Bael Fruit: నెలకోసారైనా వెలగపండు తినాల్సిందే, ఇది తింటే ఆ సమస్యలన్నీ దూరం-bael fruit should be eaten at least once a month it has many health benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bael Fruit: నెలకోసారైనా వెలగపండు తినాల్సిందే, ఇది తింటే ఆ సమస్యలన్నీ దూరం

Bael Fruit: నెలకోసారైనా వెలగపండు తినాల్సిందే, ఇది తింటే ఆ సమస్యలన్నీ దూరం

Haritha Chappa HT Telugu
May 02, 2024 09:30 AM IST

Bael Fruit: పండ్లు అనగానే యాపిల్, దానిమ్మ, అరటిపండ్లు అందరికీ గుర్తొస్తాయి. ఇంకా ఎన్నో అనే రకాల పండ్లు ఉన్నాయి. వాటిల్లో వెలగపండు కూడా ఒకటి. దీన్ని నెలకోసారైనా తినాలి.

వెలగపండు
వెలగపండు

Bael Fruit: వెలగపండును వుడ్ యాపిల్, బేల్ అని పిలుస్తారు. ఇది వేసవిలో ఎక్కువగా దొరికే పండు. బయట చాలా గట్టిగా ఉన్నా... లోపల గుజ్జు మాత్రం మెత్తగా ఉంటుంది. ఈ పండును వేసవిలో కచ్చితంగా తినాల్సిందే. ఇది ఎన్నో పోషకాలతో నిండి ఉంటుంది. దీంతో చేసే జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సాధారణ నీరు, కొబ్బరినీళ్లు రిఫ్రెష్ పానీయాలుగా ఎలా ఉపయోగపడతాయో... వెలగపండుతో చేసిన జ్యూసులు కూడా వేసవిలో అంతా రిఫ్రెష్‌మెంట్ ఇస్తాయి. దీన్ని తినడం వల్ల ఉన్న ప్రయోజనాలను పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు.

వెలగ పండులో మన ఆరోగ్యానికి దోహదపడే పోషకాలు ఎన్నో ఉంటాయి. దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే మన రోగ నిరోధక వ్యవస్థకు మేలు చేసే విటమిన్ ఏ కూడా ఈ పండులో పుష్కలంగా ఉంటుంది. పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు దీనిలో ఉంటాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఎముకలను బలంగా చేస్తాయి. దంతాలకు అవసరమైన కాల్షియాన్ని అందిస్తాయి.

వెలగపండు తినడం వల్ల దానిలో ఉండే అధిక ఫైబర్ శరీరంలో చేరుతుంది. మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు వెలగపండును తరచూ తినండి. సుఖ విరేచనం అవుతుంది. ఈ పండులో కరగని పీచు ఉంటుంది. ఇదే జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడి పేగు కదలికలను ప్రేరేపిస్తుంది. దీనివల్ల మలబద్ధకం రాకుండా ఉంటుంది.

వెలగ పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. అలాగే ఈ పొటాషియం శరీరంలో ఉన్న సోడియం ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఎప్పుడైతే రక్తపోటు అదుపులో ఉంటుందో... అప్పుడు హృదయ సంబంధిత వ్యాధులు వచ్చి అవకాశం కూడా తగ్గుతుంది.

వెలగ పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచడంతోపాటు అంటువ్యాధులు, అనారోగ్యాలతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తుంది.

బరువు తగ్గాలనుకునే వారు తమ ఆహారంలో వెలగపండు లేదా ఆ గుజ్జుతో చేసిన జ్యూస్‌ను భాగం చేసుకోవాలి. ఇది చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది. అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఒక గ్లాస్ జ్యూస్ తాగితే పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. ఇతర ఆహారాలు తినాలనిపించదు. దీనివల్ల మీరు అతిగా తినకుండా ఉంటారు. ఆరోగ్యంగా బరువు కూడా తగ్గుతారు.

ఆరోగ్యానికి వెలగపండు చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. అధిక విటమిన్ కంటెంట్ కారణంగా ఇది చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్ డామేజ్ నుండి రక్షిస్తాయి. ముఖం పై ముడతలు, గీతలు వంటివి రాకుండా కాపాడతాయి. అకాల వృద్ధాప్యం నుండి దూరం చేస్తాయి. దీనిలో ఉండే విటమిన్ సి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. కాబట్టి చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.

Whats_app_banner