Beerakaya Keema: పిల్లలకు బెస్ట్ కూర... బీరకాయ కోడిగుడ్డు కీమా కర్రీ, ఇది రుచినే కాదు ఆరోగ్యాన్ని అందిస్తుంది
Beerakaya Keema: బీరకాయ కోడిగుడ్డు పొరటు కర్రీ పిల్లలకు కచ్చితంగా పెట్టాల్సిన కూర. దీన్ని వండే వారి సంఖ్య తక్కువే. ఒక్కసారి ఈ కూరను వారికి పెట్టి చూడండి.
Beerakaya Keema: బీరకాయ కోడి గుడ్డు పొరటు లేదా బీరకాయ కోడి గుడ్డు కీమా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకే కాదు చపాతీ, రోటీల్లోకి కూడా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు ఖచ్చితంగా పెట్టాల్సిన కూరల్లో ఇది ఒకటి. ఇది పిల్లలకే కాదు పెద్దలకు కూడా అంతా మేలే చేస్తుంది. బీరకాయ, కోడిగుడ్డు.. రెండూ కూడా ఆరోగ్యానికి ఎంతో అవసరం. కాబట్టి వారికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. ఈ బీరకాయ కోడి గుడ్డు కీమా కర్రీ ఎలా వండాలో ఇప్పుడు చూద్దాం. దీన్ని చాలా సింపుల్ గా ఉండవచ్చు.
బీరకాయ కోడి గుడ్డు పొరటు రెసిపీకి కావలసిన పదార్థాలు
బీరకాయ తరుగు - రెండు కప్పులు
గుడ్లు - నాలుగు
పచ్చిమిర్చి - రెండు
జీలకర్ర - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
గరం మసాలా - అర స్పూను
ధనియాల పొడి - ఒక స్పూను
నూనె - సరిపడినంత
అల్లం తరుగు - ఒక స్పూను
పసుపు - అర స్పూను
కారం - అర స్పూను
ఎండు మిర్చి - రెండు
అల్లం తరుగు - ఒక స్పూను
ఉల్లిపాయ - ఒకటి
బీరకాయ కోడి గుడ్డు పొరటు రెసిపీ
1. బీరకాయను ముందుగానే పొట్టు తీసి సన్నగా తరగాలి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
3. ఆ నూనెలో జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండు మిర్చి, అల్లం తరుగు, కరివేపాకులు వేసి బాగా వేయించుకోవాలి.
4. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసి బాగా వేయించాలి.
5. ఉల్లిపాయలు రంగు మారేవరకు అలానే ఉంచి బీరకాయ ముక్కలను వేయాలి.
6. బీరకాయల తరుగు వేశాక కారం, పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి.
7. మూత పెట్టి చిన్న మంట మీద పెడితే పావుగంటలో ఇవన్నీ మెత్తగా ఉడికి నూనె పైకి తేలుతుంది.
8. అలా నూనె పైకి తేలేక గుడ్లు కొట్టి ఆ కూర మీద వేయాలి.
9. నాలుగు గుడ్లను కూరంతా పరుచుకునే ఉండేటట్టు ఉంచాలి.
10. కానీ వెంటనే కలపకూడదు. నాలుగు నిమిషాలు వదిలేసాక అప్పుడు అది ఆమ్లెట్‌లా అవుతుంది.
11. అప్పుడు దాన్ని గరిటతో ముక్కలుగా చేసి కూర అంతా కోడిగుడ్డును కలిసేలా చేసుకోవాలి.
12. పైన మూత పెట్టి చిన్న మంట మీద మరో పావుగంట పాటు వదిలేయాలి.
13. తర్వాత మూత తీసి గరం మసాలా వేసి కలుపుకోవాలి. చివర్లో కొత్తిమీరను జల్లుకుని స్టవ్ కట్టేయాలి.
14. అంతే టేస్టీ బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయినట్టే. ఇది అన్నంలోకి, చపాతీలోకి, రోటీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ కచ్చితంగా తినాల్సిన కూర ఇది.
బీరకాయ కోడి గుడ్డు పొరటులో ఉండే బీరకాయ, కోడిగుడ్డు రెండూ మన ఆరోగ్యానికి మేలు చేసేవే. వేసవిలో చలువచేసే కూరగాయల్లో బీరకాయ ఒకటి. ఇది శరీరం వేడిని తగ్గించడమే కాదు, బరువు కూడా నియంత్రణలో ఉంచుతుంది. దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటివి దీనిలో ఉంటాయి. బీరకాయను కచ్చితంగా డైట్లో ప్రతి ఒక్కరూ చేర్చుకోవాలి. పిల్లలకు బీరకాయని తినిపించడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. వారికి మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
ఇక సంపూర్ణ ఆహారంగా చెప్పే కోడిగుడ్డును ప్రతిరోజూ తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇలా తినడం వల్ల వారికి శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు అందుతాయి. కోడిగుడ్డులో మన శరీరానికి అవసరమైన తొమ్మిది రకాల అ మైనో ఆమ్లాలు ఉన్నాయి. ఇవి కోడిగుడ్డులోనే సంపూర్ణంగా లభిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ అమైనో ఆమ్లాల కోసం ఈ కోడి గుడ్డును తినాలి. కోడి గుడ్డుతో చేసే ఆహారాలను పిల్లలు ఇష్టంగా తింటారు. కాబట్టి బీరకాయ కోడి గుడ్డు పొరటు కర్రీ ఒకసారి వండి పెట్టండి. వారికి కచ్చితంగా నచ్చుతుంది.