Vyooham Shapadham Movies: వ్యూహం, శపథం సినిమాల రిలీజ్ వాయిదా.. ఎందుకో చెప్పిన రామ్‍గోపాల్ వర్మ
Vyooham, Shapadham Postponed: వ్యూహం, శపథం సినిమాల విడుదల వాయిదా పడింది. కొత్త తేదీలను కూడా దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ ప్రకటించారు. ఎందుకు వాయిదా వేశారో కూడా వెల్లడించారు.
Vyooham, Shapadham Movies: పొలిటికల్ సినిమాలు వ్యూహం, శపథంలపై ఆసక్తి నెలకొని ఉంది. వివాదాలకు కేరాఫ్‍గా ఉండే డైరెక్టర్ రామ్‍గోపాల్ వర్మ.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఆధారంగా ఈ చిత్రాలను రూపొందించారు. మూడు నెలల కిందటే రిలీజ్ కావాల్సిన ఈ సినిమాలు కోర్టు కేసుల కారణంగా ఆలస్యమయ్యాయి. ఎట్టకేలకు ఈ చిత్రాలకు లైన్ క్లియర్ అయింది. ఇటీవలే ట్రైలర్ తీసుకురావడంతో పాటు రిలీజ్ డేట్లను కూడా రామ్‍గోపాల్ వర్మ ప్రకటించారు. వ్యూహం సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు.
వారం వాయిదా
వ్యూహం చిత్రాన్ని ఫిబ్రవరి 23వ తేదీన, శపథం మూవీని మార్చి 1వ తేదీన రిలీజ్ చేస్తామని రామ్‍గోపాల్ వర్మ గతంలో ప్రకటించారు. అయితే, ఇప్పుడు రెండు చిత్రాల విడుదలను వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. వారం ఆలస్యంగా తీసుకొస్తున్నట్టు తెలిపారు. మార్చి 1న వ్యూహం, మార్చి 8న శపథం చిత్రాలను రిలీజ్ చేస్తామని తెలిపారు.
ఈ సినిమాల కొత్త రిలీజ్ డేట్లతో ఓ ఫొటోను కూడా పోస్ట్ చేశారు రామ్‍గోపాల్ వర్మ. కొన్ని సాంకేతిక కారణాలు, మరింత ఎక్కువగా ప్రమోషన్లను చేసేందుకు విడుదలను వాయిదా వేసినట్టు ట్వీట్ చేశారు. థియేటర్లు దొరకడం కూడా కారణంగా పేర్కొన్నారు.
“వ్యూహం సినిమాను మార్చి 1కి, శపథంను మార్చి 8కి వాయిదా వేశాం. అయితే, ఈసారి లోకేశ్ కారణం కాదు. కొన్ని సాంకేతిక కారణాలు, మరిన్ని ప్రమోషన్లను చేయాలనుకోవడం, ఆ తేదీల్లో మేం అనుకున్న థియేటర్లు దొరుకుతున్నందు వల్ల వాయిదా వేశాం” అని ఆర్జీవీ ట్వీట్ చేశారు.
రేపు (ఫిబ్రవరి 23) థియేటర్లలో సుందరం మాస్టారు, సిద్ధార్థ్ రాయ్, మస్తు షేడ్స్ ఉన్నాయ్‍రా, సైరన్ (తెలుగు), ముఖ్యగమనిక సహా మరిన్ని చిత్రాలు రిలీజ్ కానున్నాయి. దీంతో సరైన థియేటర్లు దొరకని కారణంగానే వ్యూహంను ఆర్జీవీ వాయిదా వేసినట్టు అర్థమవుతోంది.
వ్యూహం చిత్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అభ్యంతరకరంగా చూపారని, ఈ మూవీ విడుదలను ఆపాలని తెలంగాణ హైకోర్టులో గతంలో పిటిషన్ వేశారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్. అయితే, తొలుత వ్యూహం మూవీ సెన్సార్ సర్టిఫికేట్‍ను కోర్టు రద్దు చేసింది. దీంతో దర్శక నిర్మాతలు డివిజన్ బెంచ్‍కు అప్పీల్ చేశారు. రెండోసారి సెన్సార్ తర్వాత వ్యూహం సినిమా రిలీజ్‍కు డివిజన్ బెంచ్ అంగీకరించింది. దీంతో ఈ చిత్రం విడుదలకు మార్గం సుగమమైంది.
వ్యూహం, శపథం చిత్రాలకు కలిపి ఒకే ట్రైలర్‌ను ఇటీవలే తీసుకొచ్చారు ఆర్జీవీ. 2009లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం నుంచి వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి 2019లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వరకు జరిగిన ఘటనలను వ్యూహం మూవీలో చూపిస్తానని ఆర్జీవీ చెప్పారు. 2019 తర్వాతి పరిస్థితులను శపథంలో చూపిస్తానని అన్నారు. అయితే, ఈ సినిమాలపై తెలుగుదేశం, జనసేన మద్దతుదారులు కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్జీవీ అవాస్తవాలను.. కించపరిచేలా పాత్రలను చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఈ చిత్రాల్లో వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి క్యారెక్టర్‌లో అజ్మల్ అమీర్ నటించారు. మానస, ధనుంజయ్ ప్రభునే, పద్మావతి, రేఖా నిరోశా కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఆనంద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నారు.