Red Masoor Dal: ఎర్రకందిపప్పుతో ఫేస్‌ప్యాక్ ప్రయత్నించారా? బోలెడు లాభాలుంటాయ్..
Red Masoor Dal: ఎర్ర కందిపప్పును వివిధ ప్యాకుల్లాగా ముఖానికి రాసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన చర్మం మన సొంతమవుతుంది. విభిన్న సమస్యలకు దాన్నెలా వాడుకోవచ్చో తెలుసుకోండి.
ఎర్ర కంది పప్పును చాలా మంది పప్పుగా చేసుకుని తింటూ ఉంటారు. అయితే ఇది చర్మ పోషణ విషయంలో అద్భుతంగా పని చేస్తుంది. చర్మానికి అవసరం అయిన విటమిన్లు, మినరళ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. దీనిలో చర్మానికి సాంత్వన కలిగించే లక్షణాలూ ఉన్నాయి. పొడి చర్మం ఉన్న వారైనా, జిడ్డు చర్మం ఉన్న వారైనా కూడా దీన్ని చక్కగా వాడేయొచ్చు. అందుకు తగినట్లుగా దీనికి మరి కొన్ని పదార్థాలను చేర్చుకుని ఫేస్ మాస్కులు, స్క్రబ్‌లు, ప్యాక్‌లు చక్కగా తయారు చేసేసుకోవచ్చు. బ్లాక్ హెడ్లు, వైట్ హెడ్లు తొలగించుకోవడానికి, బ్లీచ్ కోసం, ముడతల్ని తగ్గించుకోవడం కోసం, నల్ల మచ్చల్ని తగ్గించుకోవడానికి ఇది ఎంతో ప్రభావవంతంగా పని చేస్తుంది.
పొడి చర్మం ఉన్న వారికి ఫేస్ స్క్రబ్ :
జిడ్డు చర్మం ఉన్న వారు ఈ ఫేస్ ప్యాక్‌ని ప్రయత్నించవచ్చు. రాత్రి కొన్ని కాచిన పాలలో, రోజ్ వాటర్ కలపాలి. దానిలో ఎర్ర కంది పప్పును వేసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం దాన్ని మెత్తని ముద్దలా మిక్సీ పట్టుకోవాలి. దాన్ని ముఖానికి పట్టించుకుని 20 నిమిషాల స్క్రబ్బింగ్ చేసుకోవాలి. తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. దీని వల్ల చర్మం నిగారింపుగా, సున్నితంగా మారుతుంది.
పాలు, ఎర్ర కంది పప్పుతో ఫేస్ ప్యాక్ :
ముందుగా ఎర్ర కంది పప్పును మిక్సీలో వేసి మెత్తటి పొడిలా చేసుకోండి. రెండు స్పూన్ల పొడిని తీసుకోండి. దానికి కొద్దిగా పచ్చి పాలను కలపండి. పేస్ట్‌లా చేసుకుని ముఖానికి పట్టించుకోండి. 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవడమే. వారానికి రెండు సార్లు ఈ ఫేస్ ప్యాక్‌ని వేసుకోవచ్చు.
తేనె, ఎర్ర కంది పప్పుతో ఫేస్ ప్యాక్ :
ఎర్ర కంది పప్పులో మాయిశ్చరైజర్‌కు ఉండాల్సిన అన్ని లక్షణాలూ ఉంటాయి. ఇది చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి పనికి వస్తుంది. ఎర్ర కంది పప్పు పొడిని ఒక స్పూనుడు తీసుకోండి. అందులో రెండు స్పూన్ల తేనెను వేసి పేస్ట్‌లా చేయండి. దాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని 15 నిమిషాల పాటు వదిలేయండి. తర్వాత గోరు వెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
ట్యానింగ్‌ని పోగొట్టుకోవడానికి :
కొంతమంది ఎక్కువగా ఎండలో తిరిగి బాగా ట్యాన్ అయిపోతూ ఉంటారు. అలాంటి వారు ఈ ఎర్ర కందిపప్పు పొడికి శెనగ పిండిని జోడించి నీరు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దాన్నిముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. వారానికి మూడు సార్లు చొప్పున ఈ ఫేస్ ప్యాక్‌ని వేసుకోవడం వల్ల ట్యానింగ్ తగ్గుతుంది.