Beer Bath: బీర్ తాగడం కన్నా దాంతో స్నానం చేస్తేనే ఆరోగ్యానికి మంచిదట, ఇప్పుడు ఊపందుకున్న కొత్త ట్రెండ్ బీర్ బాత్
Beer Bath: బీరు తాగే వాళ్ళు ఎంతో మంది. ఇప్పుడు బీరుతో స్నానం చేసే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. అనేక శాస్త్రీయ అధ్యయనాలు ప్రకారం బీర్ బాత్ ఆరోగ్యానికి ఎంతో మంచిది.
Beer Bath: తూర్పు ఐరోపాలోని దేశాల్లో పురాతన సాంప్రదాయం ఉండేది. ఆ సాంప్రదాయంలో బీర్ బాత్ ఒకటి. అంటే టబ్ లో ఉన్న నీటిలో బీరు కలుపుకొని అందులో గంటల కొద్దీ కూర్చుని స్నానాలు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల అది చర్మాన్ని శుభ్రపరుస్తుందని, ఒత్తిడిని తగ్గిస్తుందని చెబుతారు. అలాగే శరీరం నుండి విషాలు, వ్యర్థాలను కూడా విడుదల చేస్తుందని అంటారు. ఇప్పుడు మళ్లీ బీర్ బాత్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఈ బీర్ బాత్ చేసేందుకు ఇష్టపడుతున్నారు.
మొదటిసారి బీర్ బాత్
క్రీస్తుపూర్వం 921లో తొలిసారిగా బీర్ బాత్ చేసినట్టు చరిత్రకారులు చెబుతారు. డ్యూక్ ఆఫ్ బోహేమియా కింగ్వెన్సాస్ తొలిసారిగా బీర్ బాత్ చేయడం మొదలు పెట్టాడని అంటారు. ఇప్పుడు డ్యూక్ ఆఫ్ బొహేమియా ప్రాంతాన్ని చెక్ రిపబ్లిక్‌గా పిలుచుకుంటున్నారు. హంగేరియన్ రాజధాని బుడాపెస్ట్ లో ఇప్పటికీ ‘థర్మల్ బీర్ స్పా’ పేరుతో బీర్ బాత్ చికిత్సను అందిస్తోంది. ఒక చెక్కతో చేసిన బాత్ టబ్‌లో నీరు వేసి ఆ నీరులో బీర్, మాల్ట్, ఈస్ట్ వంటివి కలుపుతారు. అందులో కూర్చుని కాసేపు సేద తీరితే బీర్ బాత్ పూర్తవుతుంది.
బీర్ బాత్ ఉపయోగాలు
బీర్ తయారీలో బార్లీ, ఈస్ట్ పదార్థాలు ముఖ్యమైనవి. ఇవి కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయని నమ్ముతారు. అందుకే బీర్‌తో స్నానం చేయడం వల్ల శరీరంలోని టాక్సిన్లను వదిలించుకోవచ్చు అని నమ్ముతారు. అలాగే చర్మాన్ని తేమగా మార్చుకోవచ్చు అని అంటారు. కొంతమంది వైద్యులు కూడా విషయాన్ని సమర్థిస్తున్నారు. ఒక చర్మవ్యాధి నిపుణులు మాట్లాడుతూ బీర్‌లోని అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీరాడికల్స్ తో పోరాడేందుకు సహాయపడతాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. ఇవి చర్మం తేమను కాపాడతాయి.
బీర్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఆమ్లాలు చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించడంలో ముందుంటాయి. మొటిమలు, తామర వంటి చర్మ సమస్యలను అడ్డుకోవడానికి సహాయపడుతుందని కూడా చెబుతున్నారు.
బీర్ బాత్ కోసం తాగే బీర్లను నీటిలో కలపరు. వీటి కోసం ప్రత్యేకంగా బీర్లను తయారు చేస్తారు. మద్యంతో స్నానం చేస్తున్నామని ఎంతో మంది అనుకుంటారు. నిజానికి బాత్ టబ్ లో వేసి పూర్తి మద్యం కాదు. ఈ స్నానంలో బీర్‌లో వాడే పదార్థాలనే వాడతారు, కానీ పూర్తిగా తాగే బీర్‌ను మాత్రం ఇందులో కలపరు. కాబట్టి ఎప్పుడైనా బీర్ బాత్ చేసే అవకాశం వస్తే కచ్చితంగా చేయండి. ఇది ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిదే... కానీ ఆ బీర్ బాత్ డ్రింకును మాత్రం నోట్లో వేసుకోకండి.