Chicken Masala Rice: అన్నం మిగిలిపోతే ఇలా చికెన్ మసాలా రైస్ చేసేయండి, బిర్యానీ కంటే టేస్ట్‌గా ఉంటుంది-chicken masala rice recipe in telugu know how to make this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Masala Rice: అన్నం మిగిలిపోతే ఇలా చికెన్ మసాలా రైస్ చేసేయండి, బిర్యానీ కంటే టేస్ట్‌గా ఉంటుంది

Chicken Masala Rice: అన్నం మిగిలిపోతే ఇలా చికెన్ మసాలా రైస్ చేసేయండి, బిర్యానీ కంటే టేస్ట్‌గా ఉంటుంది

Haritha Chappa HT Telugu
Jul 31, 2024 11:30 AM IST

Chicken Masala Rice: ఇంట్లో అన్నం మిగిలిపోతే చాలామంది లెమన్ రైస్ చేసేస్తారు. ఒకసారి చికెన్ మసాలా రైస్ చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా చాలా సులువు.

చికెన్ మసాలా రైస్
చికెన్ మసాలా రైస్

Chicken Masala Rice: నాన్ వెజ్ ప్రియులకు వారంలో నాలుగైదు సార్లైనా చికెన్ ముక్కలు పొట్టలో పడాల్సిందే. ఎప్పుడూ కూరా, బిర్యానీనే కాదు ఓసారి చికెన్ మసాలా రైస్ వండుకుని చూడండి. అన్నం మిగిలిపోయినప్పుడు కూడా దీన్ని త్వరగా చేసుకోవచ్చు. చికెన్ మసాలా రైస్ చల్లని వాతావరణంలో వేడి వేడిగా తింటే రుచి అదిరిపోతుంది. ఇది ఎలా వండాలో ఇక్కడ ఇచ్చాము. రెసిపీ ఫాలో అయిపోండి.

చికెన్ మసాలా రైస్ రెసిపీకి కావలసిన పదార్థాలు

వండిన అన్నం - రెండు కప్పులు

చికెన్ ముక్కలు - పావు కిలో

బంగాళదుంప - ఒకటి

గసగసాలు - చిటికెడు

నువ్వులు - పావు స్పూను

నిమ్మకాయ రసం - ఒక స్పూను

అల్లం వెల్లుల్లి పేస్టు - అర స్పూను

ఉల్లిపాయ - ఒకటి

ఉప్పు - రుచికి సరిపడా

బిర్యానీ ఆకు - ఒకటి

నెయ్యి - ఒక స్పూను

యాలకులు - రెండు

నూనె - సరిపడినంత

లవంగాలు - రెండు

జీలకర్ర - పావు స్పూను

కొత్తిమీర తరుగు - ఒక స్పూను

పుదీనా తరుగు - ఒక స్పూను

పచ్చిమిర్చి తరుగు - అర స్పూను

కారం - అర స్పూను

దాల్చిన చెక్క - చిన్న ముక్క

చికెన్ మసాలా రైస్ రెసిపీ

1. ముందుగా అన్నాన్ని వండుకొని పక్కన పెట్టుకోవాలి. అది ముద్ద కాకుండా ఒక పళ్లెంలో పొడిపొడిగా ఆరబెట్టుకోవాలి.

2. ఇప్పుడు చికెన్ మసాలాను ముందుగా రెడీ చేసుకోవాలి.

3. దీనికోసం స్టవ్ మీద కళాయి పెట్టి దాల్చిన చెక్క, ధనియాలు, నువ్వులు, గసగసాలు, లవంగాలు, జీలకర్ర, యాలకులు వేసి వేయించుకోవాలి.

4. వీటి మొత్తాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. అంతే చికెన్ మసాలా రెడీ అయిపోతుంది.

5. ఇప్పుడు స్టవ్ మీద మరొక కళాయిని పెట్టి నూనె వేయాలి.

6. ఆ నూనెలో బిర్యానీ ఆకులు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు వేసి వేయించాలి.

7. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం కూడా వేసి వేయించాలి.

8. ఈ మిశ్రమంలోనే ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసి బాగా వేయించాలి.

9. ఇప్పుడు శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కలను వేసి చిన్న మంట మీద ఉడికించుకోవాలి.

10. చికెన్ నుంచి నీరు దిగి అది వేపుడులా అయ్యే వరకు వేయించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి.

11. కొత్తిమీర తరుగు, పుదీనా తరుగును కూడా వేయాలి.

12. ఇవన్నీ ఉడికాక ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని వేసి పులిహోర లాగా కలుపుకోవాలి.

13. అంతే టేస్టీ చికెన్ మసాలా రైస్ రెడీ అయిపోతుంది. చికెన్ ఉడకడానికి అవసరమైతే నాలుగైదు స్పూన్ల నీటిని వేయవచ్చు.

14. అవసరం లేకపోతే వేయకండి. ఈ చికెన్ మసాలా రైస్ స్పైసీగా తింటే చాలా రుచిగా ఉంటుంది.

వర్షం పడుతున్నప్పుడు వాతావరణం చాలా చల్లగా మారిపోతుంది. అలాంటి సమయంలో ఇలా చికెన్ మసాలా రైస్ ను చేసి పెట్టుకుంటే తినాలన్న కోరిక పుడుతుంది. దీని రుచి కూడా కాస్త భిన్నంగా ఉంటుంది. కాబట్టి తినేటప్పుడు నోరూరిపోవడం ఖాయం. ఎప్పుడు బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ వేపుడే కాదు ఇలా చికెన్ మసాలా రైస్ కూడా ఒకసారి చేసి తిని చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం.

Whats_app_banner