Beerakaya Karam Podi: బీరకాయ కారంపొడి ఇలా చేసుకుంటే మూడు నెలలు నిల్వ ఉంటుంది
Beerakaya Karam Podi: బీరకాయ కారంపొడి చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీతో, దోశతో, అన్నంతో... ఎలా తిన్నా ఇది అదిరిపోతుంది. బీరకాయ కారంపొడి రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
Beerakaya Karam Podi: బీరకాయలు ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలు. బీరకాయలు పొట్టుతో కారం పొడి చేసుకుంటే మూడు నుంచి నాలుగు నెలలు నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ బీరకాయ కారం పొడి వేసుకుని, ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అలాగే ఇడ్లీ, దోశలతో దీన్ని తినవచ్చు. బీరకాయ కారంపొడి ఎలా చేయాలో తెలుసుకోండి.
బీరకాయ కారం పొడి రెసిపీకి కావలసిన పదార్థాలు
బీరకాయ పొట్టు - అరకిలో
చింతపండు - ఉసిరికాయ సైజులో
వెల్లుల్లి రెబ్బలు - ఎనిమిది
పసుపు - అర స్పూను
మినప్పప్పు - రెండు స్పూన్లు
ఎండుమిర్చి - 15
వాము - ఒక స్పూన్
బీరకాయ కారంపొడి రెసిపీ
1. బీరకాయ కారంపొడిని బీరకాయ పొట్టుతో చేస్తే రుచిగా వస్తుంది.
2. ముందుగా బీరకాయ పొట్టును శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. అవి గాలికే ఆరుతాయి.
3. వాటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. నీరు వేయకూడదు.
4. అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
6. ఆ నూనెలో ఎండుమిర్చిని వేసి వేయించాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
7. ఇప్పుడు అదే బాణలిలో ముందుగా పొడి చేసి పెట్టుకున్న బీరకాయ పొట్టు పొడిని కూడా వేసి చిన్న మంట మీద వేయించాలి.
8. అందులో ఒక స్పూను వాము, పసుపు పొడి వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ కట్టేయాలి.
9. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేయించిన ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, స్టవ్ మీద వేయించిన బీరకాయ పొట్టు మిశ్రమం వేసి పొడి చేసుకోవాలి.
10. ఆ పొడిని ఒక గాలి చొరబడని డబ్బాలో వేస్తే మూడు నుంచి నాలుగు నెలలు నిల్వ ఉంటుంది.
11. ఇందులో ఎక్కడ నీటిని వాడకూడదు. నీరు వేస్తే అది పాడైపోయే అవకాశం ఉంటుంది.
బీరకాయ పొట్టుతో చేసిన ఈ కారంపొడి రుచిగా ఉండడమే కాదు, ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. బీరకాయ పైన పొట్టును చాలా మంది పడేస్తూ ఉంటారు. కొంతమంది పచ్చడిగా చేసుకుంటారు. ఇలా పొడి చేసుకుని చూడండి. అందరికీ నచ్చడం ఖాయం. ముఖ్యంగా ఈ పొడిని డయాబెటిస్ రోగులు తింటే మంచిది.
టాపిక్