Carrot Payasam: ఎప్పుడూ క్యారెట్ హల్వానేనా... ఒకసారి క్యారెట్ పాయసం చేసి చూడండి, రుచి అదిరిపోతుంది
Carrot Payasam: క్యారెట్ తో చేసే వంటకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎక్కువ మంది క్యారెట్ హల్వా చేస్తూ ఉంటారు. ఒకసారి క్యారెట్ పాయసాన్ని ప్రయత్నించండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
Carrot Payasam: క్యారెట్‌తో చేసిన ఆహారాలు ఏవైనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. క్యారెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ కూడా ఉంటుంది. కాబట్టి క్యారెట్ ఆహారంలో భాగం చేసుకోమని వైద్యులు సూచిస్తూ ఉంటారు. క్యారెట్‌తో ఎక్కువమంది చేసే స్వీట్ క్యారెట్ హల్వా. కేవలం అది మాత్రమే కాదు ఒకసారి క్యారెట్ పాయసం చేసి చూడండి. ఇది చేయడం చాలా సులువు. పిల్లలకు బాగా నచ్చుతుంది. నోటిలో వేస్తే కరిగిపోయేలా ఉంటుంది.
క్యారెట్ పాయసం రెసిపీకి కావాల్సిన పదార్థాలు
క్యారెట్లు - ఆరు
యాలకుల పొడి - పావు స్పూను
నెయ్యి - రెండు స్పూన్లు
పాలు - అర లీటరు
చక్కెర - పావు కప్పు
కార్న్ ఫ్లోర్ - నాలుగు స్పూన్లు
క్యారెట్ పాయసం రెసిపీ
1. క్యారెట్లను శుభ్రంగా కడిగి పైన తొక్కను తీసేసి సన్నగా తురుముకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.
3. అందులో క్యారెట్లను వేసి వేయించుకోవాలి. కాస్త నీరు కలిపితే క్యారెట్లు మెత్తగా ఉడుకుతాయి.
4. మూత పెడితే అవి నీటిలో పేస్టులా ఉడకడం మొదలవుతాయి.
5. కార్న్ ఫ్లోర్ ను చల్లటి పాలలో వేసి బాగా కలిపి పేస్టులా చేయండి.
6. ఇందుకోసం మూడు నాలుగు స్పూన్ల పాలు అవసరం పడతాయి.
7. ఆ మిశ్రమాన్ని క్యారెట్లలో వేసి బాగా కలపాలి.
8. మిగిలిన పాలను కూడా మెల్లగా క్యారెట్ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి.
9. చిన్న మంట మీదే ఉడికించాలి. కార్న్ ఫ్లోర్ వేసాక గరిటతో కలుపుతూనే ఉండాలి. లేకుంటే ఉండలు కట్టే అవకాశం ఉంది.
10. అలాగే పంచదారని కూడా వేసి బాగా కలపాలి.
11. చివరలో యాలకుల పొడిని చల్లుకోవాలి. ఇది పాయసంలాగా అయ్యాక స్టవ్ కట్టేయాలి.
12. దీన్ని చల్లారాక ఫ్రిజ్లో పెట్టుకొని తర్వాత తీసి తింటే రుచిగా ఉంటుంది.
13. క్యారెట్ హల్వా కన్నా క్యారెట్ పాయసం చేయడం చాలా సులువు. దీన్ని అమ్మవారి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇందులో నెయ్యి, పాలు, చక్కెర వినియోగించాము. ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైన పదార్థాలే.
అప్పుడప్పుడు క్యారెట్ల తో హల్వానే కాకుండా ఇలా పాయసం కూడా చేసుకొని తింటూ ఉంటే టేస్టీగా ఉంటుంది. అతిధులకు ఈ క్యారెట్ పాయసం వడ్డించి చూడండి. అందరికీ నచ్చడం ఖాయం. క్యారెట్ లో ఉన్న పోషకాలు కూడా శరీరంలో చేరుతాయి.
టాపిక్