Diet for Male infertility: హెల్తీ డైట్ పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పెంచుతుందా? వైద్యుల మాట ఇదీ-can a healthy diet regime enhance male fertility ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Can A Healthy Diet Regime Enhance Male Fertility

Diet for Male infertility: హెల్తీ డైట్ పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పెంచుతుందా? వైద్యుల మాట ఇదీ

Zarafshan Shiraz HT Telugu
Aug 20, 2023 10:00 AM IST

Diet for Male infertility: ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించడం వల్ల మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందా? ఆరోగ్య నిపుణుల మాట ఇదే.

పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పెరగాలంటే ఏం చేయాలి?
పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పెరగాలంటే ఏం చేయాలి? (Photo by Zach Reiner on Unsplash)

పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్య లోపం (మేల్ ఇన్‌ఫర్టిలిటీ) ఎక్కువగా ప్రబలంగా ఉన్న సమస్య. పురుషుల వంధ్యత్వానికి దోహదపడే అనేక కారకాలపై పరిశోధన ఇంకా కొనసాగుతున్నప్పటికీ, సమతుల్య ఆహార ప్రణాళిక ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేయలేం. మనం తినే ఆహారం పునరుత్పత్తి సామర్థ్యంతో సహా మన సాధారణ ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని స్పష్టమైంది. అందువల్ల ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించడం వల్ల పురుషుల సంతానోత్పత్తి పెరుగుతుంది.

ట్రెండింగ్ వార్తలు

బెంగుళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో గల మదర్‌హుడ్ హాస్పిటల్స్‌లో కన్సల్టెంట్ - ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ అమితా ఎన్ హెచ్‌టి లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై చర్చించారు.

“పోషకాహార లోపాలు, ఆక్సీకరణ ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత సాధారణ స్పెర్మ్ నాణ్యత తదితర అంశాలు పురుషుల సంతానోత్పత్తితో ముడిపడి ఉన్నాయి. పునరుత్పత్తి ఆరోగ్యానికి తోడ్పడే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు. ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉండే సమతుల ఆహారం ద్వారా అవసరమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ అందుతాయి. ఈ ఆహారాలు ఆరోగ్యవంతమైన స్పెర్మ్ ఉత్పత్తి, చలన శీలతను ప్రోత్సహిస్తాయి.

పండ్లు, కూరగాయలు సంతానోత్పత్తిని పెంచే ఆహారంలో ప్రధానమైనవి. బీటా-కెరోటిన్, విటమిన్లు సి, ఇ, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం ద్వారా ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడుతాయి. ఇవి స్పెర్మ్ డీఎన్‌ఏకి జరిగే హానిని తగ్గిస్తాయి. బెర్రీలు, సిట్రస్ పండ్లు, బచ్చలికూర, బ్రోకలీ వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు స్పెర్మ్ పనితీరును, నాణ్యతను మెరుగుపరుస్తాయి..’ అని వివరించారు.

“కాంప్లెక్స్ పిండి పదార్థాలు, ఫైబర్, ముఖ్యమైన బీ విటమిన్లు అన్నీ బ్రౌన్ రైస్, క్వినోవా, ఓట్స్ వంటి తృణధాన్యాలలో లభిస్తాయి. ఈ పోషకాలు హార్మోన్ల నియంత్రణలో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన టెస్టోస్టెరాన్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర నిర్వహణలో సహాయం చేయడంతో పాటు, తృణధాన్యాలు సంతానోత్పత్తిని మెరుగుపరుస్తాయి. ఎక్కువ చక్కెర వినియోగం హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. చేపలు, చికెన్, బీన్స్, గింజలు వంటి లీన్ ప్రోటీన్ పురుషుల సంతానోత్పత్తికి గొప్ప పునాదిని అందిస్తాయి. ఈ ఆహారాలు కీలకమైన అమైనో ఆమ్లాలను అందిస్తాయి. సాల్మన్, సార్డినెస్ వంటి సీఫుడ్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు స్పెర్మ్ మెంబ్రేన్ చలనశీలత, నిర్మాణ సమగ్రతకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన కొవ్వులు అవసరం. అవకాడో, ఆలివ్ ఆయిల్, బాదం పప్పులలో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులను తీసుకోవడం వల్ల హార్మోన్ బ్యాలెన్స్, స్పెర్మ్ నాణ్యత పెరుగుతుంది.. విటమిన్ ఇ కోసం బాదం, వాల్‌నట్, అంజీర్ తినడం అవసరం..’ అని వివరించారు.

‘పురుషుల వంధ్యత్వానికి చికిత్స చేయడానికి ఒక సమగ్ర వ్యూహం అవసరం. పౌష్టికాహారంతో పాటు అదనంగా స్థిరమైన వ్యాయామం, ఒత్తిడి మేనేజ్ చేయడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం అవసరం..’ అని వివరించారు.

