డయాబెటిస్‌ను అదుపులో ఉంచే 7 ఫైబర్ రిచ్ ఫుడ్స్
డయాబెటిస్ ఉన్నప్పుడు మనం తీసుకునే ఆహారంలో కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటే రక్తంలో చక్కెర స్థాయిని వెంటనే పెంచుతుంది. అయితే ఫైబర్ ఫుడ్ తీసుకుంటే మాత్రం రక్తంలో గ్లూకోజు నెమ్మదిగా పెరుగుతుంది. తద్వారా మధుమేహం అదుపులో ఉంటుంది.
భారతదేశంలో 101 మిలియన్ల మందికి మధుమేహం ఉంది. అలాగే ప్రీడయాబెటిక్ లేదా వ్యాధి వచ్చే అంచున ఉన్నవారు 136 మిలియన్లకు చేరుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. డయాబెటిస్ సమస్య పెరుగుతూనే ఉన్నందున, వ్యాధిని ఎదుర్కోవడానికి మన ప్రయత్నాలు కూడా తీవ్రతరం కావాలి. ఆహారపు అలవాట్ల నుండి మన జీవనశైలి ఎంపికలలో తక్షణ మార్పులు జీవక్రియ వ్యాధిని అరికట్టేలా చేస్తాయి.
సరైన ఆహారం ఎంపిక చేసుకోవడం మధుమేహాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఒకవేళ మీరు ఇప్పటికే మధుమేహంతో పోరాడుతున్నట్లయితే, సమస్య తీవ్రతరం కాకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.
‘రక్తంలో స్థిరమైన చక్కెర స్థాయిలను నిర్వహించడం మొత్తం ఆరోగ్యానికి కీలకం. మీ డైట్‌లో అధిక ఫైబర్ ఆహారాలు చేర్చడం వల్ల ఇది సాధ్యపడుతుంది. తృణధాన్యాలు, పప్పుధాన్యాలకు ప్రాధాన్యతనిచ్చే భారతీయ వంటకాలను ఎంచుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇవి సహాయడుతాయి..’ అని న్యూట్రిషనిస్ట్ అనుపమ మీనన్ హెచ్‌టికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
అధిక ఫైబర్ ఆహారాల జాబితా
1. మెంతులు (మేతి)
రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి మెంతి గింజలు ఒక ఔషధం. ఈ విత్తనాలలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. మెంతి ఆకులను కూరలు, పరాటాలలో కూడా ఉపయోగించవచ్చు.
2. బచ్చలికూర/ఆకుకూరలు
బచ్చలికూర ఫైబర్, ఇతర అవసరమైన పోషకాలతో నిండిన ఆకు కూర. ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన ఫైబర్-రిచ్ ఎంపిక కోసం కూరలు, సలాడ్లలో బచ్చలికూరను చేర్చండి.
3. చియా విత్తనాలు
చియా విత్తనాలు ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్ల సమ్మేళనం. ఇవి జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడుతాయి. పెరుగు, స్మూతీలకు చియా గింజలను కలపండి. లేదా పోషకమైన ఫైబర్-రిచ్ అల్పాహారం కోసం రుచికరమైన చియా సీడ్ పుడ్డింగ్‌లను తయారు చేయండి.
4. జామ
జామ పండ్లలో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. రక్తంలో చక్కెర పెరగడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. జామపండును చిరుతిండిగా ఆస్వాదించండి. లేదా సలాడ్‌లు, స్మూతీస్ లేదా ఫ్రూట్ చాట్‌లలో భాగంగా తినండి.
5. బ్రోకలీ
బ్రోకలీ ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో నిండిన క్రూసిఫెరస్ కూరగాయలు. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. రుచికరమైన ఫైబర్ అధికంగా ఉండే సైడ్ డిష్ కోసం బ్రోకలీని సూప్‌లలో చేర్చండి.
6. ఓట్స్
ఓట్స్ తృణధాన్యం, ఇందులో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అవి జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. రక్తంలోకి గ్లూకోజ్‌ను నెమ్మదిగా విడుదల చేయడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర నియంత్రణను ప్రోత్సహిస్తాయి. ఓట్ మీల్‌తో మీ రోజును ప్రారంభించండి. లేదా ఫైబర్‌తో కూడిన అల్పాహారం లేదా స్నాక్ ఎంపిక కోసం కుకీస్ లేదా మఫిన్‌ల వంటి వాటిలో ఓట్స్‌ను చేర్చండి.
7. నట్స్
బాదం, వాల్‌నట్, పిస్తా వంటి గింజలు ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్‌లకు అద్భుతమైన వనరులు. అవి తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడతాయి. కొన్ని గింజలను స్నాక్స్‌గా తినొచ్చు. లేదా సలాడ్‌లో చేర్చుకుని తినండి.