Gluten Free Diet: గ్లూటెన్‌ ఫ్రీ డైట్‌ అంటే ఏంటి.. ఎవరైనా పాటించొచ్చా?-know about gluten free diet and know who should follow it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gluten Free Diet: గ్లూటెన్‌ ఫ్రీ డైట్‌ అంటే ఏంటి.. ఎవరైనా పాటించొచ్చా?

Gluten Free Diet: గ్లూటెన్‌ ఫ్రీ డైట్‌ అంటే ఏంటి.. ఎవరైనా పాటించొచ్చా?

HT Telugu Desk HT Telugu
Dec 24, 2023 02:43 PM IST

Gluten Free Diet: గ్లుటెన్ లేని ఆహారం తినడం గురించి మీరూ కొన్ని విషయాలు తెల్సుకోవాలి అనుకుంటున్నారా? అయితే దాన్ని ఎవరు పాటించాలి? ఎవరు తినొచ్చు లాంటి విషయాలు వివరంగా తెల్సుకోండి.

గ్లుటెన్ లేని ఆహారం
గ్లుటెన్ లేని ఆహారం (freepik)

ఆరోగ్యంగా ఉండాలనే ఆకాంక్షతో ఈ మధ్య కాలంలో అంతా రకరకాల డైట్‌లను పాటిస్తున్నారు. ఊబకాయం, బరువు ఎక్కువగా ఉండటం లాంటి సమస్యలు ఉన్న వారు ఈ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కీటో డైట్‌, మెడిటేరియన్‌ డైట్‌, గ్లూటెన్‌ ఫ్రీ డైట్‌ లాంటి పేర్లు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. క్రీడాకారులు, అథ్లెట్లలాంటి వారు ఇటీవల కాలంలో ఎక్కువగా గ్లూటెన్‌ ఫ్రీ డైట్‌లు చేస్తూ మంచి ఫలితాలను పొందుతున్నారు. మరి అసలు గ్లూటెన్‌ మనలో ఏం చేస్తుంది? గ్లూటెన్‌ ఫ్రీ డైట్‌ను ఎవరైనా పాటించొచ్చా? లాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గ్లుటెన్ దేంట్లో ఉంటుంది?

కొన్ని ఆహారాల్లో గ్లూటెన్‌ అనేది ఉంటుంది. చాలా మంది పిండి పదార్థాలు ఉండే ఆహారాలు అన్నింటిలోనూ గ్లూటెన్‌ ఉంటుందని పొరపాటు పడుతుంటారు. అయితే అది ఎంత మాత్రమూ నిజం కాదు. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే చాలా పదార్థాల్లో గ్లూటెన్‌ ఉండదు. గ్లూటెన్‌ అనేది గోధుమలు, బార్లీ లాంటి కొన్ని రకాల ధాన్యాల్లో కనిపించే ప్రొటీన్‌. ముఖ్యంగా పాలిష్‌ చేసి, ప్రాసెస్‌ చేసిన ధాన్యాల్లో ఇది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. పిజా, పాస్తా, బేక్డ్‌ ఆహారాలులాంటి వాటిలో గ్లూటెన్‌ ఉంటుంది.

కొన్ని ప్రత్యేకమైన వ్యాధులు ఉన్నవారి శరీరం గ్లూటెన్‌ని అంగీకరించదు. ఆటో ఇమ్యూన్‌ రెస్పాన్స్‌ని ఇస్తుంది. అందువల్ల అది వారికి పడదు. ఫలితంగా పొట్ట నొప్పి, వికారం, పొట్ట ఉబ్బరం, మల బద్ధకం, గ్యాస్‌, విరోచనాలు లాంటివి కనిపిస్తుంటాయి. ఇలాంటి వారు గ్లూటెన్‌ ఫ్రీ డైట్‌ను పాటించడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది. వరి ధాన్యం, బంగాళ దుంపలు, బీన్స్‌, టమోటాలు, కమలాఫలాలు, గుడ్లు, కాటేజ్‌ ఛీజ్‌, వెన్న లాంటి పదార్థాల్లో ఇది అస్సలు ఉండదు. కాబట్టి వీటిని ఎక్కువగా తినే ప్రయత్నం చేయవచ్చు.

గ్లూటెన్‌ ఉండే పదార్థాల్లో మొదట మనందరికీ గుర్తొచ్చేది గోధుమ పిండి. చాలా మంది డయాబెటిక్ పేషెంట్లు బరువు నియంత్రణలో ఉంచుకోవడం, మధుమేహాన్ని కంట్రోల్‌ చేసుకోవడం కోసం గోధుమ పిండి చపాతీలను తింటూ ఉంటారు. అయితే గ్లూటెన్‌ ఉన్న ఆహారాలు చాలా వరకు రక్తంలో చక్కెర స్థాయిల్ని పెంచుతాయని పరిశోధనల్లో తేలింది. అందుకనే వీరికి చపాతీలు అంత మంచి ఎంపిక కాదని వైద్యులు చెబుతుంటారు.

కాబట్టి గ్లూటెన్‌ ఆహారాలు పడని వారు, మధుమేహ వ్యాధిగ్రస్తుల్లాంటి వారు ఎవరైనా సరే ఈ గ్లూటెన్‌ ఫ్రీ డైట్‌ని పాటించవచ్చు. మిగిలిన వారు దీన్ని అప్పుడప్పుడూ తింటూ ఉండటం వల్ల పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. అయితే అతికా దేన్నీ తినకూడదని గుర్తుంచుకోవాలి.

Whats_app_banner