Chicken Ghee Roast: చికెన్ ఘీ రోస్ట్ ఇలా చేశారంటే ఒక్క ముక్క కూడా మిగలదు, రుచి అదిరిపోతుంది-chicken ghee roast recipe in telugu know how to make this fry ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Ghee Roast: చికెన్ ఘీ రోస్ట్ ఇలా చేశారంటే ఒక్క ముక్క కూడా మిగలదు, రుచి అదిరిపోతుంది

Chicken Ghee Roast: చికెన్ ఘీ రోస్ట్ ఇలా చేశారంటే ఒక్క ముక్క కూడా మిగలదు, రుచి అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu

Chicken Ghee Roast: మంగుళూరులో ఎక్కువ మంది ఇష్టపడే రెసిపీ చికెన్ ఘీ రోస్ట్. ఇది ఒక క్లాసిక్ వంటకం. దీన్ని తిన్నారంటే మరిచిపోలేరు. ఒక్క ముక్క కూడా మిగలకుండా ఖాళీ అయిపోతుంది. చికెన్ ఘా రోస్ట్ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

చికెన్ ఘీ రోస్ట్ రెసిపీ

Chicken Ghee Roast: మంగళూరులోని కుందాపూర్ అనే చిన్న పట్టణానికి చెందిన వంటకం చికెన్ ఘా రోస్ట్. ఇది ఒక క్లాసిక్ వంటకం. బెంగుళూరులోని ప్రతి రెస్టారెంట్లో ఇది కచ్చితంగా కనిపిస్తుంది. నెయ్యిలో వేయించిన మసాలాతో దీన్ని తయారు చేస్తారు. ఒక్కసారి తిన్నారంటే జీవితాంతం మర్చిపోలేరు. దీన్ని ఇంట్లోనే వండుకోవచ్చు. చికెన్ ఘీ రోస్ట్ చేస్తే ఒక్క ముక్క కూడా మిగలదు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో తెలుసుకోండి. చికెన్ ఘీ రోస్ట్ ఉండడానికి 45 నిమిషాల సమయం పడుతుంది.

చికెన్ ఘీ రోస్ట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

చికెన్ - కిలో

పసుపు - అర స్పూను

నిమ్మరసం - ఒక స్పూను

పెరుగు - అరకప్పు

ఉప్పు - రుచికి సరిపడా

బెల్లం తురుము - ఒక స్పూను

కరివేపాకులు - గుప్పెడు

నెయ్యి - ఐదు స్పూన్లు

ఎండుమిర్చి - ఏడు

మిరియాలు - 8

లవంగాలు - మూడు

మెంతులు - చిటికెడు

ధనియాలు - ఒకటిన్నర స్పూను

జీలకర్ర - ఒక స్పూను

చింతపండు - ఉసిరికాయ సైజులో

వెల్లుల్లి రెబ్బలు - ఎనిమిది

చికెన్ ఘీ రోస్ట్ రెసిపీ

1. చికెన్ ముక్కలు మీడియం సైజ్ లో ఉన్నవి తీసుకోవాలి.

2. ఒక గిన్నెలో శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కలను వేసి పెరుగు, పసుపు, నిమ్మరసం, ఉప్పు కలిపి మ్యారినేట్ చేసుకోవాలి.

3. రెండు నుంచి మూడు గంటల పాటు అలా వదిలేయాలి. లేదా రాత్రి పూట ఇలా మ్యారినేట్ చేసి ఫ్రిజ్లో పెట్టుకున్నా సరిపోతుంది.

4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఎండుమిర్చిని వేయించాలి.

5. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో నెయ్యి వేసి మెంతులు, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, మిరియాలు వేసి వేయించాలి.

6. వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి.

7. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించిన ఎండుమిర్చి, మసాలా దినుసులతో పాటు చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తటి పొడిలా చేసుకోవాలి.

8. ఇప్పుడు మరొక గిన్నెను స్టవ్ మీద పెట్టి నెయ్యిని వేయాలి.

9. నెయ్యి వేడెక్కాక అందులో మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను వేసి చిన్న మంట మీద ఉడికించుకోవాలి.

10. చికెన్ ముక్కల్లో నీరు దిగి అదంతా ఆవిరి అయిపోయి ముక్కలు మాత్రమే మిగులుతాయి.

11. అందులో పొడిచేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. కావాలంటే మరి కొంచెం నెయ్యిని వేసుకోవచ్చు.

12. అలాగే బెల్లం తురుమును వేసి వేయించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును బాగా కలుపుకోవాలి.

13. చిన్న మంట మీద ఈ మిశ్రమాన్ని ఫ్రై చేయాలి. చికెన్ ముక్కలు ఎర్రగా అయ్యేంతవరకు ఫ్రై చేశాక పైన కరివేపాకును జల్లుకోవాలి.

14. అంతే టేస్టీ చికెన్ ఘీ రోస్ట్ రెడీ అయినట్టే. దీన్ని అన్నంలో కలుపుకొని తింటే రుచిగా ఉంటుంది.

15. కేవలం చికెన్ ముక్కలను తిన్నా బాగుంటుంది. ఇవి కాస్త స్పైసీగా, ఎర్రగా ఉంటాయి. కాబట్టి చూడగానే తినేయాలన్న కోరిక పుడుతుంది.

మంగళూరులోని స్పెషల్ చికెన్ వంటకం ఇది. మంగళూరు వెళ్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తిని రావాల్సిన వంటకాలలో చికెన్ ఘీ రోస్ట్ కూడా ఒకటి. దీన్ని ఒకసారి మీరు ఇంట్లోనే వండి చూడండి. మీకే కాదు పిల్లలకు కూడా నచ్చడం ఖాయం.