Brain Stroke: కోటి మందికి బ్రెయిన్ స్ట్రోక్.. మిమ్మల్ని మీరు ఇలా కాపాడుకోండి
Brain Stroke: 2050 నాటికి దాదాపు కోటి మంది మరణాలకు బ్రెయిన్ స్ట్రోక్ కారణమవుతుందని తాజా అధ్యయనం చెబుతోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం ప్రపంచంలో నమోదవుతున్న మరణాలలో బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చనిపోతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. నిజానికి బ్రెయిన్ స్ట్రోక్ అనేది ముందు జాగ్రత్త పడితే నివారించదగిన పరిస్థితే. కానీ ఎంతోమంది చెడు జీవనశైలి కారణంగా మరణాన్ని తెచ్చుకుంటున్నారు. 2050 నాటికి దాదాపు కోటి మంది మరణాలకు బ్రెయిన్ స్ట్రోక్ కారణమవుతుందని తాజా అధ్యయనం చెబుతోంది.
మెదడులోని ఒక భాగానికి రక్త సరఫరా జరగకుండా అంతరాయం ఏర్పడినప్పుడు స్ట్రోక్ వస్తుంది. ఈ అంతరాయం వల్ల మెదడు కణాలకు ఆక్సిజన్, ఇతర పోషకాలు అందవు. దీనివల్ల ఆ కణాలు చనిపోతాయి. ఇలా కణాలు చనిపోవడం వల్ల శరీరంలోని కొన్ని భాగాలు పనిచేయకపోవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని రకాల జాగ్రత్తలను ముందు నుంచే తీసుకోవాలి. ధూమపానం చేయని వారితో పోలిస్తే ధూమపానం చేసేవారు 10 ఏళ్ల కంటే ముందే ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు వైద్యులు. అలాగే వారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా రెండు రెట్లు ఎక్కువ అని వివరిస్తున్నారు.
అధిక బరువుతో ప్రమాదం
అధిక బరువు కూడా బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడడానికి కారణంగా మారుతుంది. అధిక బరువు వల్ల మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. అలాగే వీరికి గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం ఎక్కువ. ఈ రెండింటి కారణంగా వారు బ్రెయిన్ స్ట్రోక్‌కు కూడా గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మంచి జీవన శైలిని అనుసరించడం ద్వారా స్ట్రోక్ రాకుండా అడ్డుకోవచ్చు.
మీ బ్రెయిన్ ఇలా కాపాడుకోండి
1. ఎక్కువ గంటలపాటు కూర్చునే పనిచేయడం వల్ల శారీరక వ్యాయామం తగ్గిపోతుంది. దీనివల్ల స్థూలకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వంటివి వస్తాయి. ఇవన్నీ కూడా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి ప్రతిరోజు గంటపాటు వాకింగ్ చేయడం అలవాటుగా చేసుకోండి. ప్రతి రెండు గంటలకు ఒకసారి లేచి ఇటు అటు నడవడం చేయండి.
2. ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక చక్కెర కలిగిన పానీయాలు, సంతృప్త కొవ్వులు అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల ఆరోగ్యం పై చాలా ప్రతికూల ప్రభావం పడుతుంది. శరీరంలో అధిక కొలెస్ట్రాల్ చేరుతుంది. అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. ఈ రెండూ కూడా స్ట్రోక్‌కు కారణం అవుతాయి.
3. ధూమపానం, ఆల్కహాల్ తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. ఈ రెండూ కూడా స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. పొగాకు రక్తనాళాలను సంకోచించేలా చేస్తుంది. ఇక ఆల్కహాల్ వినియోగం అధిక రక్తపోటుకు కారణం అవుతుంది. గుండె కొట్టుకునే వేగాన్ని మార్చేస్తుంది.
4. ఆధునిక జీవితంలో ఒత్తిడి కలగడం సహజంగా మారింది. కానీ అధిక స్థాయిలో ఒత్తిడి తీసుకోవడం వల్ల అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. ఈ ఒత్తిడి గుండెపోటుకు, మెదడు స్ట్రోక్‌కు కారణం అవుతుంది.
5. మంచి ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, సరిపడినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. నిద్ర లేకపోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు వస్తాయి. ఇవన్నీ కూడా చివరకు మెదడు స్ట్రోక్‌కు దారితీస్తాయి.