Egg breakfast recipes: గుడ్డును అల్పాహారంలో చేర్చేందుకు టేస్టీ మార్గాలివే-best and tasty ways to include eggs in breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Egg Breakfast Recipes: గుడ్డును అల్పాహారంలో చేర్చేందుకు టేస్టీ మార్గాలివే

Egg breakfast recipes: గుడ్డును అల్పాహారంలో చేర్చేందుకు టేస్టీ మార్గాలివే

Koutik Pranaya Sree HT Telugu
Oct 10, 2024 06:30 AM IST

Egg breakfast recipes: గుడ్డును అల్పాహారంలో చేర్చుకునేందుకు కాస్త వేరే మార్గాల కోసం చూస్తున్నారా? అయితే గుడ్డు అల్పాహారంలో చేర్చుకోవడం వల్ల లాభాలు, వివిధ మార్గాలు తెల్సుకోండి.

అల్పాహారంలో గుడ్డు చేర్చుకునే మార్గాలు
అల్పాహారంలో గుడ్డు చేర్చుకునే మార్గాలు (freepik)

గుడ్లను సమతుల ఆహారం అంటారు. అందుకనే వీటిని రోజూ తినమని వైద్యులు సిఫార్సు చేస్తుంటారు. ఇందులో మన రోజు వారీ అవసరాలకు తగినన్ని పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. సాధారణంగా కోడి గుడ్డు దాదాపుగా 65 గ్రాముల వరకు బరువు ఉంటుంది. దీనిలో పొటాషియం, ఐరన్‌, జింక్‌, విటమిన్‌ ఈ లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల వీటితో పాటుగా దాదాపు 78 క్యాలరీలు, 6.29 గ్రాముల ప్రొటీన్‌ లభిస్తాయి.

ప్రొటీన్‌ ఎక్కువగా దొరికే ఆహారంగా దీన్ని చెబుతారు. కండరాలు బలంగా ఉండాలన్నా, పిల్లల్లో ఎదుగుదల సక్రమంగా ఉండాలన్నా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని తినడం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టే రోజూ అల్పాహారంలో భాగంగా గుడ్డును తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే రోజూ ఉడికించిన గుడ్డును ఊరికే తినాలంటే బోరింగ్‌గా అనిపిస్తుంది. అలా కాకుండా కాస్త రుచిగా భిన్నంగా దీన్ని తయారు చేసుకుని రోజుకో రకంగా తినొచ్చు. అలా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం.

1. మసాలా ఆమ్లెట్‌ :

పూర్తిగా గుడ్డునే అల్పాహారంగా తీసుకోవాలనుకుంటే మూడు నుంచి నాలుగు గుడ్లను తీసుకోండి. గిన్నెలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, బ్రోకలీ లాంటి వాటిని వేసుకోండి. తర్వాత పసపు, ఉప్పు, కాస్త గరం మసాలా పొడి వేసుకుని అన్నింటినీ బాగా కలపండి. తర్వాత అందులో గుడ్లను పగలగొట్టి వేసి కలపండి. స్టౌ మీద పెనం పెట్టి వెన్న వేయండి. దాని మీద ఈ గుడ్డు మిశ్రమాన్ని వేసి రెండు వైపులా కాల్చండి. మసాలా ఆమ్లెట్‌ రెడీ.

2. బేక్డ్‌ ఎగ్‌ :

ఒవెన్‌ ఉన్న వారు బేక్డ్‌ ఎగ్‌ని ప్రయత్నించవచ్చు. ఒక మైక్రోవేవ్‌ సేఫ్‌ గిన్నెను తీసుకోండి. అందులో గుడ్లను పగలగొట్టి వేయండి. కాస్త ఉప్పు, మిరియాల పొడి, నూనె వేసి మిశ్రమాన్ని బాగా గిలకొట్టండి. ఒవెన్‌ని ముందే ఐదు నిమిషాలు ప్రీహీట్‌ చేసుకుని పెట్టుకోండి. తర్వాత గుడ్డు మిశ్రమం ఉన్న గిన్నెని ఒవెన్‌లో పెట్టి పది పదిహేను నిమిషాల పాటు బేక్‌ చేసి తీసేయడమే. దీన్ని ఉదయపు అల్పాహారంగా చక్కగా తినేయొచ్చు.

3. ఎగ్‌ శాండ్‌విచ్‌ :

ముందుగా కడాయిలో ఉల్లి తరుగు, బ్రోకలీ, క్యారట్‌ తురుములను వేసి వేయించండి. అందులోనే సరిపడా ఉప్పు, మిరియాల పొడి చల్లండి. తర్వాత గుడ్లను పగలగొట్టి అందులో వేసి వేగనివ్వండి. ఆమ్లెట్‌ మాదిరిగా తీసి బ్రెడ్‌ మధ్యలో పెట్టుకోండి. కావాలనుకుంటే కాస్త చీజ్‌, టమోటా కెచప్‌లను వేసుకుని వేడి వేడిగా లాగించేయండి.

Whats_app_banner