత కాలంలో చాలా మంది పిల్లలు ఆలస్యంగా నిద్రిస్తున్నారు. టీవీలు చూసుకుంటూనో, ఫోన్లు వాడుతూనో.. లేకపోతే వారికి ఇష్టమైన ఏ పనైనా చేస్తూనో త్వరగా పడుకునేందుకు మారాం చేస్తుంటారు. లేకపోతే హోం వర్క్ చేయలేదనే కారణంతో రాత్రి ఆలస్యమైనా వారిని తల్లిదండ్రులు అలాగే కూర్చోబెడుతుంటారు. ఎక్కువగా నిద్రపోవడం బద్దకమని భావించి పిల్లలను అవసరానికి కంటే తక్కువ సమయమే కొందరు పడుకోనిస్తుంటారు.
పిల్లల మెదడు వృద్ధికి నిద్ర చాలా ముఖ్యమైన విషయం. ఈ అంశాన్ని తల్లిదండ్రులు కచ్చితంగా గుర్తుంచుకోవాలి. పిల్లలు తగినంత సమయం నాణ్యంగా నిద్రించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు సరిగా నిద్రపోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయంటూ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ చేసిన అధ్యయనం మరిన్ని షాకింగ్ విషయాలు వెల్లడించింది.
మెదడు, జ్ఞాపకశక్తిపై తీవ్ర ప్రభావం
సరైన నిద్ర ఉండే పిల్లల్లో మెదడు పనితీరు బాగుంటుంది. నిద్రలేమి ఉంటే పిల్లల్లో జ్ఞాపకశక్తిపై దుష్ప్రభావం పడుతుంది. ఈ విషయాలు ఇప్పటికే తెలిసినా.. ఈ అధ్యయనం దీన్ని మరింత లోతుగా వివరించింది. నేర్చుకునేందుకు, జ్ఞాపకశక్తికి అవసరమైన నాడీ అనుసంధాన్ని అభివృద్ధి చేయడంలో నిద్ర కీలకపాత్ర పోషిస్తుందని ఈ అధ్యయనం వెల్లడించింది. పిల్లలు, పెద్దల్లో నిద్ర పాత్ర ఒకేలా ఉండదని, ప్రభావాలు వేర్వేరుగా ఉంటాయని తేల్చింది.
ఎలుకలపై అధ్యయనం
నార్త్ కరోలీనా యూనివర్సిటీ ప్రొఫెసర్ గ్రాహం డీరింగ్ నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది. స్టడీ చేసిన వారు దీనికోసం ఎలుకలను వినియోగించుకున్నారు. పెద్ద ఎలుకలు, చిన్న ఎలుకలకు నిద్ర సరిగా లేకుండా చేసి పరీక్షించారు. పెద్ద ఎలుకలతో పోలిస్తే సరైన నిద్ర లేకపోవడం చిన్న ఎలుకల మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపించిందని గుర్తించారు.
పెద్దలకు, పిల్లలకు ఇలా..
పెద్దలకు నిద్ర అనేది అవయవాలకు విశ్రాంతి, రిపేర్‌లా ఎక్కువగా ఉపయోగపడుతుంది. అయితే, పిల్లలకు నిద్ర.. మెదడు వృద్ధికి ఎక్కువ కీలకంగా ఉంటుందని ఈ అధ్యయనం వెల్లడించింది. మెదడు అభివృద్ధికి, న్యూరాన్ల కనెక్షన్లకు నిద్ర ముఖ్యమని పేర్కొంది. పిల్లల్లో సరైన నిద్రలేకపోతే మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుందని వెల్లడించింది.
నిద్రలో ఆటంకాలు కలిగితే పెద్దల కంటే పిల్లలపై ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం తేల్చింది. పిల్లల్లో, పెద్దల్లో నిద్ర ఒకేలా ఉండదని వెల్లడించింది. పిల్లల నిద్ర నాణ్యతగా లేకపోయినా, ఆటంకాలు ఎక్కువగా కలిగినా అది మెదడు పనితీరుపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని వెల్లడించింది. ప్రతీ రోజు నిద్రకు ఒక నిర్దిష్టమైన షెడ్యూల్ పెట్టుకోవడం, నిద్రకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం లాంటి అలవాట్లు చేసుకోవాలని, వీటి వల్ల పిల్లల మెదడుపై దుష్ప్రభావం పడకుండా ఉంటుందని వెల్లడించింది.
పిల్లల నిద్రకు ఎక్కువగా భంగం వాటిల్లేందుకు, న్యూరాడెవలెప్‍మెంట్ డిజార్డర్‌కు ఎక్కువ సంబంధం ఉందని చెప్పడమే ఈ అధ్యయనంలో షాకింగ్ విషయంగా ఉంది. నిద్ర సరిగా లేని చిన్న ఎలుక మెదడలో కొన్ని రకాల హార్మోన్లు ప్రభావితమయ్యాయని ఈ రిపోర్ట్ పేర్కొంది. జ్ఞాపకశక్తి, మెదడు పనితీరు, నేర్చుకునే గుణం సహా కీలకమైన హార్మోన్లకు ప్రతికూలంగా ఉన్నట్టు గుర్తించారు.
ఈ విషయాల గురించి గ్రాహం వెల్లడించారు. “జీవితం మొత్తం నిద్ర ముఖ్యమైన విషయమే. అయితే, చిన్నపిల్లలకు ఇది మరింత ఎక్కువ కీలకం. సరైన నిద్ర లేకపోవడం పిల్లల మెదడు వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. నష్టం జరిగిన తర్వాత మళ్లీ ఏమీ చేయలేం” అని ఆయన తెలిపారు. పిల్లలకు సరైన నిద్ర ఉంటేనే మెదడు వికాసం మెరుగ్గా ఉంటుందని తెలిపారు