Bride makeup hacks: ప్రతి పెళ్లి కూతురు తెల్సుకోవాల్సిన బ్యూటీ, మేకప్ హ్యాక్స్.. ఈ టిప్స్‌తో లుక్ చెక్కు చెదరదు
Bride makeup hacks: పెళ్లి కూతురు ఆహార్యానికి మంచి లుక్ తీసుకొచ్చేది మేకప్. మేకప్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రోజంతా అందంగా కనిపించొచ్చు. జుట్టు, మేకప్‌తో పాటూ మరికొన్ని హ్యాక్స్ కూడా తెల్సుకోండి.
పెళ్లి కూతురు లుక్ మార్చేసేది మేకప్. మంచి మేకప్ వల్ల అందంగా, ప్రత్యేకంగా మెరిసిపోవచ్చు. జీవితాంతం గుర్తుండిపోయే పెళ్లి ఫొటోలు కూడా మేకప్ వల్ల చాలా బాగొస్తాయి. అయితే మేకప్ విషయంలో పెళ్లి కూతుర్లు తప్పకుండా కొన్ని టిప్స్ తెల్సుకోవాల్సిందే. మీ దగ్గర ఒక కిట్ లాగా తప్పకుండా ఉండాల్సిన మేకప్ ప్రొడక్ట్స్ కొన్ని ఉన్నాయి.
వాటర్ ప్రూఫ్ ప్రొడక్ట్స్
పెళ్లంటే రోజంతా జరిగే వేడుక. ఉదయం నుంచి వేడుక చివరిదాకా మీ ముఖం తాజాగా కనిపించాల్సిందే. మేకప్ పాడవ్వకుండా ఉండటానికి వాటర్ ప్రూఫ్ ప్రొడక్ట్స్ ఎంచుకోండి. చెమట వచ్చినా కూడా మేకప్ చెక్కు చెదరకుండా ఉంటుంది. ఐలైనర్, లిప్‌స్టిక్, మస్కారా లాంటివన్నీ వాటర్ ప్రూఫ్ ఉత్పత్తులే ఎంచుకోవాలి.
సరైన షేడ్:
చర్మం రంగుకు నప్పే ఫౌండేషన్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీ చర్మం రంగుకన్నా తెల్లగా కనిపించడానికి లైట్ షేడ్ ఫౌండేషన్ ఎంచుకుంటే అది అస్సలు చర్మంలో కలిసిపోదు. మెడ, చెవులు, చేతులతో పోల్చినప్పుడు ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. ఒక షేడ్ కన్నా ఎక్కువ లైట్ షేడ్ ఎంచుకోకండి. అలాగే మీకు నప్పే లిప్‌స్టిక్ ఎంచుకోండి. అందరికీ ఎరుపు రంగు సెట్ అవ్వదు. లేత గులాబీ, ముదురు గులాబీ, న్యూడ్ షేడ్ ఏది నప్పుతుందో చూడండి.
బ్లాటింగ్ పేపర్లు, టిష్యూలు:
మఖం కాసేపటికే చెమటతోనే, జిడ్డు వల్లనో మెరిసినట్లు కనిపిస్తుంది. అలాంటప్పుడు బ్లాటింగ్ పేపర్ తో అద్దితే అది జిడ్డును పీల్చుకుంటుంది. మెరుపు తగ్గిపోతుంది. మ్యాటె లుక్ వచ్చేస్తుంది. కాబట్టి మీ మేకప్ బ్యాగులో బ్లాటింగ్ పేపర్లు, కొన్ని టిష్యూలు తప్పకుండా ఉంచుకోండి.
టీత్ వైటెనింగ్:
దంతాలు కాస్త పచ్చదనంతో ఉండటం సాధారణమే. కానీ ఫొటోల్లో కూడా కనిపించేంతగా ఉంటే మాత్రం టీత్ వైటెనింగ్ ప్రొడక్ట్ ఏదైనా వాడొచ్చు. దాంతో పళ్లు తెల్లగా కనిపిస్తాయి. వీటిని పెళ్లికన్నా కొన్ని రోజులు లేదంటే వారాల ముందే వాడాల్సి ఉంటుంది. వైద్యుల్ని కలిస్తే సూచిస్తారు. లేదంటే నోరు తెరిచి నవ్వినప్పుడు, మాట్లాడినప్పుడు ఆ పచ్చదనం బాగా తెలుస్తుంది.
బ్లాక్ పౌడర్:
జుట్టు పలచబడటం చాలా మందిలో ఉండే సమస్యే. కానీ పెళ్లి రోజు రకరకాల హెయిర్ స్టైల్స్ ప్రయత్నిస్తాం. దాంతో మాడు మరీ ఎక్కువగా కనిపిస్తుంది. దానికి తాత్కాలిక పరిష్కారంగా బ్లాక్ హెయిర్ పౌడర్స్ దొరుకుతున్నాయి. మేకప్ బ్రష్ తో కాస్త ఆ పౌడర్ అద్దితే జుట్టు ఒత్తుగా కనిపిస్తుంది.
ట్రయల్స్:
మేకప్ ముందుగానే ట్రయల్ వేయడం చాలా ముఖ్యం. దాంతో మీరెంచుకున్న ఉత్పత్తులు మీకెలా నప్పుతున్నాయో తెలుస్తుంది. కనీసం వారం ముందైనా ట్రయల్ మేకప్ వేసుకుని చూడండి. మీరనుకున్న లుక్ వస్తుందో లేదో తెలుస్తుంది. అలాగే హెయిర్ స్టైల్ కూడా ట్రయల్ వేయాల్సిందే. ముఖం ఆకారం బట్టి ఎటువంటి హెయిర్ స్టైల్ వేసుకోవచ్చో తెలుస్తుంది.
ఎమర్జెన్సీ బ్యాగ్:
వీటన్నింటితో పాటే మీ దగ్గర ఒక ఎమర్జెన్సీ బ్యాగ్ లేదా కిట్ ఉండాలి. దాంట్లో సూదీ దారం, బ్యాండ్ ఎయిడ్స్ ఉంచుకోండి. దాంతో పాటే మీకు నుదురు దగ్గర చిన్నచిన్న వెంట్రుకలుంటే అవి ఊరికే లేస్తుంటాయి. వాటిని సెట్ చేయడానికి సెట్టింగ్ స్ప్రే, లేదా ఏదైనా నూనె మీ దగ్గర పెట్టుకోండి. వాటితో సెట్ చేసుకోవచ్చు.
టాపిక్