Tillu Square Box office Collections: కొనసాగుతున్న టిల్లు వసూళ్ల జోరు.. మరో ల్యాండ్‍మార్క్ దాటిన కలెక్షన్లు
Tillu Square Box office Collections: టిల్లు స్క్వేర్ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద తిరుగులేకుండా పోయింది. దీంతో ఇంకా కలెక్షన్లను రాబడుతోంది. తాజాగా మరో మైల్‍స్టోన్ చేరింది.
Tillu Square Collections: కామెడీ థ్రిల్లర్ టిల్లు స్క్వేర్ మూవీ అంచనాలకు మించి భారీ బ్లాక్ బస్టర్ అవుతోంది. భారీ వసూళ్లతో దుమ్మురేపుతోంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ చిత్రం మార్చి 29న థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇంకా మంచి వసూళ్లను రాబడుతోంది. పెద్దగా పోటీ లేకపోవడం, ఫ్యామిలీ స్టార్ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో టిల్లు స్క్వేర్ కలెక్షన్ల జోరు ఇంకా సాగుతోంది. ఈ చిత్రం తాజాగా మరో ముఖ్యమైన మార్క్ చేరింది.
ఇంకో ల్యాండ్‍మార్క్
టిల్లు స్క్వేర్ సినిమా రూ.125 కోట్ల మార్కును దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 18 రోజుల్లో రూ.125.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించిందని మూవీ టీమ్ నేడు (ఏప్రిల్ 16) అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.
“డబుల్ బ్లాక్‍బస్టర్ టిల్లు స్క్వేర్ కొత్త ల్యాండ్ మార్క్ చేరింది. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ.125 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది. ఇంత భారీ బ్లాక్‍బస్టర్ సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్స్” అంటూ సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ నేడు ట్వీట్ చేసింది. తర్వాతది మరింత భారీగా, బెటర్‌గా ఉంటుందంటూ టిల్లు క్యూబ్ గురించి కూడా పేర్కొంది.
టిల్లు స్క్వేర్ మూవీతో తొలిసారి రూ.100 కోట్ల క్లబ్‍లోకి సిద్ధు జొన్నలగడ్డ అడుగుపెట్టారు. 9 రోజుల్లోనే ఈ చిత్రం ఆ మార్క్ చేరింది. తాను రూ.100 కోట్ల సినిమా కొడతానని మూడేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సిద్ధు.. లక్ష్యం కంటే ముందే దాన్ని కొట్టేశారు. టిల్లు స్క్వేర్ చిత్రానికి స్క్రిప్ట్ కూడా రాశారు సిద్ధు.
తన యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, స్వాగ్‍తో టిల్లు క్యారెక్టర్‌ను ఐకానిక్‍గా మార్చేశారు సిద్ధు జొన్నలగడ్డ. రెండేళ్ల క్రితం డీజే టిల్లు సూపర్ హిట్ అయితే దానికి సీక్వెల్‍గా ఇప్పుడు వచ్చిన టిల్లు స్క్వేర్ అంచనాలకు మించి బ్లాక్‍బస్టర్‌గా నిలిచింది. టిల్లు క్యూబ్‍ను కూడా అనౌన్స్ చేసేయడంతో ఆ మూవీకి కూడా క్రేజ్ విపరీతంగా ఉండనుంది.
టిల్లు స్క్వేర్ గురించి..
టిల్లు స్క్వేర్ మూవీలో సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‍గా చేశారు. మురళీధర్ గౌడ్, ప్రిన్స్ సెసిల్, మురళీ శర్మ, ప్రణీత్ రెడ్డి ముఖ్యమైన పాత్రలు చేయగా.. ఫస్ట్ పార్ట్‌లో రాధికగా మెప్పించిన నేహా శెట్టి కూడా కాసేపు కనిపించారు. టిల్లు స్క్వేర్ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు.
టిల్లు స్క్వేర్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‍మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూజ్ చేయగా.. రామ్ మిర్యాల, అచ్చు రాజమణి, భీమ్స్ సెసిరోలియో మ్యూజిక్ డైరెక్టర్లుగా పని చేశారు. సిద్ధు జొన్నలగడ్డతో పాటు రవి ఆంథోనీ కూడా స్క్రిప్ట్ అందించారు.
టిల్లు స్క్వేర్ చిత్రంపై పలువురు స్టార్ హీరోలు కూడా ప్రశంసలు కురిపించారు. మెగాస్టార్ చిరంజీవి ఆ మూవీ టీమ్‍ను అభినందించారు. తాను ఈ చిత్రాన్ని చాలా ఎంజాయ్ చేశానని అన్నారు. మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ ఎన్టీఆర్.. ఈ సినిమా సక్సెస్ మీట్ ఈవెంట్‍కు హాజరయ్యారు.