Anti aging Facepack: ముఖంలో గ్లో రావాలంటే ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి. చర్మం యవ్వనంగా ఉంటుంది
Anti aging Facepack: యవ్వనమైన స్కిన్ కోసం యాంటీ ఏజింగ్ క్రీములు వాడుతున్నారా? వాటికి బదులు సహజ సిద్ధంగానే మీ చర్మాన్ని యవ్వనంగా మార్చేసే ఈ యాంటీ ఏజింగ్ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి.
కొన్ని ఆహారపు అలవాట్లు, జీవనశైలి చర్మాన్ని పాడు చేస్తాయి. తక్కువ వయసులోనే చర్మం వయసు పైబడినట్లు కనిపిస్తుంది. రోజంతా తగినంత నీరు త్రాగటం, తాజా పండ్లు, ఆకుపచ్చ కూరగాయలను ఆహారంలో చేర్చుకుని చర్మాన్ని కొద్దిగా అయినా కాపాడుకోవచ్చు. లేదంటే తొందరగా ముడతలు రావడం, చర్మం నిర్జీవంగా మారడం కనిపిస్తుంది. ఈ జాగ్రత్తలతో పాటే యాంటీ ఏజింగ్ ఫేస్ ప్యాక్స్ కూడా చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచడంలో సాయపడతాయి. ఇప్పుడు చెప్పబోయే ఫేస్ ప్యాక్ ఈ సమస్య తగ్గించడంలో అద్బుతంగా పనిచేస్తుంది. మెరుపు పెంచి చర్మం మీద మృతకణాలను తొలగిస్తుంది. దీని కోసం ఏం కావాలో, తయారీ ఎలాగో చూడండి.
యాంటీ ఏజింగ్ ఫేస్ ప్యాక్:
యాంటీ ఏజింగ్ క్రీములు, లోషన్లకు బదులుగా ఈ ఫేస్ ప్యాక్ వాడటం ఉత్తమం. రసాయనాలు లేకుండా మీ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. ఈ ఫేస్ ప్యాక్ తయారీ కోసం మీకు కావాల్సిన మూడే ముడు వస్తువులు. తేనె, అవిసె గింజలు, పెరుగు.
యాంటీ ఏజింగ్ ఫేస్ ప్యాక్ తయారీ:
అర చెంచా అవిసె గింజలను ముందుగా మిక్సీలో పట్టుకుని పొడి సిద్ధం చేసుకోవాలి. ఆ పొడిలో 1 నుంచి 2 టీస్పూన్ల తేనెను కలిపి ముద్దలాగా చేయాలి. అందులోనే కప్పు పెరుగు కూడా కలుపుకోవాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఫేస్ ప్యాక్ రెడీ అయినట్లే. దీన్ని నేరుగా ముఖానికి రాసుకుంటే సరిపోతుంది.
ఈ మిశ్రమాన్ని ముఖానికే కాకుండా మెడకూ రాసుకోవాలి. రాసుకున్నాక కనీసం అరగంట సేపైనా ఉంచుకోవాలి. కాస్త ఆరిపోయాక చల్లటి నీటితో స్క్రబ్ చేసుకుంటూ కడిగేసుకోవాలి.. తర్వాత మెత్తని టవల్‌తో తుడుచుకుంటే సరిపోతుంది.
ఎలా పని చేస్తుంది:
ఈ యాంటీ ఏజింగ్ ఫేస్‌ప్యాక్ వారానికి ఒక్కసారైనా రాసుకోవాలి. అయితేనే దానివల్ల పూర్తి ఫలితాలు పొందొచ్చు. ఈ ఫేస్ ప్యాక్‌తో పాటే సమతుల్య ఆహారం,చురుకైన జీవనశైలి లాంటివన్నీ ఆరోగ్యకరమైన చర్మానికి సాయపడతాయి.
దీంట్లో వాడే పెరుగు చర్మం మీద పేరుకున్న మృత కణాల్ని తొలగించడంలో సాయపడతుంది. ముఖానికి మర్దనా చేస్తూ రాసుకోవడం వల్ల ఇది మాయిశ్చరైజర్ లాగానూ పనిచేస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మృదువుగా మారుస్తుంది. ఇది ఒక సహజ ఎక్ఫోలియేటర్. అలాగే అవిసె గింజలు కూడా సహజ ఎక్ఫోలియేటర్ లాగా పని చేస్తాయి.
ఇక చర్మం సంరక్షణలో తేనె వాడకం గురించి చెప్పక్కర్లేదు. ఇది చర్మానికి తేమ అందించి తాజాగా మారుస్తుంది. సహజ మాయిశ్చరైజర్ ఇది. చర్మం తేమగా ఉంటే యవ్వనంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.
టాపిక్