Yoga for Eyes । మీ కళ్ళతో ఈ వ్యాయామాలు చేస్తే కంటిచూపు మెరుగుపడుతుంది!-yoga for eyesight 5 exercises to keep our eyes healthy and sharp ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Yoga For Eyes । మీ కళ్ళతో ఈ వ్యాయామాలు చేస్తే కంటిచూపు మెరుగుపడుతుంది!

Yoga for Eyes । మీ కళ్ళతో ఈ వ్యాయామాలు చేస్తే కంటిచూపు మెరుగుపడుతుంది!

HT Telugu Desk HT Telugu
Jun 23, 2023 02:57 PM IST

Yoga for Eyes: మీ కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, కంటిచూపును మెరుగుపరచడానికి కొన్ని ప్రభావవంతమైన యోగా ఆసనాలు ఏం ఉన్నాయో క్రింద తెలుసుకోండి.

Yoga for eyes
Yoga for eyes (istock)

Yoga for eyes: నేటి డిజిటల్ యుగంలో, స్క్రీన్‌లు మన జీవితంలో అంతర్భాగంగా మారాయి. పిల్లలు, పెద్దలు అందరూ ఎలక్ట్రానిక్ పరికరాలతో నిమగ్నమై గణనీయమైన సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఇది మన కళ్ల ఆరోగ్యంను ప్రమాదంలోకి నెట్టివేసింది. ముఖ్యంగా పిల్లలకు ఇది చిన్న వయస్సులోనే దృష్టి సమస్యలను పెంచుతుంది. మరోవైపు, నిశ్చలమైన జీవనశైలి, మధుమేహం, థైరాయిడ్ వంటి ఎండోక్రైన్ వ్యాధులు ఉన్నప్పుడు డయాబెటిక్ రెటినోపతి, మాక్యులర్ ఎడెమా, కంటిశుక్లం, గ్లాకోమా వంటి కంటి సంబంధిత సమస్యలకు కారణం అవుతాయి. ఇవన్నీ కళ్లను తీవ్రంగా నష్టపరిచేవే.

అయితే మీకు ఈ విషయం తెలుసా? కళ్లకు కూడా యోగా అభ్యాసం చేయవచ్చు. కంటికి సంబంధించిన కొన్ని యోగాసనాలు మీ కళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడతాయి. HT లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్ బసు ఐ హాస్పిటల్ డైరెక్టర్ అయిన డాక్టర్ మన్‌దీప్ సింగ్ బసు మాట్లాడుతూ “మన దినచర్యలో సాధారణ యోగా వ్యాయామాలను చేర్చడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అవి మయోపియా, హైపర్‌మెట్రోపియాతో సహా చాలా వరకు కంటి సమస్యలను నివారించడంలో ప్రభావవంతంగా ఉంటాయి" అని చెప్పారు.

మీ కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, కంటిచూపును మెరుగుపరచడానికి యోగా శాస్త్రంలో పేర్కొన్న కొన్ని ప్రభావవంతమైన యోగా ఆసనాలు ఏం ఉన్నాయో క్రింద తెలుసుకోండి.

1. పామింగ్

మీ కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా కూర్చొని, లోతైన శ్వాస తీసుకుంటూ విశ్రాంతిగా ఉండండి. మీ అరచేతులు వెచ్చగా మారేలా వాటిని గట్టిగా రుద్దండి, ఆపై వాటిని మీ మూసిన కనురెప్పల మీద సున్నితంగా ఉంచండి. ఇలా చేయడం ద్వారా మీ చేతుల వెచ్చదనాన్ని మీ కళ్లు గ్రహించి, కంటి కండరాలకు విశ్రాంతిని అందిస్తాయి. ఈ ప్రక్రియను కనీసం మూడు సార్లు పునరావృతం చేయండి.

