10 cancer symptoms: ఈ 10 క్యాన్సర్ లక్షణాలను మహిళలు నిర్లక్ష్యం చేయొద్దు
10 cancer symptoms: 10 క్యాన్సర్ లక్షణాలను మహిళలు నిర్లక్ష్యం చేయొద్దని క్యాన్సర్ వైద్య నిపుణులు సూచించారు.
చాలా మంది మహిళలు గైనకాలజీ సంబంధిత క్యాన్సర్ల బారిన పడుతున్నారు. ఇంకా ఎండోమెట్రియల్ క్యాన్సర్ లేదా యుటెరిన్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటివి ఉన్నాయి. ముఖ్యంగా మెనోపాజ్ దశకు వచ్చిన వారిలో ఈ క్యాన్సర్ల బారిన పడుతున్నారు. అయితే గైనకాలజీ సంబంధిత క్యాన్సర్లు మెనోపాజ్ దశకు ముందు కూడా వస్తున్నాయి. మీరు యవ్వనంలో ఉండి ఆరోగ్యంగా ఉన్నప్పుడు క్యాన్సర్ల బారిన పడతారని గుర్తించకపోవచ్చు. అయితే ఈ విషయంలో వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
సీకే బిర్లా హాస్పిటల్ వైద్యులు డాక్టర్ అరుణా కాల్రా హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంబంధిత విషయాలను వివరించారు. ‘గైనకాలజీ సంబంధిత క్యాన్సర్లు వెంటనే లక్షణాలను చూపించకపోవచ్చు. ఇతర వ్యాధుల లక్షణాలుగా మనం భ్రమించవచ్చు. కేవలం సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్లు మాత్రమే స్క్రీనింగ్ ద్వారా గుర్తించవచ్చు. అయితే లక్షణాలు గుర్తించి వాటిని గైనకాలజిస్ట్ లేదా ఫిజియన్‌తో చర్చించాలి. అప్పుడే మీరు త్వరితగతిన క్యాన్సర్ గుర్తించేందుకు వీలవుతుంది. చికిత్స కూడా సాధ్యమవుతుంది..’ అని వివరించారు.
క్యాన్సర్ సంబంధిత లక్షణాలను ప్రతి మహిళ తెలుసుకోవాలని సూచించారు. ఆయా లక్షణాలను వివరించారు.
1.అసాధారణ రక్తస్రావం
90 శాతం ఎండోమెట్రియల్ క్యాన్సర్ పేషెంట్లలో అసాధారణ రక్తస్రావం ఉంటుంది. మెనోపాజ్ దశ వచ్చిన తరువాత రక్తస్రావం ఉంటే తప్పక పరీక్షలు చేయించుకోవాలి. అది కేవలం స్పాటింగ్ (రక్తపు మరకలు) అయినా పరీక్ష చేయించుకోవాలి. ఒకవేళ మెనోపాజ్ దశకు చేరుకోకపోయినప్పటికీ రక్తస్రావం అధికంగా ఉన్నా, పీరియడ్స్ మధ్య బ్లీడింగ్ అవుతున్నా, సెక్స్‌లో పాల్గొన్నప్పుడు బ్లీడింగ్ అవుతున్నా వైద్యుడిని సంప్రదించాలి. ఇది యోని (వజైనల్) సంబంధిత లేదా గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ అవ్వొచ్చు.
2. రొమ్ముల్లో మార్పులు
చాలా వరకు బ్రెస్ట్ క్యాన్సర్లను పేషెంట్లే స్వయంగా గుర్తించవచ్చు. స్నానం చేస్తున్నప్పుడు గానీ, షేవింగ్ చేస్తున్నప్పుడు గానీ, లేదా గోకుతున్నప్పుడు గానీ పసిగట్టవచ్చు. రొమ్ముల్లో లేదా చంకల్లో గడ్డలను పసిగట్టాలి. అలాగే చనుమొనల్లో ఏవైనా లోపాలు కనిపిస్తున్నాయా, స్పర్శలో మార్పులు కనిపిస్తున్నాయా? ఆకారంలో మార్పులు కనిపిస్తున్నాయా పసిగట్టాలి. లేక రొమ్ము చర్మంలో మార్పులు ఏవైనా కనిపిస్తున్నాయా? చూడాలి.
