Contaminated food: అలాంటి ఆహారం తినడం వల్ల ప్రతిరోజూ 15 కోట్ల మంది అనారోగ్యాలకు గురవుతున్నారట, అందులో మీరూ ఉన్నారా?-15 crore people are getting sick every day due to eating contaminated food take these precautions ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Contaminated Food: అలాంటి ఆహారం తినడం వల్ల ప్రతిరోజూ 15 కోట్ల మంది అనారోగ్యాలకు గురవుతున్నారట, అందులో మీరూ ఉన్నారా?

Contaminated food: అలాంటి ఆహారం తినడం వల్ల ప్రతిరోజూ 15 కోట్ల మంది అనారోగ్యాలకు గురవుతున్నారట, అందులో మీరూ ఉన్నారా?

Haritha Chappa HT Telugu
Jun 12, 2024 09:30 AM IST

Contaminated food: ప్రపంచంలో కలుషిత ఆహారం తినడం వల్ల ప్రతిరోజు పదిహేను కోట్ల మందికి పైగా ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

కలుషిత ఆహారంతో సమస్యలు
కలుషిత ఆహారంతో సమస్యలు (Pixabay)

Contaminated food: మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పదిహేను కోట్ల మంది ప్రతిరోజూ కలుషిత ఆహారం తినడం కారణంగా అనేక రోగాల బారిన పడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. వారిలో 40 శాతం మంది ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలే. వారు కలుషిత ఆహారం తీసుకుని తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారు. అసురక్షిత ఆహారంతో అనేక రకాల రోగాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి తినే ఆహారంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెట్టాలి. పిల్లలు తినే ఆహారాన్ని జాగ్రత్తగా పరిశీలించాకే వారికి ఇవ్వాలి.

లక్షల మంది మరణం

ప్రపంచవ్యాప్తంగా కలుషిత ఆహారం తినడం వల్ల 15 కోట్ల మందికి పైగా అనారోగ్యాల బారిన పడుతుంటే వారిలో 1,75,000 మంది మరణిస్తున్నారని అంచనా. వారు తిన్న ఆహారం శరీరంలో టాక్సిన్లు ఏర్పడడానికి కారణమై ఫుడ్ పాయిజన్ కు దారి తీస్తోంది. పరిస్థితి చేయి దాటి మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. కాబట్టి ఆహారం కలుషితం కాకుండా జాగ్రత్తలు పాటించాలి. అలాగే కలుషిత ఆహారాన్ని గుర్తించి తినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

చేతులకు బ్యాక్టీరియా, వైరస్‌లు అధికంగా అతుక్కునే అవకాశం ఉంది. కాబట్టి తినే ముందు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి. హ్యాండ్ వాష్ తో శుభ్రపరచుకుంటే వ్యాధి కారక క్రిములను వదిలించుకోవచ్చు. ఎప్పటికప్పుడు చేతులను శానిటైజ్ చేసుకోవడం చాలా అవసరం.

పచ్చి మాంసాలను ముట్టుకోవద్దు

నిజంగా పచ్చి మాంసాలను చేతితో ముట్టుకోవడం మానేయాలి. పచ్చి మాంసాలపై సాల్మొనెల్లా, ఈ. కోలి వంటి బానికరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. అవి శరీరంలో చేరితే చాలా ప్రమాదకరం. కాబట్టి పచ్చి మాంసాన్ని చేత్తో ముట్టుకోవడం మానేసి, గ్లవుజులు వేసుకొని శుభ్రపరచడం మంచిది. ఆహారం నిల్వలు సరైన ఉష్ణోగ్రత వద్ద ఉండేలా చూసుకోవాలి. పాడైపోయిన ఆహారాలను తినడం వల్ల కూడా అతిసారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. అనేక రకాల బ్యాక్టీరియాలు శరీరంలో చేరుతాయి. ఇది ఫుడ్ పాయిజన్ కి కారణం అవుతుంది.

బాగా ఉడికించాకే

ఆహారాన్ని పూర్తిగా ఉడికించాకే తినాలి. కొన్ని రకాల ఆహారాల్లో హానికరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. వాటిని చంపాలంటే అధిక ఉష్ణోగ్రతల వద్ద వండాల్సి వస్తుంది. కాబట్టి మాంసం, సముద్రపు ఆహారం వంటి వాటిని అధిక ఉష్ణోగ్రతల వద్ద వండాకే తినడం చాలా ముఖ్యం.

ఇంట్లో ఉపయోగించే గిన్నెలు, వంట పాత్రలు, వంటగది పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లేకుంటే ఆహార పదార్థాలు పై బ్యాక్టీరియాలు చేరే అవకాశం ఉంటుంది. వంటగది, వంట పాత్రలపై ఉన్న బ్యాక్టీరియాలు శరీరంలో సులువుగా చేరుతాయి. కాబట్టి కలుషిత ఆహారం బారిన పడకుండా ఉండాలంటే పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం.

బయట దొరికే స్టోరేజ్ ఫుడ్స్ ప్రాసెసింగ్ చేసేటప్పుడు, రవాణా చేసేటప్పుడు, నిల్వ చేసేటప్పుడు బ్యాక్టిరియాలతో అనుసంధానమయ్యే అవకాశం ఉంది. యూరోపియన్ యూనియన్ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం మన దేశంలో దొరికే 527 రకాల ఆహారాల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్టు గుర్తించారు. కాబట్టి ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

వండకుండా తినే పండ్లు, పదార్థాలలోనే అధికంగా బ్యాక్టిరియా చేరే అవకాశం ఉంది. కాబట్టి వాటిని పరిశుభ్రం చేశాక తినాలి. కోడిగుడ్లు వాడేటప్పుడు వాటిని ఎప్పుడు కడగకూడదు. అలా కడిగితే గుడ్డు పెంకుపై ఉన్న సన్నని రంధ్రాల ద్వారా బ్యాక్టిరియా నీటితో పాటూ లోపికి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి వాటిని కడగకుండా అలా పెంకు పగలగొట్టి వండేసుకోవాలి.

Whats_app_banner