Sunscreen in summer: ఈ లాభాలు తెలిస్తే.. తప్పకుండా సన్‌స్క్రీన్ వాడతారు..-best benefits of using sunscreen everyday ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sunscreen In Summer: ఈ లాభాలు తెలిస్తే.. తప్పకుండా సన్‌స్క్రీన్ వాడతారు..

Sunscreen in summer: ఈ లాభాలు తెలిస్తే.. తప్పకుండా సన్‌స్క్రీన్ వాడతారు..

Zarafshan Shiraz HT Telugu
May 07, 2023 02:10 PM IST

Sunscreen in summer: సన్‌స్క్రీన్ వాడటం వల్ల చర్మారోగ్యానికి జరిగే ప్రయోజనాలు, కొన్ని వాస్తవాలు, అసలు రోజూ సన్‌స్క్రీన్ ఎందుకు వాడాలో తెలుసుకుందాం.

సన్‌స్క్రీన్ లాభాలు
సన్‌స్క్రీన్ లాభాలు (Photo by BATCH by Wisconsin Hemp Scientific on Unsplash)

“రోజూ సన్‌స్క్రీన్ రాసుకోవడం తప్పనిసరి”.. ఈ వాక్యం చాలా సార్లు వినుంటారు, చదివుంటారు. కానీ సన్‌స్క్రీన్ మాత్రం వాడి ఉండరు. కదా? కానీ ఎందుకువాడాలో, దాని ప్రయోజనాలేంటో తెలుసుకుంటే తప్పకుండా మొదలెడతారు. ముఖ్యంగా వేసవి కాలంలో చర్మం దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని గురించి తెలుసుకోవడం ముఖ్యం.

HT లైఫ్‌స్టైల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్ రింకీ కపూర్ సన్‌స్క్రీన్ ఎందుకు వాడాలో, దాని ప్రయోజనాలేంటో వివరంగా చెప్పారు. అవేంటో చూద్దాం.

స్కిన్ క్యాన్సర్:

యూవీ కిరణాల వల్ల చర్మ కణాల పనితీరు దెబ్బతిని చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. సన్‌స్క్రీన్ యూవీ కిరణాల ప్రభావం చర్మం మీద పడకుండా కాపాడుతుంది. సన్‌స్క్రీన్ వాడకం వల్ల ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు యాభై శాతం తగ్గుతాయట.

చర్మంపై ముడతలు:

యూవీ కిరణాలు చర్మాన్ని మందంగా, రంగు మారేలా చేస్తాయి. కొలాజిన్, ఎలాస్టిన్ ను విచ్ఛిన్నం చేసి చర్మంపై గీతలు, ముడతలు, చర్మం నల్లగా మారడం, లేదా సాగినట్టు అవడం.. లాంటి సమస్యలు తెస్తాయి. రోజూ క్రమం తప్పకుండా సరిగ్గా సన్‌స్క్రీన్ వాడే వారిలో వృద్ధాప్యచాయలు కనిపించే అవకాశం సన్‌స్క్రీన్ వాడని వారితో పోలిస్తే 24 శాతం తక్కువని తేలింది.

చర్మం రంగు:

చర్మం నల్లబడకుండా, మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి కాకుండా సన్‌స్క్రీన్ కాపాడుతుంది.

“సన్‌స్క్రీన్ వాడకం కొత్తది కాదు. మొట్టమొదటి సన్‌స్క్రీన్ 1936 లో మార్కెట్లోకి తీసుకొచ్చారు. దాని తరువాత దాని ప్రభావం గురించి చాలా పరిశోధనల్లో దాన్ని వాడటం లాభదాయకమని తేలింది” అని డా. రింకీ కపూర్ అన్నారు. దానిగురించి మరికొన్ని సూచనలిచ్చారు.

  1. ఎండలు మండే కాలంలోనే కాదు.. మిగతా కాలాల్లో కూడా తప్పనిసరిగా సన్‌స్క్రీన్ వాడాలి. యూవీ కిరణాలు మబ్బుల నుంచి కూడా చొచ్చుకుని వచ్చే సామర్థ్యం కలిగి ఉంటాయని గుర్తుంచుకోవాలి.
  2. మంచు 80 శాతం యూవీ కిరణాల్ని పరావర్తనం చేస్తుంది. దీనివల్ల చర్మం దెబ్బతింటుంది. ఎంత ఎత్తైన ప్రాంతమైదే అంత ఎక్కువ యూవీ కిరణాల ప్రభావం ఉంటుంది.
  3. విమాన ప్రయాణాల్లో కూడా సన్‌స్క్రీన్ వాడాలి. మీరు లోపలున్నా కూడా సూర్య కిరణాల ప్రభావం మీమీద ఖచ్చితంగా ఉంటుంది.
  4. సన్‌స్క్రీన్ చర్మ ఆరోగ్యానికి సంబంధించింది. చర్మం నల్లబడకుండా చూడటం ఒక్కటే దాని పని కాదు. అందుకే చర్మం రంగుతో పనిలేకుండా నలుపు చర్మం అయినా, తెలుపు చర్మం ఉన్నా అందరూ దీన్ని వాడాలి.
  5. ప్రతి రెండు నుంచి మూడు గంటలకు దీన్ని తప్పకుండా రాసుకుంటూ ఉండాలి.
  6. సన్‌స్క్రీన్‌లు నీటిని తట్టుకుంటాయి కానీ, వాటర్ ప్రూఫ్ మాత్రం కాదు. నీళ్లలో ఉన్నట్లయితే తప్పకుండా ప్రతి 40 నుంచి 80 నిమిషాలకు సన్‌స్క్రీన్ రాసుకోవాలి. దీనికోసం మీరు కొన్న సన్‌స్క్రీన్ లేబుల్ చూడండి.
  7. కనీసం SPF 30 లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్‌ ఎంచుకోవాలి.

మరో ముఖ్యమైన విషయం.. మన కంప్యూటర్ స్క్రీన్లూ, ఫోన స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్ నుంచి ఇది చర్మాన్ని కాపాడుతుంది. కాబట్టి ఇంట్లో ఉన్నా కూడా బ్లూ లైట్ ప్రభావం మీమీద ఉంటుంది అనుకంటే సన్‌స్క్రీన్‌ వాడండి.

WhatsApp channel