Sperm Health। మగవారూ.. మీ స్పెర్మ్ ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి ఇలా చేయండి!-ways men can take care of their sperm health to boost male fertility ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Ways Men Can Take Care Of Their Sperm Health To Boost Male Fertility

Sperm Health। మగవారూ.. మీ స్పెర్మ్ ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి ఇలా చేయండి!

HT Telugu Desk HT Telugu
Aug 05, 2023 08:08 PM IST

Sperm-healthy Lifestyle: పురుషులు తమ స్పెర్మ్ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి కొన్ని చిట్కాలను తెలుసుకోండి.

Sperm-healthy Lifestyle
Sperm-healthy Lifestyle (istock)

Sperm Health- Male Fertility : పిల్లల కోసం ప్లాన్ చేస్తున్న పురుషులు తమ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా తమ స్పెర్మ్ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం చాలా ముఖ్యం. నేటి వేగవంతమైన ప్రపంచంలో నిరంతరమైన ఒత్తిడి, ఆందోళనలు, నిష్క్రియాత్మకమైన జీవనశైలి, చెడు అలవాట్లు మొదలైన కారణాల వలన వారి ఆరోగ్యంతో పాటు వారి స్పెర్మ్ ఆరోగ్యాన్ని దెబ్బతీయగలవు. అయితే కొన్ని పద్ధతులు, అలవాట్ల ద్వారా స్పెర్మ్ నాణ్యత మెరుగుపడుతుంది, స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుంది.

ట్రెండింగ్ వార్తలు

హెచ్‌టి లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆండ్రాలజీ అండ్ సెక్సువల్ హెల్త్ (IASH) వ్యవస్థాపకుడు డాక్టర్ చిరాగ్ భండారి, పురుషులు తమ స్పెర్మ్ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి కొన్ని చిట్కాలను సూచించారు. అవేంటో తెలుసుకోండి.

ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి

ఆరోగ్యకరమైన జీవనశైలి మీ స్పెర్మ్ ఆరోగ్యాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. ప్రతిరోజూ ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారాన్ని తీసుకోండి, తగినంతగా హైడ్రేటెడ్ గా ఉండండి. అదే సమయంలో అధిక మద్యపానం, ధూమపానం, మాదకద్రవ్యాల వినియోగాన్ని నివారించండి, ఎందుకంటే ఈ అలవాట్లు స్పెర్మ్ ఉత్పత్తిని, నాణ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి.

ఒత్తిడి స్థాయిలను నియంత్రించండి

దీర్ఘకాలిక ఒత్తిడి స్పెర్మ్ ఆరోగ్యానికి ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి ఒత్తిడి స్థాయిలను నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకోండి. మీ శరీరానికి, మనసుకు తగినంత విశ్రాంతిని కల్పించండి. ఇందుకోసం వ్యాయామం, ధ్యానం, యోగా సాధన చేయండి. మీకు ఇష్టమైన హాబీలు, నచ్చిన కార్యకలాపాలలో పాల్గొనండి. రోజుకు 7-8 గంటలు నిద్రపోండి. స్వీయ-సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం, ప్రశాంతంగా ఉండటం కోసం తగిన వాతావరణాన్ని సృష్టించుకోవడం ద్వారా మీ శ్రేయస్సుకు ప్రయోజనం చేకూరుస్తుంది, స్పెర్మ్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండండి

అధిక బరువు లేదా తక్కువ బరువు, ఈ రెండు పరిస్థితులు మీ స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండేలా చర్యలు తీసుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి, మీడియం తీవ్రత కలిగిన వ్యాయామం చేయడం వల్ల మెరుగైన స్పెర్మ్ నాణ్యత ఉంటుంది. సమతుల్య ఆహారం ద్వారా ఆరోగ్యకరమైన బరువును సాధించడానికి ప్రయత్నించండి. అవసరమైతే పోషకాహార నిపుణుడిని సంప్రదించండి.

సురక్షితమైన సెక్స్ ప్రాక్టీస్ చేయండి

లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్ల (STIలు) నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే కొన్ని ఇన్ఫెక్షన్లు మీ స్పెర్మ్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి సురక్షితమైన సెక్స్ ప్రాక్టీస్ చేయండి ప్రత్యేకించి మీరు ఏకస్వామ్య సంబంధంలో లేకుంటే లేదా మీ భాగస్వామి లైంగిక చరిత్ర గురించి కచ్చితంగా తెలియకుంటే జాగ్రత్తపడండి. మీ సంతానోత్పత్తి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి ఆరోగ్య సంరక్షణ నిపుణులను క్రమం తప్పకుండా కన్సల్ట్ చేయడం అవసరం. ఈ సమయంలో మీ స్పెర్మ్ ఆరోగ్యం గురించి, మీకు ఇంకా ఏవైనా ఆందోళనలు లేదా సందేహాలు ఉంటే సిగ్గుపడకుండా చర్చించండి.

ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్త

స్పెర్మ్ ఆరోగ్యానికి హాని కలిగించే పర్యావరణ కారకాలకు గురికాకుండా జాగ్రత్తపడండి. అధిక వేడి స్నానాలు (ఉదా., హాట్ టబ్‌లు, ఆవిరి స్నానాలు) చేయకండి. బిగుతైన దుస్తులు ధరించకండి, వృషణాలు వేడికి గురికాకుండా చూసుకోండి. క్రిమిసంహారకాలు, రసాయనాలు లేదా భారీ లోహాల వంటి టాక్సిన్‌లకు గురికాకుండా ఉండండి. అవసరమైన భద్రతా మార్గదర్శకాలను అనుసరించండి.

WhatsApp channel

సంబంధిత కథనం