Carrot Pulao: నోటికి ఏదీ తినాలనిపించనప్పుడు స్పైసీగా క్యారెట్ పలావ్ చేసుకుని చూడండి, రెసిపీ ఇదిగో
Carrot Pulao: ఒక్కోసారి నోటికి ఏది తినాలనిపించదు. చప్పగా అనిపిస్తుంది. అలాంటప్పుడు స్పైసీగా క్యారెట్ పలావు తింటే యమ్మీగా ఉంటుంది. దీని రెసిపీ కూడా చాలా సులువు.
Carrot Pulao: క్యారెట్ రెసిపీలు ఎన్నో ఉన్నాయి. క్యారెట్ తో ఎక్కువగా స్వీట్లు తయారు చేస్తూ ఉంటారు. మరి కొందరు వీటితో కూరలు, వేపుడు చేస్తూ ఉంటారు. క్యారెట్‌తో పలావ్ చేసి చూడండి. రుచి అదిరిపోతుంది. నోరు చప్పగా ఉన్నప్పుడు, ఏదీ తినాలనిపించనప్పుడు ఇలా క్యారెట్ పలావ్ తింటే అదిరిపోతుంది. పచ్చిమిర్చిని కాస్త ఎక్కువ వేసుకుని స్పైసీగా వచ్చేలా చేయండి. ఆ రుచి మాములుగా ఉండదు. కాస్త కారం తగ్గిస్తే పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ గా కూడా ఉపయోగపడుతుంది. దీన్ని ఇష్టంగా తింటారు. పిల్లలకు క్యారెట్ పలావ్ పెట్టి, కప్పు పెరుగును లంచ్ బాక్స్ లో పెట్టేస్తే సాయంత్రం వచ్చేసరికి బాక్స్ ఖాళీగా ఉండడం ఖాయం.
క్యారెట్ పలావ్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
క్యారెట్లు - అయిదు
బాస్మతి బియ్యం - ఒక కప్పు
నీరు - సరిపడినంత
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - చిటికెడు
నెయ్యి - రెండు స్పూన్లు
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
బిర్యానీ ఆకు - ఒకటి
మరాఠీ మొగ్గ - ఒకటి
యాలకులు - రెండు
లవంగాలు - మూడు
అనాసపువ్వు - ఒకటి
పచ్చి బఠానీలు - అరకప్పు
కొత్తిమీర తురుము - రెండు స్పూన్లు
పుదీనా తురుము - రెండు స్పూన్లు
పచ్చిమిర్చి - మూడు
క్యారెట్ పలావ్ రెసిపీ
1. క్యారెట్లను శుభ్రంగా కడిగి పైన పొట్టు తీసి సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి కుక్కర్ పెట్టి నెయ్యి వేయాలి.
3. ఆ నెయ్యిలో బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, అనాసపువ్వు, మరాఠీ మొగ్గ వేసి వేయించాలి.
4. ఆ తర్వాత తురిమిన క్యారెట్, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
5. అందులోనే బఠానీలను కూడా వేసి వేయించుకోవాలి.
6. పసుపు వేసి మూత పెట్టి మూడు నిమిషాల పాటు చిన్న మంట మీద వేయించాలి.
7. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. అర గ్లాసు నీళ్లు పోసి ఉడకనివ్వాలి.
8. ఆ మిశ్రమం అంతా ఇగురులాగా అవుతుంది. అప్పుడు బాస్మతి బియ్యాన్ని వేసి బాగా కలుపుకోవాలి.
9. బియ్యం ఉడకడానికి సరిపడా నీటిని వేసి పైన కొత్తిమీర తురుమును చల్లుకోవాలి.
10. పుదీనా తరుగు చల్లుకోవాలి. కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి.
11. ఆవిరి పోయాక కుక్కర్ మూత తీస్తే ఘమఘమలాడే క్యారెట్ పులావ్ రెడీ అయిపోతుంది.
12. దీనికి జతగా ఏదీ లేకపోయినా చక్కగా తినొచ్చు. లేదా ఈ పలావును మీరు స్పైసీగా చేసుకుంటే పక్కన ఉల్లిపాయ ముక్కలు పెట్టుకోండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిదే.
క్యారెట్ పలావ్ రెసిపీలో ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలనే వినియోగించాం. క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. అలాగే పచ్చిబఠానీలు, పసుపు, మసాలా దినుసుల్లో కూడా ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి మేలు చేసేవే. పిల్లలకు పెట్టినప్పుడు పచ్చిమిర్చి లేదా కారం తగ్గించుకుంటే సరిపోతుంది. స్పైసీగా తినాలనుకుంటే మాత్రం పచ్చిమిర్చిని వేసుకోండి.