డాక్టర్ మనీషా సింగ్ సూచనలు ఇవీ

బెంగుళూరులోని బన్నెరఘట్ట రోడ్‌లోని ఫోర్టిస్ హాస్పిటల్‌లో సీనియర్ కన్సల్టెంట్ - గైనకాలజిస్ట్, రిప్రొడక్టివ్ మెడిసిన్ డాక్టర్ మనీషా సింగ్ తన నైపుణ్యాన్ని పంచుకున్నారు.

‘ఆరోగ్యకరమైన ఆహారం పురుషుల సంతానోత్పత్తిని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. నిర్దిష్ట ఆహారాలలో ఉండే కొన్ని విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు స్పెర్మ్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని అనేక అధ్యయనాలు నిరూపించాయి. సిట్రస్ పండ్లు, టొమాటోలు, బ్రోకలీలో ఉండే విటమిన్ సి స్పెర్మ్‌ను డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి. అలాగే టెస్టోస్టెరాన్ ఉత్పత్తిలో పాత్ర పోషిస్తుంది. గింజలు, ఆకు కూరలలో లభించే విటమిన్ ఇ స్పెర్మ్‌ను రక్షిస్తుంది. ఆరోగ్యకరమైన స్పెర్మ్ పొరల ఉత్పత్తిలో సహాయపడుతుంది. ఫోలేట్ ఆకు కూరలు, సిట్రస్ పండ్లు బీన్స్‌లో సమృద్ధిగా ఉంటుంది. ఇది స్పెర్మ్‌లో కణ విభజన, డీఎన్ఏ ఉత్పత్తికి అవసరం. చేపలు, వాల్‌నట్‌లు, అవిసె గింజలలో లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ స్పెర్మ్ చలనశీలతను మెరుగుపరుస్తాయి. టమోటాలు, ఎర్రటి పండ్లు, కూరగాయలలో ఉండే లైకోపీన్ స్పెర్మ్ నాణ్యత, పరిమాణాన్ని మెరుగుపరుస్తుందని తేలింది. గింజలు, చిక్కుళ్లలో కనిపించే అర్జినైన్ నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిలో పాల్గొంటుంది. ఇది స్పెర్మ్ ఆరోగ్యానికి మద్దతుగా రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది..’ అని ఆమె వివరించారు.

“తృణధాన్యాలు లీన్ ప్రోటీన్లు, ముదురు ఆకుపచ్చ కూరగాయలు పురుషుల సంతానోత్పత్తికి దోహదం చేస్తాయి. తృణ ధాన్యాల్లో ఫైబర్, బీ విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. జింక్‌, లీన్ ప్రోటీన్‌తో పాటు విలువైన పోషకాలను అందిస్తాయి. బచ్చలి కూర, కాలే, బ్రోకలీ వంటి ముదురు ఆకుపచ్చ కూరగాయలు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఫోలేట్‌తో నిండి ఉంటాయి. ఇవి జీర్ణక్రియలో సహాయపడతాయి. ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. పురుషుల సంతానోత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. పురుషుల సంతానోత్పత్తికి కొన్ని నిర్దిష్ట ఆహారాలు కూడా ప్రయోజనకరంగా ఉన్నాయని తేలింది. సిట్రస్ పండ్లు విటమిన్ సిని అందిస్తాయి. ఇది స్పెర్మ్ దెబ్బతినకుండా కాపాడుతుంది. టొమాటోలు లైకోపీన్‌ను అందిస్తాయి. ఇది స్పెర్మ్ నాణ్యత, పరిమాణాన్ని మెరుగుపరుస్తుంది. బచ్చలికూర ఫోలేట్ యొక్క మంచి మూలం. కణ విభజన, డీఎన్ఏ ఉత్పత్తికి ముఖ్యమైనది. మెంతులు స్పెర్మ్ చలనశీలతను మెరుగుపరచడంలో మంచి ప్రభావాలను చూపిన ఒక మూలిక. వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి స్పెర్మ్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గుడ్లు స్పెర్మ్ ఉత్పత్తికి అవసరమైన ప్రోటీన్, ఇతర ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి. పొటాషియం అధికంగా ఉండే అరటిపండ్లు, ఆరోగ్యకరమైన కొవ్వు కలిగిన అవకాడోలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. సాల్మన్, ట్యూనా, మాకేరెల్ వంటి జిడ్డు గల చేపలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలకు అద్భుతమైన మూలాలు, క్యారెట్‌లు బీటా-కెరోటిన్‌ను అందిస్తాయి. ఇది విటమిన్ ఎగా మారుతుంది. ఇది స్పెర్మ్ ఉత్పత్తికి ముఖ్యమైనది..’ అని వివరించారు.

WhatsApp channel