Nagababu Tweet: నాగబాబు ట్వీట్‌తో మెగా అభిమానులు, మిత్ర పక్షాల్లో గందరగోళం.. లక్ష్యం అతడేనా?-naga babu tweet on elections gone viral who is the targe confusion in fans and alliance leaders ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Nagababu Tweet: నాగబాబు ట్వీట్‌తో మెగా అభిమానులు, మిత్ర పక్షాల్లో గందరగోళం.. లక్ష్యం అతడేనా?

Nagababu Tweet: నాగబాబు ట్వీట్‌తో మెగా అభిమానులు, మిత్ర పక్షాల్లో గందరగోళం.. లక్ష్యం అతడేనా?

Sarath chandra.B HT Telugu
May 14, 2024 01:17 PM IST

Allu Arjun Vs Mega Family: ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడంతో మొదలైన రగడ నాగబాబు ట్వీట్‌తో మరింత వేడెక్కింది. అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య ఉన్న విభేదాలను బయటపెట్టిందన్న చర్చ జరుగుతోంది.

అల్లు అర్జున్‌ ను ఉద్దేశించి నాగబాబు చేసిన ట్వీట్
అల్లు అర్జున్‌ ను ఉద్దేశించి నాగబాబు చేసిన ట్వీట్

Allu Arjun Vs Mega Family: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ వైసీసీ అభ్యర్థి తరపున సినీనటుడు అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారంతో మొదలైన వివాదం తారా స్థాయికి చేరింది. పోలింగ్‌ ముగిసిన కొద్ది గంటల్లోనే నాగబాబు చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేసిందేనని ప్రచారం జరిగినా వాటిని నాగబాబు కార్యాలయం తోసిపుచ్చింది. పార్టీలో ఉంటూనే వ్యతిరేకంగా పనిచేసిన వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలుగా పేర్కొన్నారు.

yearly horoscope entry point

ఏమి జరిగిందంటే…

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌‌కు రెండు రోజుల ముందు సినీ నటుడు అల్లు అర్జున్ నంద్యాలలో పర్యటించారు. వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. అంతకు ముందే అల్లు అర్జున్‌ పవన్‌ కళ్యాణ్‌కు మద్దతుగా ట్వీట్లు చేసినా, వైసీపీ అభ్యర్థి తరపున నేరుగా ఎన్నికల ప్రచారం కోసం నంద్యాల వెళ్లాడు. దీనిపై జనసేన అభిమానులు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేశారు.

సోమవారం తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని వివరణ ఇచ్చుకున్నారు. సాధారణంగా అల్లు అర్జున్‌‌‌కు స్టార్‌డమ్‌ వచ్చాక మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చిన ఉదంతాలు చాలా అరుదు. నంద్యాలలో ఆయన చేసిన వ్యాఖ్యలు, మిత్రుడిని గెలుపు కోసం వచ్చానని చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. అటు మెగా కుటుంబంలో సైతం అల్లు అర్జున్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తమైంది.

దీంతో నష్టనివారణలో భాగంగానే అల్లు అర్జున్ సోమవారం పోలింగ్‌ ముగిసిన వెంటనే మీడియా ముందుకు వచ్చాడు. ఫిలింనగర్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో ఓటు వేసిన తర్వాత ''నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. అన్ని పార్టీలు ఒక్కటే. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా, లేకపోయినా వ్యక్తిగతంగా నా మద్దతు ఉంటుంది. మా మావయ్య పవన్‌కల్యాణ్‌కు నా పూర్తి మద్దతు ఎప్పుడూ ఉంటుంది. నంద్యాలలో రవి గారికి కూడా అలాగే మద్దతు తెలిపాను. భవిష్యత్‌లో తన మావయ్య చంద్రశేఖర్‌, బన్నీ వాస్‌ వ్యక్తిగతంగా దగ్గరైన వ్యక్తులెవరికైనా మద్దతు ఇవ్వాల్సి వస్తే ఇస్తానని ప్రకటించారు.

శిల్పా రవి 15 ఏళ్లుగా తనకు మిత్రుడని, మీరెప్పుడైనా రాజకీయాల్లోకి వస్తే, మీ ఊరు వచ్చి సపోర్ట్‌ చేస్తా అని మాటిచ్చానని, 2019లో ఆయన రాజకీయాల్లోకి వచ్చాక వెళ్లి కలవలేకపోయానని ఇచ్చిన నిలబెట్టుకునేందుకు ఒక్కసారైనా కనపడాలని నా మనసులో ఉందని, ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని తెలిసి, నేనే ఫోన్‌ చేసి వస్తానని చెప్పానన్నారు.

శిల్పాకు అభినందనలు చెప్పడానికి భార్యతో కలిసి నంద్యాల వెళ్లానని వ్యక్తిగతంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పి వచ్చేశానని అల్లు అర్జున్ చెప్పారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదని స్పష్టం చేశారు.మరోవైపు నంద్యాలలో అల్లు అర్జున పర్యటనకు ముందుస్తు అనుమతి లేకపోవడంతో ఆయనపై కేసు నమోదైంది. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30, 144 నిషేదాజ్ఞలు ఉల్లంఘించినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు.

రగిలిపోయిన మెగా అభిమానులు…

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓ వైపు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మరోవైపు పోటీలో ఉన్నాయి. సరిగ్గా పోలింగ్ చివరి రోజు పవన్ కళ్యాణ్ తరపున అల్లు అరవింద్ పిఠాపురంలో ప్రచారానికి వచ్చారు. అల్లు అర్జున్ మాత్రం పవన్‌కు ట్వీట్‌‌తో సరిపెట్టి నంద్యాలలో వైసీపీ తరపున ప్రచారానికి వెళ్లడం పవన్ అభిమానులకు రుచించలేదు.

