Committee Kurrollu OTT: కౌంట్‌డౌన్ షురూ.. ఇంకొన్ని గంటల్లో జాతర మొదలు.. ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ రూరల్ కామెడీ
Committee Kurrollu OTT: ఓటీటీలోకి సూపర్ హిట్ రూరల్ కామెడీ డ్రామా మూవీ కమిటీ కుర్రోళ్లు రాబోతోంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు కౌంట్ డౌన్ షురూ అయింది. మరికొన్ని గంటల్లోనే జాతర మొదలు కానుంది.
Committee Kurrollu OTT: కమిటీ కుర్రోళ్లు.. ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన లో బడ్జెట్ సూపర్ హిట్ రూరల్ కామెడీ డ్రామా ఇది. థియేటర్లలో విజయవంతంగా ఆడిన తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. మరికొన్ని గంటల్లోనే జాతర మొదలు అంటూ ఈ మూవీని స్ట్రీమింగ్ చేయబోయే ఈటీవీ విన్ ఓటీటీ బుధవారం (సెప్టెంబర్ 11) తన ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేసింది.
కమిటీ కుర్రోళ్లు ఓటీటీ స్ట్రీమింగ్
11 మంది హీరోలతో వచ్చి ప్రేక్షకులను మెప్పించిన రూరల్ కామెడీ డ్రామా కమిటీ కుర్రోళ్లు. మెగా డాటర్ నిహారిక నిర్మించిన తొలి సినిమా ఇది. ఈ సినిమా గురువారం (సెప్టెంబర్ 12) నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఇదే విషయాన్ని సదరు ఓటీటీ చెబుతూ.. "ఇంకొన్ని గంటల్లో జాతర మొదలు.. కమిటీ కుర్రోళ్లు ప్రీమియర్ సెప్టెంబర్ 12న కేవలం ఈటీవీ విన్ లోనే" అనే క్యాప్షన్ ఉంచింది. ఈ సందర్భంగా 1 డే టు గో అనే కౌంట్ డౌన్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.
ఈ మూవీ డిజిటల్ హక్కులను తాము దక్కించుకున్న గత నెలలోనే ఈటీవీ విన్ వెల్లడించింది. ఈ నెలలో రాబోతోందని మొదట చెప్పగా.. తర్వాత సెప్టెంబర్ 12 అంటూ స్ట్రీమింగ్ డేట్ కూడా రివీల్ చేసింది.
కమిటీ కుర్రోళ్లు మూవీ ఏంటి?
నిహారిక కొణిదెల నిర్మించిన ఈ కమిటీ కుర్రోళ్లు మూవీ రిలీజైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో నాలుగు రోజుల్లోనే రూ.7.4 కోట్లు వసూలు చేసిన లాభాల్లోకి దూసుకెళ్లింది.
కమిటీ కుర్రాళ్లు అచ్చమైన, స్వచ్ఛమైన పల్లెటూరి కథ. పల్లెటూళ్లలో కల్మషం లేని మనుషులు, వారి స్నేహాలు... అక్కడి రాజకీయాలు ఎలా ఉంటాయన్నది దర్శకుడు యదు వంశీ నాచురల్‌గా ఈ సినిమాలో చూపించారు. ఓ సినిమాలా కాకుండా ఓ పల్లె వాతావరణాన్ని కళ్ల ముందు తీసుకొచ్చి ఓ నోస్టాల్జిక్ ఫీలింగ్‌ను కలిగించాడు.
ఈ రూరల్ కామెడీ డ్రామాలో అంతర్లీనంగా రిజర్వేషన్ల కు సంబంధించిన ఓ ఇష్యూను ఎలాంటి వివాదాలకు తావులేకుండా టచ్ చేయడం బాగుంది. ప్రతిభ ఉండి చదువుకు కొందరు ఎలా దూరం అవుతున్నారనే అంశాన్ని హృద్యంగా ఆవిష్కరించాడు. ఆ పాయింట్‌తోనే స్నేహితుల మధ్య దూరం పెరగడం అనే అంశాన్ని రాసుకున్న తీరు ఆకట్టుకుంటుంది.
కమిటీ కుర్రాళ్లుగా మూవీలో 11 మంది హీరోల నటన బాగుంది. ప్రతి ఒక్కరూ పోటీపడి నటించారు. అయితే శివగా సందీప్ సరోజ్ ఎక్కువగా హైలైట్ అయ్యాడు. యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ఈశ్వర్‌లకు నటన గుర్తుండిపోతుంది.
పాజిటివ్‌గా కనిపించే నెగెటివ్ షేడ్ క్యారెక్టర్‌లో సాయికుమార్ తన నటనానుభవంతో అదరగొట్టాడు. గోపరాజు రమణ, శ్రీలక్ష్మి, కేరాఫ్ కంచెరపాలెం కిషోర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమాకు దీపక్‌దేవ్ మ్యూజిక్ పెద్ద ప్లస్సయింది. పాటలు, జాతర నేపథ్యంలో వచ్చే బీజీఎమ్ ఆకట్టుకుంటాయి. కెమెరామెన్ మారాజు గోదావరి అందాలను చక్కగా చూపించాడు.