Sleep and diabetes: ఆలస్యంగా నిద్రపోవడం, మేల్కోవడం వల్ల మధుమేహం ముప్పు : స్టడీ
Sleep and diabetes: నిద్రే కదా.. ఆలస్యమైతే ఏంటి.. ఉదయాన్నే కాస్త ఆలస్యంగా లేస్తే చాలు అనుకుంటున్నారేమో. దానివల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందట. ఆ విషయాలేంటో తెలుసుకోండి.
పూర్వం రోజుల్లో చాలా మంది ఏడు, ఎనిమిదింటికే నిద్ర పోయేవారు. ఉదయాన్నే నాలుగైదింటికి నిద్ర లేచేవారు. అందుకనే జీవన విధానానికి సంబంధించిన వ్యాధులు అంతలా వచ్చేవి కాదు. బీపీలు, షుగర్లలాంటి వ్యాధుల ఊసు కూడా తక్కువే. గత కొన్నేళ్లుగా మనుషుల లైఫ్ స్టైల్స్‌లో చాలా మార్పులు వచ్చాయి. ఆలస్యంగా భోజనం చేయడం, అర్ధరాత్రి వరకూ ఏదో ఒకటి తింటూ గడపడం, ఆ తర్వాత ఎప్పుడో నిద్రపోవడం చేస్తున్నారు. దీంతో ఉదయం ఏ పదింటికో, పదకొండింటికో లేవడం చేస్తున్నారు. ఇలా ఆలస్యంగా నిద్రపోవడం, ఆలస్యంగా లేవడం ఎవరైతే తరచుగా చేస్తున్నారో వారికి మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. అమెరికాలోని బోస్టన్‌కు చెందిన కొందరు పరిశోధకులు ఈ విషయంపై చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అవేంటంటే..
డయాబెటిస్ అవకాశాలు పెరుగుతాయి:
సాధారణ జీవన విధానం ఉన్న వారితో పోలిస్తే రాత్రిళ్లు ఎక్కువ సేపు మేల్కొని ఉండే వారు, ఆలస్యంగా నిద్ర లేచే వారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు 19 శాతం మేర ఎక్కువగా ఉంటాయని వారి పరిశీలనలో తేలింది. మొత్తం 63,676 మంది నర్సులపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ నర్సుల్లో రాత్రి షిఫ్టుల్లో పని చేసేవారు, పగటి షిఫ్టుల్లో పని చేసే వారూ ఉన్నారు. మామూలు వారితో పోల్చి చూసినప్పుడు అర్ధ రాత్రి వరకు మేల్కొనే వారిలో ఈ ప్రమాదం మరీ ఎక్కువగా ఉంది. కొంత మంది రాత్రి పని చేసి వచ్చి, తెల్లవారు జామున నిద్రపోయి, మధ్యహ్నం లేస్తుంటారు. వారు సాయంత్రం పూట ఎక్కువ యాక్టివ్‌గా ఉంటారు. సాధారణంగా అంతా ఉదయం పూట యాక్టివ్‌గా ఉంటే వీరు సాయంత్రం పూట యాక్టివ్ గా ఉంటారన్నమాట. అలాంటి వారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు 72 శాతం మేర ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది.
అలవాట్లలో మార్పులు:
అదే వీరు గనుక సరైన ఆహారపు అలవాట్లు పాటిస్తూ, వ్యాయామాలు చేస్తూ, మద్యం లాంటి వాటికి దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటిస్తున్నట్లయితే ఆ ప్రమాదం 19 శాతానికి తగ్గుతుందట. అలా కాకుండా ఎక్కువ మద్యం తాగుతూ, సిగరెట్లు కాలుస్తూ, పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల కచ్చితంగా డయాబెటిస్ బారిన పడే అవకాశాలు అధికం అవుతాయని అంటున్నారు.
వీరు అధ్యయనం చేసిన రాత్రిపూట పని చేసే నర్సుల్లో కేవలం ఆరు శాతం మంది మాత్రమే ఆరోగ్యకరమైన జీవన విధానాలను పాటిస్తూ ఉన్నారు. 25 శాతం మంది చాలా అనారోగ్య కరమైన జీవన విధానాలను పాటిస్తూ ఉన్నట్లు తేలింది. దీంతో ఎప్పుడు నిద్రపోతున్నాం? ఎలాంటి అలవాట్లను కలిగి ఉన్నాం? అన్నదానికి మధుమేహానికి మధ్య సంబంధం ఉందని వీరు తేల్చారు.