Weekend OTT: ఓటీటీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ముఖ్యంగా తెలుగు కంటెంట్ కోసం చూస్తున్న వాళ్లకు ఈ వీకెండ్ అందుబాటులో ఉండే సినిమాలు, వెబ్ సిరీస్ చూడటానికి అసలు టైమ్ కూడా సరిపోదేమో. నేరుగా తెలుగుతోపాటు డబ్ అయిన మూవీస్, సిరీస్ కూడా అలరించబోతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ఆహా వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీలివ్ లాంటి ఓటీటీల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి.
సూపర్ హిట్ రూరల్ కామెడీ డ్రామా కమిటీ కుర్రోళ్లు మూవీ గురువారమే (సెప్టెంబర్ 12) ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చేసింది. నిహారిక నిర్మించిన ఈ సినిమాలో 11 మంది హీరోలతో థియేటర్లలో మంచి సక్సెస్ సాధించింది.
ఎన్నో అంచనాల మధ్య వచ్చిన బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన మాస్ మహారాజా రవితేజ మూవీ మిస్టర్ బచ్చన్. ఈ సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం (సెప్టెంబర్ 12) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
నెట్‌ఫ్లిక్స్ లోనే మరో తెలుగు సూపర్ హిట్ మూవీ ఆయ్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. నార్నె నితిన్ నటించిన ఈ సినిమా కూడా థియేటర్లలో ప్రేక్షకులను బాగా అలరించింది.
సోనీలివ్ ఓటీటీలోకి వచ్చిన వెబ్ సిరీస్ బెంచ్ లైఫ్. నిహారిక నిర్మించిన తొలి సిరీస్ ఇది. ఇది కూడా గురువారం నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. పాజిటివ్ రివ్యూలతో ఈ సిరీస్ వీకెండ్ మంచి టైంపాస్ అవుతుంది.
గత నెలలో థియేటర్లలో రిలీజైన యాక్షన్ డ్రామా పరాక్రమం. ఈ తెలుగు సినిమా శనివారం (సెప్టెంబర్ 14) నుంచి ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సినిమాకు ఐఎండీబీలో మంచి రేటింగ్ ఉంది.
ఇవన్నీ నేరుగా తెలుగులో వచ్చిన సినిమాలు, సిరీస్ కాగా.. కొన్ని డబ్బింగ్ మూవీస్, సిరీస్ కూడా ఈ వీకెండ్ ఓటీటీల్లో చూడొచ్చు. అవేంటో చూద్దాం.
మలయాళ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ తలవన్. ఈ సినిమా సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి థ్రిల్ అందించే మూవీ ఇది. మలయాళ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తుంది.
ఆహా కూడా మలయాళ మూవీయే. మూడేళ్ల తర్వాత ఇప్పుడు తెలుగులోకి వచ్చింది. టగ్ ఆఫ్ వార్ ఆట నేపథ్యంలో సాగే ఈ మూవీ.. ఆహా వీడియోలో గురువారం (సెప్టెంబర్ 12) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
తమిళం నుంచి తెలుగులోకి డబ్ అయిన సిరీస్ గోలీసోడా రైజింగ్. ఇప్పటికే ఈ ఫ్రాంఛైజీ నుంచి రెండు సినిమాలు రాగా.. ఇప్పుడు వెబ్ సిరీస్ రూపంలో వస్తోంది. శుక్రవారం (సెప్టెంబర్ 13) నుంచి హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
సెక్టార్ 36 ఓ హిందీ మూవీ. అయితే తెలుగులోనూ డబ్ అయింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కూడా శుక్రవారం (సెప్టెంబర్ 13) నుంచే స్ట్రీమింగ్ కాబోతోంది.