గత కొన్నేళ్లుగా అల్లు కుటుంబానికి మెగా కాంపౌండ్‌కు మధ్య దూరం పెరిగింది. సరైనోడు సినిమా సమయం నుంచి ఇరు కుటుంబాల మధ్య దూరం పెరిగినట్టు సన్నిహితులు చెబుతారు. మెగా ముద్ర నుంచి బయటపడి స్వీయ అస్తిత్వం కోసం అల్లు అర్జున్ ప్రయత్నించడంతో ఇవి మొదలైనట్టు చెబుతారు. చిరంజీవి సినీ లెగసీకి తమ కుటుంబమే కారణమనే భావన అల్లు ఫ్యామిలీలో ఉందనే ప్రచారం ఉంది. అల్లు అర్జున్ ఎంట్రీ తర్వాత ఇది పెరిగినట్టు సినీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

చిరంజీవి సినీ వారసత్వాన్ని కొనసాగించే విషయంలో మెగా ఫ్యామిలీ ముద్రతో కంటే అల్లు పేరుతో అస్థిత్వాన్ని నిలబెట్టాలని అల్లు అర్జున్ భావించినట్టు సినీ వర్గాలు చెబుతాయి. ఆర్య హిట్‌ తర్వాత సినీ రంగంలో నిలదొక్కుకున్న అల్లు అర్జున ఆ తర్వాత జాతీయ స్థాయి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో మెగా కాంపౌండ్‌ ముద్రలో ఉండటం కంటే సొంత బ్రాండ్‌గా ఎదగడానికి ప్రాధాన్యత ఇచ్చారు. సొంతంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు, అల్లు పేరిట స్టూడియో నిర్మాణం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో తన ముద్రను వేసుకునేందుకు అల్లు అర్జున ప్రాధాన్యత ఇచ్చారనే అనుమానాలు ఉన్నాయి.

చిరంజీవికి అవమానాలు…

కొద్ది రోజుల క్రితం అల్లు కుటుంబానికి చెందిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో నందమూరి బాలకృష్ణతో చేసిన ఇంటర్వ్యూల విషయంలో కూడా మెగా ఫ్యామిలీ నొచ్చుకున్నట్టు తెలుస్తోంది.

మొదటి ఎపిసోడ్ చిరంజీవితో రూపొందించాలని నిర్ణయించిన తర్వాత చివరి నిమిషంలో దానిని మార్చేయడంపై చిరంజీవి నొచ్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో అల్లు కుటుంబం నుంచి ఇంటర్వ్యూ కోసం చిరంజీవిని ఒప్పించిన తర్వాత చివరి నిమిషంలో దానిని మార్చేసినట్టు ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆ షోకు పవన్ కళ్యాణ్‌ హాజరైనా చిరంజీవి మాత్రం వెళ్లలేదు. తొలి ఎపిసోడ్ చిరంజీవితో చిత్రీకరిస్తామని ప్లాన్‌ చేసినా ఉద్దేశపూర్వకంగానే దానిని మార్చారనే అనుమానం మెగా ఫ్యామిలీలో ఉందని సన్నిహితులు చెబుతారు.

ఎన్నికల ప్రచారంలో నంద్యాలలో మిత్రుడి కోసం వెళ్లానని ప్రకటించడం ఆ తర్వాత పోలింగ్‌ స్టేషన్‌లో వివరణ ఇచ్చుకోవడం కూడా నష్ట నివారణలో భాగమేనని మెగా అభిమానులు అనుమానిస్తున్నారు. డామేజ్ కంట్రోల్ చేయడం కోసమే వ్యూహాత్మకంగా మాట్లాడరని, బ్రాండింగ్‌కు ప్రాధాన్యమిచ్చే అల్లు అర్జున్‌ ఎప్పుడూ బహిరంగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన ఉదంతాలు లేవని గుర్తు చేస్తున్నారు.

పోలింగ్ ముగిసే వరకు వేచి చూసిన నాగబాబు…

ఎన్నికల పోలింగ్ ముందు అల్లు అర్జున్‌ వైఖరిపై మెగా ఫ్యామిలీ నొచ్చుకున్నా పోలింగ్ ముగిసే వరకు సంయమనం పాటించారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే నాగబాబు, అల్లు అర్జున నంద్యాల వెళ్లిన రోజే స్పందించాలని భావించినా ఎన్నికల్లో పార్టీ శ్రేణులు, ఓటర్లలో గందరగోళం తలెత్తుతుందనే ఉద్దేశంతో సంయమనం పాటించినట్టు తెలుస్తోంది. తమ పార్టీలో ఉంటూ వ్యతిరేకంగా పనిచేసే వారిని ఉద్దేశించి పనిచేసిన వారిపై చేసిన కామెంట్లుగా చెబుతున్నా అవి అల్లు అర్జున్ టార్గెట్‌గా చేసినవేనని మెగా అభిమానులు చెబుతున్నారు.

‘పిఠాపురంలో వర్మ చేయిచ్చారా?’

మరోవైపు ట్విటర్‌లో నాగబాబు చేసిన కామెంట్‌కు జనసేన అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానులు, ఇతరులు తలో రకంగా కామెంట్ చేశారు. పిఠాపురంలో టీడీపీ నేత వర్మ జనసేనకు మద్దతు ఇవ్వలేదా? అన్న సందేహం వ్యక్తంచేశారు. ఈ కామెంట్ ఆయనను ఉద్దేశించేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ప్రశ్నలు అన్నింటికీ నాగబాబే స్వయంగా స్పష్టత ఇస్తే తప్ప మిత్రపక్షాలు, మెగా అభిమానుల్లో గందరగోళం తీరేలా లేదు.

Whats_app_banner