Sukhasana while eating: భోజనం చేసేటప్పుడు కూర్చునే మంచి పద్ధతి ఇదే.. చిన్న మార్పుతో ఆరోగ్యం..-benefits of eating by sitting on the floor instead chair ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sukhasana While Eating: భోజనం చేసేటప్పుడు కూర్చునే మంచి పద్ధతి ఇదే.. చిన్న మార్పుతో ఆరోగ్యం..

Sukhasana while eating: భోజనం చేసేటప్పుడు కూర్చునే మంచి పద్ధతి ఇదే.. చిన్న మార్పుతో ఆరోగ్యం..

Koutik Pranaya Sree HT Telugu
Oct 05, 2023 10:48 AM IST

Sukhasana while eating: కుర్చీలో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేసే అలవాటుందా. అయితే అది మంచిది కాదట. కింద కూర్చుని సుఖాసనంలో భోజనం చేయడం వల్ల బోలెడు లాభాలున్నాయి. అవేంటో చూసేయండి.

భోజనం కూర్చునేటప్పుడు సుఖాసనం
భోజనం కూర్చునేటప్పుడు సుఖాసనం (pexels)

ఈ మధ్య కాలంలో కుటుంబం అంతా కలిసి భోజనం చేయడమే అరుదు. ఒకవేళ చేసినా డైనింగ్‌ టేబుల్‌ మీదో, టీవీ చూస్తూ సోఫాలోనో కూర్చుని తినే వారే అధికం. ఇలా కాకుండా మీరు కింద కూర్చుని భోజనం చేస్తున్నారా? అయితే అందరికంటే మంచి అలవాటు మీకు ఉన్నట్లే అని చెప్పవచ్చు. అవునండీ కింద కూర్చుని భోజనం చేయడం వల్ల లాభాలు ఎన్నో. అందుకనే ఆసియా ఖండంలో, మరీ ముఖ్యంగా భారత దేశంలోని ప్రజలు అనాదిగా ఇలా కింద కూర్చుని తినేందుకే ఆసక్తి చూపేవారు. మారుతున్న కాలంలో సౌకర్యాల పేరుతో ఇప్పుడు అందరిళ్లల్లోనూ డైనింగ్‌ టేబుళ్లు వచ్చి చేరిపోయాయి. అయితే కింద కూర్చుని తినడం వల్ల ప్రయోజనాలేంటో ఒక్కసారి తెలుసుకుందాం. అప్పుడు ఎక్కడ కూర్చుని తినాలనే దాన్ని మనమే నిశ్చయించుకోవచ్చు.

సుఖాసనం వల్ల లాభాలు:

  • కింద కాళ్లు రెండు మఠం (సుఖాసనం) వేసుకుని కూర్చుని అన్నం తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగవుతుంది. ఇలా కూర్చుని తినాలని అనుకున్నప్పుడు మనం నిదానంగా కూర్చుని అన్నం తినలేం. ముద్ద నోట్లో పెట్టుకునేందుకు తలను వంచి ముందుకు కాస్త వంగుతాం. ఇలా ప్రతీ ముద్దకూ జరుగుతుంది. దీని వల్ల పొట్టలోని కండరాల్లో కదలిక వస్తుంది. దీని వల్ల కడుపులోకి విడుదల కావాల్సిన జీర్ణరసాలు సజావుగా విడుదలవుతాయి. అన్నం త్వరగా అరిగేందుకు సహకరిస్తాయి.
  • ఇలా కింద మఠం వేసుకుని కూర్చుని భోజనం చేసే సమయంలో శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. తక్కువ ఒత్తిడిలోనే రక్త సరఫరా శరీరమంతా సమానంగా జరుగుతుంది. దీని వల్ల నరాలు ఒత్తిడి లేకుండా రిలాక్స్‌ అవుతాయి. ఈ పరిణామాల వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కాళ్లు, చేతులు, కండరాలపై ఒత్తిడి తగ్గుతుంది. దీంతో శరీరం తేలికగా కదులుతుంది.
  • సోఫాలోనో, డైనింగ్‌ టేబుల్‌ మీదో కూర్చుని తిన్నదానితో పోలిస్తే కింద కూర్చున్నప్పుడు కాస్త తక్కువ తినేసరికే కడుపు నిండిపోయిన భావన కలుగుతుంది. దీని వల్ల ఎక్కువ తినాలనుకున్నా తినలేం. తక్కువ ఆహారాన్ని తింటాం. బరువు తగ్గాలనుకుంటున్న వారు తప్పకుండా ఇలా కిందే కూర్చుని తినడం మేలు.
  • సుఖాసనంలో కూర్చుని తినేప్పుడు వెన్నును నిటారుగా పెట్టుకుని కూర్చునేందుకు ప్రయత్నించాలి. దీని వల్ల శరీరంలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. కాళ్లకు బలం చేకూరుతుంది. రోజూ ఇలా కింద కూర్చుని భోజనం చేసే వారు కింద నుంచి ఏ సపోర్ట్ లేకుండా తేలికగా పైకి లేవగలుగుతారు. ముసలివారయ్యాక కూడా వీరిలా చేయగలుగుతారని పరిశోధనల్లో తేలింది. కింద కూర్చోవడం, లేవడం చేయకపోతే శరీరంలో కదలిక తగ్గిపోయి కాళ్లు అలానే బిగుసుకుపోతాయి. అందుకనే భోజనం చేసేప్పుడు కచ్చితంగా కింద కూర్చునేందుకే ప్రయత్నించాలి.

Whats_app_banner