Pawan Kalyan Sai Dharam Tej Video: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవర్ స్టార్, సినీ హీరో పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన చరిత్ర సృష్టించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‍సభ సీట్లలో అన్నింట్లో గెలిచి అద్భుత విజయాన్ని దక్కించుకుంది. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ ఆధిక్యంలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ పట్టరాని సంతోషంలో మునిగితేలారు. ఫలితాలు వెల్లడైన వెంటనే తన మామ పవన్ కల్యాణ్‍ను కలిశారు.
పవన్ కల్యాణ్‍ను ఆనందంతో సాయి ధరమ్ తేజ్ ఆలింగనం చేసుకున్నారు. సంతోషంతో నవ్వుతూ ఎమోషనల్ అయ్యారు. పవన్ కూడా గట్టిగా నవ్వారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్‍మను తేజ్ ఎత్తుకున్నారు.
ఈ వీడియోను సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. “మీ గెలుపే మా పొగరు.. మా జనసేనాని పవన్ కల్యాణ్ గారు నా హీరో, నా గురు, నా హృదయం, అన్నింటికన్నా ముఖ్యం నా సేనాని” అని పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మామాఅల్లుళ్ల బంధాన్ని చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
పవన్ కల్యాణ్ కోసం పిఠాపురంలో సాయి ధరమ్ తేజ్ ముమ్మరంగా ప్రచారం కూడా చేశారు. జనసేన గెలుపు కోసం పని చేశారు. ఇప్పుడు, తనకు ఎంతో ఇష్టమైన మామ పవన్ గెలుపుతో అంతులేని సంతోషం వ్యక్తం చేశారు.
అంతకు ముందే పవన్ గెలుపుపై ట్వీట్లు చేశారు తేజ్. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం, భవిష్యత్తు సురక్షితమైన చేతుల్లో ఉందని పోస్ట్ చేశారు. జగన్‍ను అధఃపాతాళానికి తొక్కేస్తానని పవన్ గతంలో సవాల్ చేసిన వీడియోను మళ్లీ షేర్ చేశారు సాయి తేజ్. “చెప్పాడు.. చేశాడు.. మనల్ని ఎవడ్రా ఆపేది” అంటూ రాసుకొచ్చారు.
తన తమ్ముడు పవన్ కల్యాణ్ గెలుపుపై మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. అన్నగా తనకు చాలా గర్వంగా ఉందని ట్వీట్ చేశారు. పవన్‍ను గేమ్ ఛేంజర్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని అందరూ ప్రశంసిస్తుంటే తన హృదయం ఉప్పొంగుతోందని చిరూ పేర్కొన్నారు. “డియర్ కల్యాణ్ బాబు.. ఎక్కడ నెగ్గాలో.. ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను.. తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలను నెగ్గించడానికే అని నిరూపించుకున్న నిన్ను చూస్తేంటే గర్వంగా ఉంది” అని చిరూ రాశారు. పవన్ కల్యాణ్ కృషి, త్యాగం, ధ్యేయం, త్యాగం ప్రజల కోసమే అని చిరూ తెలిపారు. ఈ కొత్త అధ్యాయంలో అంతా శుభం కలగాలని పవన్‍ను ఆశీర్వదిస్తున్నానని చిరంజీవి ఎమోషనల్‍గా ట్వీట్ చేశారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన మామ పవన్ కల్యాణ్‍కు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కల్యాణ్ కఠోరశ్రమ, అంకిత భావం తమ హృదయాలను ఎప్పడూ తాకుతుందని ట్వీట్ చేశారు. ప్రజాసేవలో ఈ కొత్త ప్రయాణానికి గాను పవన్‍కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. అద్భుత విజయం సాధించిన జనసేనానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.