Allu Arjun: అల్లు అర్జున్‍ను అన్‍ఫాలో చేసిన సాయి ధరమ్ తేజ్.. సోషల్ మీడియాలో రచ్చ
Allu Arjun - Sai Dharam Tej: అల్లు అర్జున్‍ను ఇన్‍స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్)లో అన్‍ఫాలో చేశారు సాయి ధరమ్ తేజ్. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య పెద్ద రచ్చే సాగుతోంది.
Allu Arjun - Sai Dharam Tej: మెగా - అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చిందని కొంతకాలం వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఏపీ ఎన్నికల ప్రచారంలో వైఎస్‍ఆర్‌సీపీ అభ్యర్థి శిల్పా రవి ఇంటికి వెళ్లి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మద్దతు తెలపటంతో ఈ రూమర్లు జోరందుకున్నాయి. జనసేన అధినేత, తన మామయ్య పవన్ కల్యాణ్ పోరాడుతున్న వైసీపీకి చెందిన అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు తెలుపడం వివాదంగా మారింది. ఆ తర్వాత మెగా బ్రదర్ నాగబాబు చేసిన ఓ ట్వీట్ దుమారాన్ని రేపింది. అయితే, తాజాగా నేడు (జూన్ 12) అల్లు అర్జున్‍ను సోషల్ మీడియా అకౌంట్లలో మెగా యంగ్ హీరో అన్‍ఫాలో చేయడం హాట్ టాపిక్‍గా మారింది.
అన్‍ఫాలో చేసిన తేజ్
ఇన్‍స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) సోషల్ మీడియా ప్లాట్‍ఫామ్‍ల్లో అల్లు అర్జున్‍ను సాయిధరమ్ తేజ్ (సాయి దుర్గ తేజ్) అన్‍ఫాలో చేసేశారు. అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డిని కూడా అన్‍ఫాలో చేసేశారు. దీంతో సోషల్ మీడియాలో దీనిపై చర్చ మొదలైంది. ఏపీ మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే.. సాయి తేజ్ ఇలా చేయడం మరింత ఇంట్రెస్టింగ్‍గా మారింది.
సోషల్ మీడియాలో రచ్చ
అల్లు అర్జున్‍ను సాయి ధరమ్ తేజ్ అన్‍ఫాలో చేసిన విషయంపై సోషల్ మీడియాలో రచ్చ సాగుతోంది. మరోసారి మెగా - అల్లు అభిమానులు కొందరు సోషల్ మీడియాలో వార్ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్‍ను కావాలనే నెగెటివ్ చేస్తున్నారని అతడి ఫ్యాన్స్ కొందరు ఆరోపిస్తుంటే.. ఆయన చేసిన పనులు అలా ఉన్నాయని మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇలా మెగా - అల్లు అంశం మరోసారి సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.
పవన్ ప్రమాణ స్వీకారానికి గైర్హాజరు
ఇటీవలి ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. మంత్రిగా నేడు (జూన్ 12) ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు మెగా కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, అల్లు కుటుంబం నుంచి ఒక్కరు కూడా రాలేదు. అల్లు అర్జున్, అల్లు అరవింద్, అల్లు శిరీష్ సహా అల్లు ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరు హాజరు కాలేదు. దీంతో మెగా - అల్లు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయనే వాదనలకు మరింత బలం చేకూరింది. అల్లు అర్జున్‍ను సాయి ధరమ్ తేజ్ అన్‍ఫాలో కావడం దానికి ఆజ్యం పోసింది.
వివాదం ఎక్కడ మొదలైందంటే..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం చివరి రోజున వైసీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా రవికి మద్దతు ప్రకటించేందుకు ఆయన ఇంటికి వెళ్లారు అల్లు అర్జున్. జనసేన అధినేత పవన్ కల్యాణ్‍కు మెగా కుటుంబం మొత్తం మద్దతుగా నిలిస్తే.. అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లడం వివాదంగా మారింది. తనకు రాజకీయాలతో సంబంధం లేదని, స్నేహం కోసం శిల్పా రవికి సపోర్ట్ చేశానని అల్లు అర్జున్ చెప్పారు. అయితే, తమతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసే వాడు పరాయి వాడే అంటూ మెగా బ్రదర్ నాగబాబు అప్పట్లో ఓ ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ గురించే ఇలా అన్నారంటూ పెద్ద రచ్చే నడిచింది. ఆ తర్వాత ఆ ట్వీట్‍ను నాగబాబు డిలీట్ చేశారు. అయినా, మెగా - అల్లు అభిమానుల మధ్య గ్యాప్ మాత్రం పెరిగిపోయింది.
ఎన్నికల్లో గెలిచాక చిరంజీవి ఇంటికి పవన్ కల్యాణ్ వచ్చినప్పుడు.. నేడు జరిగిన ప్రమాణ స్వీకారంలోనూ అల్లు కుటుంబ సభ్యులు కనిపించలేదు. దీంతో మెగా - అల్లు ఫ్యామిలీ మధ్య గ్యాప్ చాలా పెరిగిపోయిందనే వాదనలు బలపడ్డాయి.