3. విసర్జనలో మార్పులు
ఎల్లవేళలా మీ బ్లాడర్‌లో ఒత్తిడి కనిపించడం లేదా అత్యవసరంగా మూత్ర విసర్జనకు వెళ్లాలనిపించడం గమనించారా? ఒకవేళ మీరు ఎక్కువగా నీళ్లు తాగడం లేదా ప్రెగ్నెంట్ అయి ఉంటే ఇలా జరుగుతుంది. కానీ ఈ రెండూ కాకుండా పై లక్షణాలు కనిపిస్తే అది క్యాన్సర్‌కు సంకేతం కావొచ్చు.
డాక్టర్ ఏవీ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పర్సనలైజ్డ్ క్యాన్సర్ థెరపీ వైద్యులు డాక్టర్ అమిత్ వర్మ మహిళలు గుర్తించాల్సిన క్యాన్సర్ లక్షణాలను వివరించారు.
- రొమ్ముల్లో మార్పులు: ఏవైనా అసాధారణమైన గడ్డలు, మందంగా ఉండడం, చనుమొనల్లో మార్పులు, చనుమొనల నుంచి స్రావాలు వస్తే వైద్యుడిని సంప్రదించాలి.
- యోని నుంచి అసాధారణ రక్తస్రావం: మెనోపాజ్ దశకు వచ్చాక రక్తస్రావం కావడం, పీరియడ్స్ సమయంలో లేదా మధ్యలో అసాధారణ రక్తస్రావం కావడం కూడా ఒక సంకేతం కావొచ్చు.
- పొత్తికడుపులో లేదా పెల్విక్ నొప్పి: పొత్తి కడుపు లేదా పెల్విస్ వద్ద నిరంతరంగా తీవ్రమైన నొప్పి ఉంటే అది ఒవేరియన్ లేదా ఇతర పునరుత్పత్తి సంబంధిత క్యాన్సర్ అయి ఉండొచ్చు.
- మూత్ర, మల విసర్జనలో మార్పులు: మూత్ర విసర్జన, మల విసర్జనకు సంబంధించి ఏవైనా మార్పులు గమనించండి. మలబద్దకం, డయేరియా, మూత్రవిసర్జనలో ఇబ్బంది వంటివి కొలొరెక్టల్ లేదా బ్లాడర్ క్యాన్సర్ అయి ఉండొచ్చు.
- బరువు తగ్గడం: మీ ప్రమేయం లేకుండానే బరువు తగ్గడం కూడా క్యాన్సర్ సంకేతం అవ్వొచ్చు. బాగా అలసిపోయినట్టు ఉండడం, ఆకలి లేకపోవడం కూడా ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.
- చర్మంలో మార్పులు: ఏదైనా పుట్టుమచ్చ రంగు, పరిమాణం, ఆకృతి మారడం లేదా చర్మంపై మార్పులు ఉంటే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి.
- నిరంతర దగ్గు లేదా బొంగురుపోవడం: నెల రోజుల కంటే ఎక్కువ కాలం దగ్గు కొనసాగడం లేదా రెండు వారాల కంటే ఎక్కువ కాలం గొంతు బొంగురు పోవడం కనిపిస్తే అవి ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంకేతం కావొచ్చు.
మహిళలు 4 సాధారణ సంకేతాలను విస్మరించవద్దని ఆయన సూచించారు. రొమ్ముల్లో గడ్డలు, యోని ద్వారా అసాధారణ రక్తస్రావం, మల విసర్జనలో మార్పులు, నిరంతర దగ్గు తదితర 4 లక్షణాలను అస్సలు విస్మరించవద్దని సూచించారు. వీటిని నిర్ధారించేందుకు వైద్యుడిని సంప్రదించాలి. నిర్ధారణ అయితే తగిన చికిత్స పొందాలి అని సూచించారు.
వీటిలో ఒకటి కంటే ఎక్కవ లక్షణాలు కనిపించినా అవి కాన్సర్ కాకపోవచ్చు. కానీ వైద్యుడిని సంప్రదించడం మాత్రం మరిచిపోవద్దు.
సంబంధిత కథనం