Mega vs Allu fans: మెగా, అల్లు అభిమానుల మధ్య పెరుగుతూనే ఉన్న గ్యాప్! మీమ్‍లతో ఫ్యాన్స్ వార్
Mega vs Allu fans: మెగా, అల్లు అభిమానుల మధ్య చీలిక పెరుగుతూనే ఉంది. ఏపీ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు జరిగిన పరిణామాలతో మొదలైన ఈ తంతు.. ఎక్కువుతోంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ కొనసాగుతూనే ఉంది.
Mega vs Allu fans: మెగా, అల్లు అభిమానుల మధ్య చిచ్చు ఇప్పట్లో ఆరేలా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో మీమ్‍లతో ఫ్యాన్స్ మధ్య వార్ తీవ్రమవుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడంతో ఈ రచ్చ మొదలైంది. తన మామయ్య, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాడుతున్న జనసేనకు ప్రత్యర్థిగా ఉన్న పార్టీ అభ్యర్థి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడం దుమారాన్ని రేపింది. దీనికి అల్లు అర్జున్ వివరణ ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఇక మెగా సోదరుడు నాగబాబు చేసిన ట్వీట్ ఈ అగ్నికి కావాల్సినంత ఆజ్యం పోసేసింది.
చిచ్చు ఎందుకు?
మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్ సహా మెగా యంగ్ హీరోలందరూ ఏపీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‍కు మద్దతు తెలిపారు. అయితే, సడెన్‍గా చివరి రోజు నంద్యాల వైసీపీ అభ్యర్థి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడం విస్మయపరిచింది. తనకు పార్టీలతో సంబంధం లేదని, స్నేహితుడిగానే శిల్పా రవి ఇంటికి వెళ్లానని అల్లు అర్జున్ రెండుసార్లు స్పష్టత ఇచ్చారు. అయితే, “మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు.. మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడే వాడు పరాయివాడైనా మాడే” అంటూ నాగబాబు చేసిన ఓ ట్వీట్ రచ్చకు కారణమైంది. ఆయన పేర్లు ప్రస్తావించకున్నా అల్లు అర్జున్ గురించే ట్వీట్ చేశారనే చాలా మంది ఫిక్స్ అయిపోయారు. ఈ లైన్‍పైనే సోషల్ మీడియాలో మెగా, అల్లు అభిమానుల మధ్య వార్ తీవ్రమవుతోంది.
మీమ్‍లతో యుద్ధం
సాధారణంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ ఒకే గొడుకు కింద ఉండేలా కనిపించే మెగా, అల్లు అభిమానుల మధ్య ఇప్పుడు చీలిక వచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్‍ను విమర్శిస్తూ కొందరు మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్‍కు కాకుండా వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడం కరెక్ట్ కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. అది కూడా పిఠాపురానికి రామ్‍చరణ్ వెళ్లిన రోజే పోటీ అన్నట్టు అదేరోజున నంద్యాలకు వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా రామ్‍చరణ్ వర్సెస్ అల్లు అర్జున్ అనేలా ఏకంగా సోషల్ మీడియాలో పరిస్థితి మారిపోయింది. మెగా ఫ్యామిలీని అల్లు అర్జున్ మోసం చేశారనేలా కూడా కొందరు మీమ్స్ క్రియేట్ చేసి వదులుతున్నారు. అల్లు అర్జున్ అప్పుడెప్పుడో చేసిన ‘చెప్పను బ్రదర్’ కామెంట్ నుంచి మరిన్ని విషయాలను బయటికి తీసి కొందరు మెగాఫ్యాన్స్ అంటూ మీమ్స్ పోస్టులు చేస్తున్నారు.
మరోవైపు, కొందరు అల్లు అర్జున్ అభిమానులు కూడా గట్టిగా కౌంటర్లు వేస్తున్నారు. కావాలనే అల్లు అర్జున్‍ను నెగెటివ్ చేస్తున్నారని అంటున్నారు. ఫ్రెండ్షిప్ కోసమే నంద్యాల వెళ్లానని చెప్పినా.. పోలింగ్ రోజు కూడా క్లారిటీ ఇచ్చినా ఎందుకు అర్థం చేసుకోలేకున్నారని కామెంట్లు చేస్తున్నారు. పవన్‍కు మద్దతుగా ట్వీట్ చేశారని గుర్తు చేస్తున్నారు. తన కెరీర్లో అల్లు అర్జున్ ఎదిగిన తీరు గురించి వీడియోలు, మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. అతడు సొంతంగా పైకివచ్చాడనేలా అభిప్రాయపడుతున్నారు.
మొత్తంగా మెగా, అల్లు అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ మాత్రం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఈ విషయంపై హీరోలు స్వయంగా స్పందించడమో.. మళ్లీ ఒకే వేదికపై కనిపించడమో జరిగే వరకు ఈ గ్యాప్ తగ్గుతుందా అనేది చూడాలి.