Yoga after dinner: రాత్రి భోజనం తరువాత ఈ ఆసనాలు వేస్తే లాభాలెన్నో..
Yoga after dinner: తిన్న తరువాత కొన్ని యోగాసనాలు చేయడం వల్ల ఆహారం తొందరగా జీర్ణమవుతుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అవేంటో చూడండి.
యోగా వల్ల మానసికంగా, శారీరకంగా చాలా లాభాలుంటాయి. రోజూవారీ యోగా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. నిద్ర సరిగ్గా పడుతుంది, సామర్థ్యం పెరుగుతుంది, జీవితం మీద సానుకూల నమ్మకం ఏర్పడుతుంది. దీర్ఘ కాలంగా యోగా చేయడం వల్ల డయాబెటిస్, రక్తపోటు, ఫ్యాటీ లివర్, ఆర్తరైటిస్ లాంటి రోగాలు దరిదాపుల్లోకి కూడా రావు. ఒక రోజు ప్రారంభం, ముగింపు యోగాతో చేస్తే చాలా మేలు. ఉదయం పూట చేసే యోగ వల్ల మనలో ఉత్తేజం పెరుగుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉండగలం. రాత్రి పూట చేసే యోగా వల్ల నాణ్యమైన నిద్ర దొరుకుతుంది. ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.
రాత్రి పూట భోజనం తరువాత ఎలాంటి యోగాసనాలు చేయొచ్చో చూడండి:
1. వజ్రాసనం:
భోజనం చేసిన తర్వాత వెంటనే చేయడానికి ఇది మంచి ఆసనం. ఇది కడుపు ప్రదేశంలో రక్త ప్రసరణ పెంచుతుంది. దాని ద్వారా జీర్ణ శక్తి పెరుగుతుంది. ఎక్కువ సేపు కుర్చీలో కూర్చోవడం వల్ల వచ్చే నడుము నొప్పి నుంచి కూడా ఈ ఆసనం వల్ల ఉపశమనం ఉంటుంది. ఇది మనస్సును ప్రశాంతంగా మారుస్తుంది. మంచి నిద్ర వచ్చేలా చేస్తుంది.
2.యష్టికాసనం:
ఇది మనసును, శరీరాన్ని ప్రశాంతంగా మారుస్తుంది. ఈ ఆసనంలో నడుము సాగినట్లు చేయడం వల్ల వెన్ను నొప్పి తగ్గుతుంది. ఇది కండరాల నొప్పులున్నా తగ్గిస్తుంది. సౌకర్యవంతమైన నిద్రకు దోహదం చేస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు ఈ ఆసనం చేయడం వల్ల నాణ్యమైన నిద్ర సొంతమవుతుంది. ఈ ఆసనం ఒత్తిడిని తగ్గిస్తుంది.
3. ద్రదాసనం:
ఎడమ నాసికా రంధ్రాన్ని చంద్రనాడి అని పిలుస్తారు. దాని ద్వారా శ్వాస తీసుకుంటే శరీరం, మనస్సు ప్రశాంతంగా ఉంటాయి. కుడి వైపున ఉన్న ద్రధాసనం, చంద్ర నాడి ద్వారా ప్రాణ ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది, తద్వారా మంచి నిద్ర వచ్చేలా చేస్తుంది. ఇది రాత్రిపూట శరీర విశ్రాంతి కోసం చేయదగ్గ ఉత్తమ ఆసనం.
ఈ ఆసనాలు తిన్న వెంటనే చేయొచ్చా?
తిన్న వెంటనే వజ్రాసనం చేసుకోవచ్చు. కానీ మిగతా రెండు ఆసనాలు రాత్రి భోజనం చేసిన గంట తరువాత మాత్రమే చేయాలి. ఇవి జీర్ణ శక్తిని పెంచుతాయి. బాగా నిద్ర పట్టేలా చేస్తాయి.
టాపిక్