Sri RamaNavami 2024: శ్రీరామనవమి రోజు తాగే పానకం తయారు చేసే పద్ధతి ఇదే
Sri RamaNavami 2024: శ్రీరామనవమి వచ్చిందంటే అందరికీ గుర్తొచ్చేది పానకమే. మిగతా రోజులు ఆ పానకం చేసుకొని తాగినా అంత రుచి రాదేమో, కానీ శ్రీరామనవమి రోజు మాత్రం కచ్చితంగా ఆ పానకాన్ని రుచి చూడాల్సిందే.
Sri RamaNavami 2024: శ్రీరామనవమి అనగానే అందరికీ గుర్తొచ్చేది తీయని బెల్లం పానకం. భక్తులంతా ఆరోజు పానకాన్ని కచ్చితంగా సేవిస్తారు. పానకం లేని శ్రీరామనవమి లేదనే చెప్పాలి. శ్రీరామనవమి పండుగ వేసవిలోనే వస్తుంది. ఈ పానకం కూడా వేసవిలో ఎన్నో రోగాలను తట్టుకునే శక్తిని మనకు ఇస్తుంది. పానకం తయారు చేయడం చాలా సులువు. ప్రతి ఒక్కరూ దీన్ని చాలా సులువుగా చేయొచ్చు.
శ్రీరామనవమి రోజు ఇంట్లో చేసుకునే పూజలో కూడా పానకాన్ని నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇది మన ఆరోగ్యానికి అన్ని విధాలుగా మేలే చేస్తుంది. దీని రెసిపీ ఎలాగో ఇక్కడ ఇచ్చాము.
బెల్లం పానకం రెసిపీకి కావలసిన పదార్థాలు
నీళ్లు - ఒక లీటరు
బెల్లం తురుము - 150 గ్రాములు
మిరియాల పొడి - ఒక స్పూను
శొంఠి పొడి - అర స్పూను
నిమ్మకాయ - ఒకటి
ఐస్ క్యూబ్స్ - మూడు
యాలకుల పొడి - ఒక స్పూన్
బెల్లం పానకం తయారీ
1. శ్రీరామనవమికి బెల్లం పానకం తయారు చేసేందుకు ఒక పెద్ద గిన్నెను తీసుకోవాలి.
2. ఆ గిన్నెలో నీళ్లు పోయాలి. తురిమిన బెల్లాన్ని ఆ నీళ్లలో వేసి బెల్లం కరిగే వరకు కలుపుతూనే ఉండాలి.
3. తర్వాత యాలకుల పొడిని, మిరియాల పొడిని, శొంఠి పొడిని వేసి బాగా కలపాలి.
4. అలాగే నిమ్మరసాన్ని కూడా చల్లుకోవాలి. దీన్ని చల్లగా తాగాలనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకొని వెంటనే తాగేయొచ్చు.
5. లేదా ఫ్రిడ్జ్ లో కాసేపు ఉంచుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది.
6. శ్రీరామనవమికి ప్రతి ఒక్కరూ పానకాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పానకాన్ని ఆ దేవునికి నివేదించాక తీర్థంలా తీసుకునే వారి సంఖ్య ఎక్కువే.
ఈ బెల్లం పానకం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో బెల్లం నీళ్లు, మిరియాలు, యాలకులు అధికంగా వినియోగిస్తాము. కాబట్టి ఈ పానకం తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. అలాగే మిరియాలు, యాలకుల వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా పొట్టలో, గొంతు ఇన్ఫెక్షన్ తగ్గించడంలో ఈ పానకం ముందుంటుంది. బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది. కాబట్టి రక్తహీనత సమస్య ఉన్నవారు పానకాన్ని తాగితే ఎంతో మంచిది. మండే వేసవిలో ఈ పానకాన్ని కాస్త సేపు ఫ్రిజ్లో పెట్టుకొని తాగితే వెంటనే శక్తి అందుతుంది. ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది. ఎండలో నుంచి వచ్చిన వారికి చల్లని పానకాన్ని అందించి చూడండి, వారికి ఎంత హాయిగా అనిపిస్తుందో.
టాపిక్