Boti Masala Fry: బోటీ మసాలా ఫ్రై ఇలా చేస్తే బగారా రైస్‌తో జతగా అదిరిపోతుంది
Boti Masala Fry: బోటీ పేరు చెప్తేనే ఎంతోమందికి నోరూరిపోతుంది. దీన్ని గ్రేవీలా చేసినా, పులుసులా చేసినా, వేపుడులా చేసినా కూడా టేస్టీగా ఉంటుంది. దీని రెసిపీ ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Boti Masala Fry: నాన్ వెజ్ ప్రియులకు బోటీ అంటే ప్రత్యేక ఇష్టముంటుంది. దీన్ని అందరూ వండలేరు. చాలా పరిశుభ్రంగా క్లీన్ చేశాకే దీన్ని వండాలి. దీన్ని ఇగురుగా, పులుసుగా, వేపుడుగా కూడా వండుకోవచ్చు. రుచి అదిరిపోతుంది. నిజానికి బోటీ వండడం చాలా సులువు. కానీ దాన్ని పరిశుభ్రం చేయడమే కాస్త కష్టం. బయట బాగా శుభ్రం చేసినా బోటీ కూడా లభిస్తుంది. దాన్ని తెచ్చుకుంటే బోటీ మసాలా ఫ్రై సులువుగా ఉండేసుకోవచ్చు.
బోటీ మసాలా ఫ్రై రెసిపీకి కావాల్సిన పదార్థాలు
బోటి - ఒక కిలో
ఉల్లిపాయలు - ఐదు
పచ్చిమిర్చి - ఐదు
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు
కారం - ఒక స్పూను
పసుపు - ఒక స్పూను
కరివేపాకులు - గుప్పెడు
పుదీనా తరుగు - మూడు స్పూన్లు
కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు
నూనె - సరిపడినంత
షాజీరా - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
మిరియాల పొడి - అర స్పూను
గరం మసాలా పొడి - ఒక స్పూను
బోటి మసాలా ఫ్రై రెసిపీ
1. బోటీని తెచ్చుకున్నాక మంచినీటిలో వేసి శుభ్రంగా కడగాలి.
2. తర్వాత కుక్కర్లో వేసి రెండు గ్లాసుల నీటిని వేసి నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి.
3. నీళ్లు వడకట్టి ఆ బోటీని ఒక గిన్నెలో వేసుకోవాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
5. షాజీరా వేసి చిటపటలాడించాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగును వేసి రంగు మారేవరకు వేయించుకోవాలి.
6. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టును వేసి వేయించుకోవాలి.
7. పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి.
8. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టిన బోటీ ముక్కలను అందులో వేసి బాగా కలపాలి.
9. రుచికి సరిపడా ఉప్పును వేసుకొని బాగా కలిపి మూత పెట్టాలి.
10. ఐదు నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడికించాలి.
11. ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా, కరివేపాకులు, కారం వేసి బాగా కలిపి మూత పెట్టాలి.
12. కనీసం 20 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత మూత తీసి కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు చల్లుకుంటే బోటీ మసాలా ఫ్రై రెడీ అయినట్టే.
13. మీకు ఇగురులా కావాలి అనిపిస్తే ఒక గ్లాసు నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి.
14. ఇగురులా కాకుండా వేపుడులా కావాలి. అంటే నీరు వేయకుండా అలా మగ్గిస్తే సరిపోతుంది.
బోటీని ఎప్పుడూ తెచ్చుకున్నా అది పరిశుభ్రంగా ఉందో లేదో చూసుకోవడం చాలా ముఖ్యం. కావాలంటే ఒకసారి వేడినీళ్లలో శుభ్రంగా కడుక్కోవాలి. దాన్ని కుక్కర్లో బాగా ఉడికించాకే తినాలి. బోటి మసాలా ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. బగారా రైస్ తో జతగా అదిరిపోతుంది.
టాపిక్