Baby Food: చంటి పిల్లల కోసం రాగులతో సెరెలాక్ పొడి, ఇలా తయారు చేసి పెట్టుకుంటే మూడు నెలలు నిల్వ ఉంటుంది-baby food with ragulu for kids if prepared like this it will be stored for three months ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Baby Food: చంటి పిల్లల కోసం రాగులతో సెరెలాక్ పొడి, ఇలా తయారు చేసి పెట్టుకుంటే మూడు నెలలు నిల్వ ఉంటుంది

Baby Food: చంటి పిల్లల కోసం రాగులతో సెరెలాక్ పొడి, ఇలా తయారు చేసి పెట్టుకుంటే మూడు నెలలు నిల్వ ఉంటుంది

Haritha Chappa HT Telugu
Apr 25, 2024 11:45 AM IST

Baby Food: బేబీ ఫుడ్స్ లో అనేక రకాల రసాయనాలు కలుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే పంచదారను కూడా చేరుస్తున్నట్టు నివేదికలు ఉన్నాయి. కాబట్టి బేబీల కోసం దీన్ని ఇంటి దగ్గర చేయచ్చు.

బేబీ ఫుడ్
బేబీ ఫుడ్

Baby Food: నెలల పిల్లలకు పెట్టే ఆహారాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి కొనాలి. బయట దొరికే సెరెలాక్ లాంటి ఉత్పత్తుల్లో చక్కెర కలుపుతున్నట్టు వార్తలొచ్చాయి. కాబట్టి చిన్నపిల్లలకు ఇంట్లోనే సెరెలాక్ పొడిని తయారుచేసి తినిపించడం మంచిది. రాగి పిండితో బేబీ ఫుడ్ ను తయారు చేయవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. రాగి పిండితో బేబీ ఫుడ్ తయారు చేసి స్టోర్ చేసుకుంటే మూడు నెలల పాటు వాడుకోవచ్చు. దీన్ని చేయడం కూడా చాలా సులువు.

రాగులతో సెరెలాక్ పొడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు

రాగులు - ఒక కప్పు

బియ్యం - అరకప్పు

బాదం పలుకులు - గుప్పెడు

పెసరపప్పు - పావు కప్పు

రాగులతో సెరెలాక్ పొడి రెసిపీ

1. రాగులు, బియ్యం, పెసరపప్పు మూడింటిని శుభ్రంగా కడిగి నీడలోనే ఆరబెట్టాలి.

2. అవి పొడిపొడిగా అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి రాగులు, బియ్యం, పెసరపప్పు, బాదంపప్పు వేయించుకోవాలి.

4. అవి బాగా వేగాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.

5. ఆ పొడిని గాలి చొరబడిన డబ్బాలో దాచుకోవాలి.

6. పిల్లలకు ఆహారం పెట్టేముందు రెండు స్పూన్ల పొడి నీటిలో బాగా కలపాలి.

7. ఆ నీటిని స్టవ్ మీద పెట్టి చిన్న మంట మీద ఉడికించాలి.

8. రుచికి సరిపడా ఉప్పును వేయాలి.

9. అది స్టవ్ మీద ఉన్నప్పుడు ఉండలు కట్టకుండా స్పూనుతో కలుపుతూనే ఉండాలి.

10. అది కాస్త చిక్కగా అయ్యాక స్టవ్ కట్టేయాలి.

11. ఆ మిశ్రమంలో పావు స్పూన్ నెయ్యి కూడా వేసి చల్లారాక పిల్లలకు తినిపించాలి.

12. అంతే రాగులతో బేబీ ఫుడ్ రెడీ అయినట్టే. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఈ బేబీ ఫుడ్‌లో మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపలేదు. సేంద్రియ పద్ధతిలోనే తయారు చేసాము. కాబట్టి పిల్లలకు ఎలాంటి హాని జరగదు. చక్కెరను మాత్రం కలిపి పిల్లలకు పెట్టకండి. వీలైతే బెల్లాన్ని చేర్చండి. తెల్లగా ఉండే బెల్లం కన్నా కాస్త నలుపు రంగులో ఉండే బెల్లాన్ని తీసుకోవడం మంచిది. తెల్లగా ఉండే బెల్లంలో చక్కెర శాతం అధికంగా ఉండే అవకాశం ఉంది. గానుగ బెల్లం పెడితే మరీ మంచిది. సేంద్రీయ పద్ధతిలో తయారైన బెల్లం కూడా అందుబాటులో ఉంటుంది. దాన్ని కలిపి పెడితే పిల్లలకు మేలు జరుగుతుంది. తీపి అలవాటు చేయకూడదనుకుంటే చిటికెడు ఉప్పు, నెయ్యి వేసి పెడితే పిల్లలు ఇష్టంగా తినేస్తారు.

Whats_app_banner