2. రెప్పలు వేయడం

కనురెప్పలు వేయడం ద్వారా కూడా మీ కనులకు సులభంగా వ్యాయామం అందించినట్లు ఉంటుంది. ఇది ప్రభావవంతంగానూ ఉంటుంది. ఈ అభ్యాసం సాధన చేయాలంటే హాయిగా కళ్లు తెరిచి కూర్చోవాలి. దాదాపు 10 సార్లు వేగంగా బ్లింక్ చేసి, ఆపై మీ కళ్ళు మూసుకోండి, మీ శ్వాసపై దృష్టి కేంద్రీకరిస్తూ 20 సెకన్ల పాటు విశ్రాంతి తీసుకోండి. ఇదే అభ్యాసాన్ని సుమారు 5 సార్లు పునరావృతం చేయండి. రెప్పలు వేయడం కళ్లను లూబ్రికేట్ చేయడంలో సహాయపడతాయి, ఎక్కువసేపు స్క్రీన్ టైమ్ వల్ల కలిగే ఒత్తిడిని తగ్గిస్తాయి.

3. కంటి భ్రమణాలు

కళ్లను తిప్పడం కూడా మనకు యోగా అందించిన మరో ఆరోగ్య బహుమతి. వెన్నెముకను నిటారుగా ఉంచి కూర్చొని ఈ అభ్యాసం నిర్వహించండి. మీ చేతులను మీ ఒడిలో ఉంచి, మీ తలను కదలకుండా, మీ కళ్ళను మొదట సవ్యదిశలో తిప్పండి, మరోసారి అపసవ్య దిశలో తిప్పండి. ప్రతి దిశలో ఇలా 5-10 నిమిషాలు కంటి భ్రమణాలు చేయండి. ఇవి కంటి కండరాల వశ్యతను, కళ్లకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి, మెరుగైన కంటి చూపుకు దోహదం చేస్తాయి.

4. అప్-డౌన్ మూవ్మెంట్

ఈ యోగా థెరపీ కంటి కండరాలకు చాలా విశ్రాంతినిస్తుంది. దీన్ని చేయడానికి, మీరు చదునైన ఉపరితలంపై లేదా యోగా మ్యాట్‌పై నిటారుగా నిలబడాలి. పైకప్పు వైపు చూడండి, ఆపై మీ చూపును నేలపైకి మార్చండి, మళ్లీ పైకి చూడండి, ఆపై కిందకు చూడండి. రెప్పవేయకుండా ఈ కదలికను 10 సార్లు పునరావృతం చేయండి. తరువాత, మీ కళ్ళు మూసుకుని, వాటిని మీ అరచేతులతో సున్నితంగా నొక్కండి. ఈ వ్యాయామం కంటి కండరాలను విశ్రాంతి తీసుకోవడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది.

5. భ్రమరీ ప్రాణాయామం

భ్రమరీ ప్రాణాయామం అనేది కళ్ళకు అత్యంత ప్రాచుర్యం పొందిన యోగా చికిత్సలలో ఒకటి, ఇది సౌకర్యవంతమైన క్రాస్-లెగ్డ్ పొజిషన్‌లో చేయాలి. మీ కళ్ళు మూసుకుని, మీ చెవులపై మీ బ్రొటనవేళ్లను తేలికగా నొక్కండి, వాటిని కప్పి ఉంచండి. అలాగే మీ చూపుడు వేళ్లను మీ కనుబొమ్మలపై అలాగే మీ రింగ్ వేళ్లు, చిటికెన వేళ్లను మీ నాసికా రంధ్రాల వద్ద ఉంచండి. మీ దృష్టిని మీ కనుబొమ్మల మధ్యలో కేంద్రీకరించండి. మీ ముక్కు ద్వారా లోతుగా శ్వాస పీల్చుకోండి, మీ శ్వాసను 2-3 సెకన్ల పాటు పట్టుకోండి, ఆపై ముక్కు ద్వారానే నెమ్మదిగా ఊపిరి వదలండి, హమ్మింగ్ ధ్వనిని ఉత్పత్తి చేయండి. ఈ ప్రక్రియను ఐదుసార్లు పునరావృతం చేయండి. భ్రమరీ ప్రాణాయామం మీ మనస్సును ప్రశాంతపరుస్తుంది, కంటి ఆరోగ్యాన్ని పెంచుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం