Black Wheat Flour: నల్ల గోధుమ పిండిని ఆహారంలో చేర్చుకోండి, ఈ నల్ల గోధుమలు మధుమేహాన్ని తగ్గిస్తాయి-black wheat flour include black wheat flour in the diet this black wheat can reduce diabetes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Black Wheat Flour: నల్ల గోధుమ పిండిని ఆహారంలో చేర్చుకోండి, ఈ నల్ల గోధుమలు మధుమేహాన్ని తగ్గిస్తాయి

Black Wheat Flour: నల్ల గోధుమ పిండిని ఆహారంలో చేర్చుకోండి, ఈ నల్ల గోధుమలు మధుమేహాన్ని తగ్గిస్తాయి

Haritha Chappa HT Telugu
Feb 29, 2024 10:22 AM IST

Black Wheat Flour: గోధుమపిండి అనగానే అందరూ గోధుమ రంగులో కనిపించేదే అనుకుంటారు. నల్ల గోధుమలు కూడా ఉన్నాయి. దీని నుంచి నల్ల గోధుమ పిండిని తయారు చేస్తారు.

నలుపు గోధుమ పిండి
నలుపు గోధుమ పిండి (Amazon)

Black Wheat Flour: గోధుమలలో నలుపు రకం ఒకటి ఉంది. ఈ నల్ల గోధుమలు పురాతన ధాన్యంగా చెప్పుకుంటారు. వేల సంవత్సరాల ముందే దీన్ని సాగు చేశారు. ఇందులో ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, క్యాల్షియం, జింక్, ఐరన్, పొటాషియం, కాపర్, యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. సాధారణ గోధుమలతో పోలిస్తే ఈ నల్ల గోధుమలు ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. సాధారణ గోధుమపిండి కన్నా నల్ల గోధుమ పిండిని వాడడం వల్ల ఎన్నో సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు.

నల్ల గోధుమపిండి మార్కెట్లో లభిస్తుంది. రంగు నలుపుగా ఉన్నా రుచి మాత్రం అదిరిపోతుంది. ఆన్లైన్ మార్కెట్లలో కూడా ఇది అందుబాటులో ఉంది. వారానికి ఒకసారి అయినా ఈ నల్ల గోధుమలను ఆహారంలో చేర్చుకోండి. ముఖ్యంగా డయాబెటిక్ రోగులు వీటిని తినాల్సిన అవసరం ఉంది.

సాధారణ గోధుమలతో పోలిస్తే నల్ల గోధుమల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. అలాగే ఇది గ్లూటెన్ రహితమైనది కూడా. సాధారణ గోధుమ పిండిలో గ్లూటేన్ ఉంటుంది. ఈ నల్ల గోధుమల్లో మాత్రం గ్లూటెన్ ఉండదు. కాబట్టి గ్లూటెన్ అలెర్జీ ఉన్నవారు ఈ నల్ల గోధుమపిండిని వినియోగించుకోవడం మంచిది. అలాగే ఈ నల్ల గోధుమలలో ఆంథోసైనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది శరీరంలో ఉన్న ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంతోపాటు, ఆక్సీకరణ ఒత్తిడి నుండి కాపాడతాయి. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుంది.

గుండె సమస్యలు ఉన్నవారు నల్ల గోధుమలను వాడడం చాలా ముఖ్యం. దీనిలో ఉండే కొవ్వు ఆమ్లాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని అడ్డుకుంటాయి. నల్ల గోధుమలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. అలాగే రక్తపోటు పెరగకుండా అడ్డుకుంటాయి. హృదయానాళ పనితీరును మెరుగుపరుస్తాయి. దీనివల్ల గుండెపోటు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.

డయాబెటిస్ ఉంటే…

మధుమేహం ఉన్నవారు ప్రతిరోజూ నల్ల గోధుమలతో చేసిన చపాతీలను తినడం అలవాటు చేసుకోవాలి. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. కాబట్టి తిన్నాక రక్తంలో చక్కర స్థాయిలో అమాంతం పెరగవు. అవి పెరగడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఉండవు. ఈ నల్ల గోధుమల్లో ఉండే ఆంథోసైనిన్స్... డయాబెటిక్ రోగులలో మీ రక్తంలో చక్కెర జీవక్రియను మెరుగుపరుస్తుంది. కాబట్టి రక్తంలో చక్కర స్థాయిలు పెరగకుండా ఉంటాయి.

రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ నల్ల గోధుమపిండి ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే మాంగనీస్, విటమిన్ బి, మెగ్నీషియం, జింక్, కాల్షియం, ఐరన్, కాపర్ రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయం చేస్తాయి. సాధారణ గోధుమల కంటే ఇవి ఎక్కువ ప్రతిరోధకాలను కలిగి ఉంటాయి. డిఎన్ఎ దెబ్బ తినకుండా రక్షణ ఇవ్వడంలో నల్ల గోధుమలు ముందుంటాయి. అలాగే రోగనిరోధక కణాల ఉత్పత్తిని పెంచుతాయి. ఇవి ఇన్ఫెక్షన్ తో పోరాడడానికి అత్యవసరమైనవి.

రేచీకటి రాకుండా అడ్డుకునే శక్తి నల్ల గోధుమలకు ఉంది. ఇందులో ఉండే ఆంథోసైనిన్స్ రేచీకటి రాకుండా అడ్డుకుంటుంది. కంటి సమస్యలతో బాధపడే వారు నల్ల గోధుమలను ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

బరువు తగ్గేందుకు నల్ల గోధుమలు ఎంతో సహాయ పడతాయి. దీనిలో డైటరీ ఫైబర్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కాబట్టి జీవ క్రియ సవ్యంగా సాగుతుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

క్యాన్సర్ నిరోధకత

నల్ల గోధుమలలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి డీఎన్ఏ దెబ్బతీయకుండా కాపాడతాయి. కాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. క్యాన్సర్ రోగులలో కణాల ఉత్పత్తిని తగ్గిస్తాయి. దీనివల్ల క్యాన్సర్ కణాల వ్యాప్తి తగ్గుతుంది.

సాధారణ గోధుమ పిండితో ఎన్ని రకాల వంటకాలు చేసుకోవచ్చో, ఈ నల్ల గోధుమ పిండితో కూడా అన్ని రకాల వంటకాలు చేసుకోవచ్చు. చూడటానికి కాస్త నలుపుగా ఉన్నా రుచి మాత్రం అద్భుతంగానే ఉంటుంది.

టాపిక్