Stress Hormones in Hair । మీకు గుండె జబ్బులు వస్తాయో లేవో మీ జుట్టును చూసి చెప్పేయొచ్చు!-stress hormones in hair can predict risk of heart diseases ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Stress Hormones In Hair । మీకు గుండె జబ్బులు వస్తాయో లేవో మీ జుట్టును చూసి చెప్పేయొచ్చు!

Stress Hormones in Hair । మీకు గుండె జబ్బులు వస్తాయో లేవో మీ జుట్టును చూసి చెప్పేయొచ్చు!

HT Telugu Desk HT Telugu
May 23, 2023 10:50 AM IST

Stress Hormones in Hair: పరిశోధకులు జుట్టులో ఒత్తిడి హార్మోన్‌ను కనుగొన్నారు, వ్యక్తి జుట్టులోని హార్మోన్ స్థాయిని కొలిచినప్పుడు భవిష్యత్తులో హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని అంచనా వేయవచ్చు.

Stress Hormones in Hair
Stress Hormones in Hair (istock)

Stress Hormones in Hair: ఒకరి తలపై ఉండే వెంట్రుకల పరిస్థితిని బట్టి వారికి భవిష్యత్తులో గుండె జబ్బులు వస్తాయా లేదా అనేది అంచనా వేయవచ్చునని పరిశోధకులు కనుగొన్నారు. పరిశోధకులు జుట్టులో ఒత్తిడి హార్మోన్‌ను కనుగొన్నారు, వ్యక్తి జుట్టులోని హార్మోన్ స్థాయిని కొలిచినప్పుడు భవిష్యత్తులో హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని అంచనా వేయవచ్చు. ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో ఇటీవల జరిగిన యూరోపియన్ కాంగ్రెస్ ఆన్ ఒబేసిటీ (ECO)లో పరిశోధకులు తమ అధ్యయనాన్ని సమర్పించారు. వారి అధ్యయనం ప్రకారం, ఒత్తిడికి ప్రతిస్పందనగా స్రవించే స్టెరాయిడ్ హార్మోన్ గ్లూకోకార్టికాయిడ్ స్థాయిలు వ్యక్తుల వెంట్రుకలలో గమనించవచ్చు. అవే భవిష్యత్తులో వారికి గుండె జబ్బులు వచ్చే పరిస్థితులను సూచిస్తాయి.

ఈ అధ్యయనం రచయిత అయిన నెదర్లాండ్స్‌లోని ఎరాస్మస్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ నుండి డాక్టర్ ఎలైన్ వాన్ డెర్ వాల్క్ మాట్లాడుతూ "దీర్ఘకాలిక ఒత్తిడి వ్యక్తి ఆరోగ్యాన్ని నిర్ణయించడంలో సూచిక అని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు మా పరిశోధనలు జుట్టులో గ్లూకోకార్టికాయిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్న వ్యక్తులకు గుండెజబ్బులు, రక్త ప్రసరణ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని సూచిస్తున్నాయి" అని చెప్పారు.

ఈ అధ్యయనంలో భాగంగా 18 ఏళ్లు పైబడిన స్త్రీ, పురుషులకు సంబంధించిన జుట్టు నమూనాలను పరిశీలించారు. 6,341 మంది నమూనాలను సేకరించారు. వారి జుట్టులో ఉన్నటువంటి కార్టిసాల్, కార్టిసోన్ వంటి ఒత్తిడి హార్మోన్ స్థాయిలను పరిశోధనా బృందం విశ్లేషించింది. జుట్టు పరిస్థితి అలాగే హృదయ వ్యాధులకు మధ్య ఉన్న సంబంధాన్ని అంచనా వేయడానికి సుమారు 7 సంవత్సరాల పాటు ఈ అధ్యయనం సాగింది. ఈ వ్యవధిలో 133 సార్లు పరీక్షించారు. జుట్టులో కార్టిసోన్ స్థాయిలు ఎక్కువగా ఉన్న వ్యక్తులకు స్ట్రోక్ లేదా గుండెపోటు వంటి సమస్యలు రెండు రెట్లు ఎక్కువ అని పరిశోధనలు చూపించాయి. అలాగే 57 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో మూడు రెట్లు అధికం అని తేలింది.

హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్న వ్యక్తులను గుర్తించడంలో హెయిర్ ఎనాలిసిస్ కూడా వైద్యులకు సులభమైన పరీక్షగా ఉపయోగపడుతుందని పరిశోధకులు అభిలాషిస్తున్నారు. భవిష్యత్తులో శరీరంలో ఒత్తిడి హార్మోన్ల ప్రభావాలను లక్ష్యంగా చేసుకొని చికిత్స చేయడానికి ఈ పరిశోధన అవకాశం ఇస్తుందని ఎరాస్మస్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ నుండి అధ్యయనం ప్రధాన పరిశోధకుడైన ప్రొఫెసర్ ఎలిసబెత్ వాన్ రోసమ్ అన్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్