Beetroot Biryani: బీట్రూట్ బిర్యానీ ఇలా చేస్తే రుచికి రుచి ఎంతో ఆరోగ్యం-beetroot biryani recipe in telugu know how to make this rice recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Beetroot Biryani: బీట్రూట్ బిర్యానీ ఇలా చేస్తే రుచికి రుచి ఎంతో ఆరోగ్యం

Beetroot Biryani: బీట్రూట్ బిర్యానీ ఇలా చేస్తే రుచికి రుచి ఎంతో ఆరోగ్యం

Haritha Chappa HT Telugu
May 10, 2024 11:37 AM IST

Beetroot Biryani: బీట్రూట్‌తో చేసే వంటకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ బీట్రూట్ ను తినే వారి సంఖ్య తక్కువే. అందుకే బీట్రూట్ బిర్యాని రెసిపీ ఇక్కడ ఇచ్చాము. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

బీట్ రూట్ బిర్యానీ రెసిపీ
బీట్ రూట్ బిర్యానీ రెసిపీ

Beetroot Biryani: బిర్యానీ పేరు చెబితేనే నోరూరిపోతుంది. ఒకసారి బీట్రూట్ బిర్యానీ చేసి చూడండి. ఈ బిర్యానీ తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. బీట్రూట్ ను తినడానికి ఇష్టపడని వారు ఇలా బిర్యానీగా చేసుకొని తింటే శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. ఈ బీట్రూట్ బిర్యానీ చేయడం కూడా చాలా సులువు.

బీట్రూట్ బిర్యానీ రెసిపీకి కావలసిన పదార్థాలు

బాస్మతి బియ్యం - మూడు కప్పులు

బీట్రూట్‌లు - రెండు

ఉల్లిపాయలు - రెండు

అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూను

పచ్చిమిర్చి - ఐదు

కొత్తిమీర తరుగు - నాలుగు స్పూన్లు

పుదీనా తరుగు - నాలుగు స్పూన్లు

ధనియాల పొడి - రెండు స్పూన్లు

గరం మసాలా - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - తగినంత

బిర్యాని ఆకులు - నాలుగు

మిరియాలు - నాలుగు

కారం - రెండు స్పూన్లు

పసుపు - అర స్పూను

బీట్‌రూట్ బిర్యానీ రెసిపి

1. బాస్మతి బియ్యాన్ని ముందుగానే శుభ్రంగా కడిగి అరగంటసేపు నానబెట్టుకోవాలి.

2. తర్వాత బీట్రూట్ ని సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి కుక్కర్లో నూనె వేయాలి.

4.నూనె వేడెక్కాక బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి.

5. తర్వాత సన్నగా నిలువుగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను వేసి వేయించాలి.

6. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసి వేయించుకోవాలి.

7. ఇప్పుడు బీట్రూట్ తురుమును వేసి బాగా కలుపుకోవాలి.

8. అలాగే ధనియాల పొడి, కారం, పసుపు, మిరియాలు, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

9. రెండు నిమిషాల పాటు వాటిని వేయించుకోవాలి.

10. ఇప్పుడు ముందుగా నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని కూడా వేసి రెండు నిమిషాలు వేయించాలి.

11. ఆ బియ్యం ఉడకడానికి సరిపడా నీళ్లను వేసి పైన కొత్తిమీరను, పుదీనా తరుగును చల్లుకోవాలి.

12. కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.

13. అంతే ఆవిరి పోయాక కుక్కర్ మూత తీస్తే ఘుమఘుమలాడే బీట్రూట్ బిర్యానీ రెడీగా ఉంటుంది.

బీట్ రూట్ తినడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. ముఖ్యంగా ఆధునిక కాలంలో ఒత్తిడి బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అలాంటి వారు బీట్రూట్ ను ఆహారంలో భాగం చేసుకోవాలి. వ్యాయామం చేసేవారు కూడా బీట్రూట్ రసాన్ని తాగితే మంచిది. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. శక్తిని అందిస్తుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వాటిని రాకుండా అడ్డుకోవడంలో ముందుంటుంది. రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు బీట్రూట్ జ్యూస్ ను తరచూ తాగితే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. జ్ఞాపకశక్తి బీట్రూట్ జ్యూస్ బాగా పెంచుతుంది. పరగడుపున బీట్ రూట్ జ్యూస్ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గడానికి, మేని ఛాయ పెరగడానికి కూడా బీట్రూట్ ఎంతో ఉపకరిస్తుంది.

టాపిక్