Bathukamma Songs Lyrics : కోసలాధీశుండు ఉయ్యాలో.. గూడెంలో పాడే బతుకమ్మ పాట
Bathukamma Songs In Telugu : పాటను ముందు తరాలకు తీసుకెళ్లడం అందరి బాధ్యత. బతుకమ్మ పండుగ సమయంలో కిందటి తరాలు పాడిన పాటలను HT Telugu మీ కోసం సేకరిస్తోంది. అందులో భాగంగా ఓ ఊరిలోని చాలా మందితో మాట్లాడింది.
తెలంగాణ పల్లెల్లో బతుకమ్మ అంటే ఓ సంబరం. ప్రకృతి పండుగ. ఒకప్పుడు బతుకమ్మ ఆడుతూ ఆడబిడ్డలు పాడిన పాటలు.. ఇప్పటి తరానికి పెద్దగా తెలియవు. ఇప్పుడంతా డీజే పాటలు, ప్రైవేట్ సాంగ్స్ వచ్చేశాయి. మన ముందు తరాలు పాడిన పాటల్లో కొన్ని మాత్రమే ఇప్పటి వరకూ చేరాయి. అందులోనూ కొన్నింటిని పాడటం మానేశారు. అలాంటి పాటలను మీ కోసం సేకరిస్తోంది HT Telugu. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గూడెం గ్రామంలో కొంతమంది మహిళలతో మాట్లాడింది. ఆ ఊరిలో పాడే బతుకమ్మ పాటను మీ కోసం అందిస్తోంది.
కోసలాధీశుండు ఉయ్యాలో..
దశరథ రాముండు ఉయ్యాలో..
కొండ కోనలు దాటి ఉయ్యాలో..
వేటకే బోయెను ఉయ్యాలో..
అడవిలో దిరిగెను ఉయ్యాలో..
అటు ఇటు జూచెను ఉయ్యాలో..
చెట్టు గుబురుల చాటు ఉయ్యాలో..
చెరువొకటి కనిపించే ఉయ్యాలో..
శబ్దమేదో వినెను ఉయ్యాలో..
శరమును సంధించే ఉయ్యాలో..
జంతువేదో జచ్చే ఉయ్యాలో..
అనుకొని సాగెను ఉయ్యాలో..
చెంతకు చేరగా ఉయ్యాలో..
చిత్తమే కుంగెను ఉయ్యాలో..
కుండలో నీళ్లును ఉయ్యాలో..
తీసుపో వచ్చిన ఉయ్యాలో..
బాలుని గుండెలో ఉయ్యాలో..
బాణమే గుచ్చెను ఉయ్యాలో..
ఎవ్వరు నువ్వనె ఉయ్యాలో..
ఏడ్పుతో రాజు ఉయ్యాలో..
శ్రవణుడు నేననె ఉయ్యాలో..
చచ్చేటి బాలుడు ఉయ్యాలో..
తప్పు జరిగెనంచు ఉయ్యాలో..
తపియించెను రాజు ఉయ్యాలో..
చావు బతుకుల బాలుడయ్యే ఉయ్యాలో..
సాయమె కోరెను ఉయ్యాలో..
నా తల్లిదండ్రుల ఉయ్యాలో..
దాహంతో ఉండిరి ఉయ్యాలో..
ఈ నీళ్లు గొనిపోయి ఉయ్యాలో..
ఇచ్చి రమ్మనె ఉయ్యాలో..
ఆ నీటితో రాజు ఉయ్యాలో..
అడవంతా వెదికె ఉయ్యాలో..
ఒకచోట జూచెను ఉయ్యాలో..
ఒణికేటి దంపతుల ఉయ్యాలో..
కళ్లయిన లేవాయె ఉయ్యాలో..
కాళ్లయిన కదలవు ఉయ్యాలో..
వృద్ధ దంపతుల జేరి ఉయ్యాలో..
వేదన చెందుతూ ఉయ్యాలో..
సాష్టంగ పడె రాజు ఉయ్యాలో..
సంగతి జెప్పెను ఉయ్యాలో..
పలుకు విన్నంతనే ఉయ్యాలో..
పాపమా వృద్ధులు ఉయ్యాలో..
శాపాలు బెట్టిరి ఉయ్యాలో..
చాలించిరి తనువులు ఉయ్యాలో..
శాపమే ఫలియించి ఉయ్యాలో..
జరిగె రామాయణం ఉయ్యాలో..
లోక కల్యాణమాయె ఉయ్యాలో లోకమే మెచ్చెను ఉయ్యాలో..
సేకరణ : HT Telugu
టాపిక్