Allam Pachadi: క్యాటరింగ్ స్టైల్ లో ఇలా అల్లం పచ్చడి చేసి పెట్టుకోండి, ఏ టిఫిన్లలోకైనా అదిరిపోతుంది
Allam Pachadi: అల్లం పచ్చడి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ దీన్ని ఇష్టంగా తినేవారి సంఖ్య తక్కువ. అల్లం పచ్చడిని ఇలా చేస్తే ఎవరికైనా నచ్చుతుంది. రెసిపీ ఇదిగోండి
Allam Pachadi: అన్ని పచ్చళ్లలోకి అల్లం పచ్చడి ఆరోగ్యకరమైనది. అయినా కూడా అల్లం పచ్చడి ఎక్కువమంది ఇష్టపడరు. కారణం దాని ఒక ప్రత్యేకమైన రుచి. నిజానికి అల్లం పచ్చడిని సరైన పద్ధతిలో చేస్తే చాలా రుచిగా ఉంటుంది. క్యాటరింగ్ స్టైల్ లో ఇక్కడ మేము అల్లం పచ్చడి ఎలా చేయాలో ఇచ్చాము. ఇలా ఫాలో అయిపోండి. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది. ఇడ్లీ, దోశె, అన్నం ఎందులో తిన్నా కూడా ఇది రుచిగా ఉంటుంది. దోశపై అల్లం పచ్చడి గరిటతోనే అద్దుకొని తింటే అల్లం దోశలాగా అదిరిపోతుంది. ఇది ఎలా చేయాలో ఇక్కడ రెసిపీ ఇచ్చాము.
అల్లం పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు
అల్లం - 100 గ్రాములు
చింతపండు - 50 గ్రాములు
నూనె - మూడు స్పూన్లు
పచ్చిశనగపప్పు - ఒక స్పూను
మినప్పప్పు - ఒక స్పూను
ధనియాలు - ఒక స్పూను
జీలకర్ర - అర స్పూను
ఎండుమిర్చి - పది
ఉప్పు - రుచికి సరిపడా
బెల్లం తురుము - 50 గ్రాములు
వేడి నీళ్లు - మూడు స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు - ఆరు
కరివేపాకులు - గుప్పెడు
అల్లం పచ్చడి రెసిపీ
1. ముందుగా అల్లాన్ని తీసుకొని పైన పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేయాలి.
3. ఆయిల్ వేడెక్కిన తరువాత శెనగపప్పు, మినప్పప్పు వేసి వేయించుకోవాలి.
4. ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి.
5. అవి వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను వేసి వేయించాలి.
6. వీటిని పలుచగా కట్ చేస్తే త్వరగా వేగుతాయి.
7. అల్లం ముక్కలు వేగాక ఎండుమిర్చిని వేసి వేయించుకోవాలి.
8. ఇప్పుడు చింతపండును నీటిలో నానబెట్టి నీటితో సహా ఆ చింతపండును వేయాలి.
9. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. చిన్న ఫ్లేమ్ లోనే మూత పెట్టి ఈ మొత్తాన్ని ఉడకనివ్వాలి.
10. నీళ్లు ఇంకిపోయే వరకు ఉడకనివ్వాలి. నీరంతా ఇంకిపోయాక మిశ్రమం ఇగురులాగా దగ్గరగా వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి.
11. దాన్ని బాగా చల్లార్చలి. తర్వాత ఆ మొత్తం మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
12. బెల్లం తురుమును వేసి రుబ్బుకోవాలి. ఇలా రుబ్బినప్పుడు నీళ్లు అవసరం పడతాయి. అప్పుడు చన్నీళ్లను వాడకూడదు. రెండు మూడు స్పూన్ల వేడి నీళ్లు మాత్రమే వాడాలి.
13. ఇలా వేడి నీళ్లు పోయడం వల్ల పచ్చడి ఎక్కువకాలం నిల్వ ఉంటుంది.
14. ఈ అల్లం పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
15. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
16. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకులు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకొని ఈ పచ్చడి పైన పోపులాగా వేసుకోవాలి.
17. దీన్ని ఒక డబ్బాలోకి తీస్తే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది.
18. ఏ టిఫిన్స్ లోకి అయినా దీన్ని తినవచ్చు. క్యాటరింగ్ స్టైల్ లో చేసే ఈ అల్లం పచ్చడి ఎవరికైనా నచ్చుతుంది.
19. ఎందుకంటే ఇందులో అల్లంతో సమానంగా చింతపండు, ఎండుమిర్చి వంటివి వేసాము. కాబట్టి ఇది ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది.
అల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అల్లం పచ్చడి తినడం వల్ల జీర్ణక్రియ చక్కగా సాగుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది. అల్లంలో జింజెరాల్ ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీయాక్సిడెంట్. ఇది జీర్ణవ్యవస్థను కాపాడుతుంది. ఇందులో ఉండే ఎంజైమ్‌లు జీర్ణక్రియకు సహాయపడతాయి. కాబట్టి పొట్ట సమస్యలు రాకుండా ఉంటాయి. మలబద్ధకం, గ్యాస్ట్రిక్, అజీర్ణం వంటివి రాకుండా ఉంటాయి. విటమిన్ సి అల్లంలో అధికంగా ఉంటుంది. అల్లం పచ్చడిని రోజుకు ఒక స్పూను తినండి చాలు, ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి.
టాపిక్