RGV Vyuham Movie: ఆర్‌జీవీ ‘వ్యూహం’ సినిమా రిలీజ్‍కు లైన్ క్లియర్.. విడుదల తేదీ ఇదే!-vyuham gets green signal for release from telangana high court ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rgv Vyuham Movie: ఆర్‌జీవీ ‘వ్యూహం’ సినిమా రిలీజ్‍కు లైన్ క్లియర్.. విడుదల తేదీ ఇదే!

RGV Vyuham Movie: ఆర్‌జీవీ ‘వ్యూహం’ సినిమా రిలీజ్‍కు లైన్ క్లియర్.. విడుదల తేదీ ఇదే!

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 08, 2024 05:01 PM IST

Vyuham Movie Release - RGV: వ్యూహం సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ. రెండో సారి సెన్సార్ తర్వాత ఈ మూవీ రిలీజ్‍కు గ్రీన్ సిగ్నల్ దక్కింది.

RGV Vyuham Movie: ఆర్‌జీవీ ‘వ్యూహం’ సినిమా రిలీజ్‍కు లైన్ క్లియర్
RGV Vyuham Movie: ఆర్‌జీవీ ‘వ్యూహం’ సినిమా రిలీజ్‍కు లైన్ క్లియర్

Vyuham Movie - RGV: వివాదాస్పద దర్శకుడు ‘రామ్‍గోపాల్ వర్మ’ రూపొందించిన ‘వ్యూహం’ సినిమా.. రిలీజ్‍కు ముందే వివాదాలకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు ఆర్జీవీ. అయితే, టీజర్, ట్రైలర్లతోనే ఈ చిత్రం దూమారాన్ని రేపింది. ఏపీలో ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఈ చిత్రంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సినిమాకు రెండు నెలల క్రితమే సెన్సార్ పూర్తవగా.. విడుదలను ఆపాలని తెలుగు దేశం జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

వ్యూహం సినిమా సెన్సార్‌ను తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ రద్దుచేసింది. దీంతో ఈ తీర్పును డివిజన్ బెంచ్‍లో సవాల్ చేసింది మూవీ యూనిట్. ఈ పిటిషన్‍పై విచారణ జరిపిన బెంచ్.. ఈ చిత్రానికి మరోసారి సమీక్షించాలని సెన్సార్ బోర్డుకు సూచించింది. మరోసారి ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ బోర్డు.. యూ సర్టిఫికేషన్ ఇచ్చింది. దీంతో వ్యూహం సినిమా రిలీజ్‍ గ్రీన్ సిగ్నల్ లభించింది.

రిలీజ్ అప్పుడే!

రెండోసారి సెన్సార్ పూర్తికావడంతో వ్యూహం చిత్రానికి లైన్ క్లియర్ అయింది. ఈ సినిమాను ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్‍పై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. జనవరిలోనే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం.. ఎట్టకేలకు నెల ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

2009లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం నుంచి.. ఆయన కుమారుడు వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు వ్యూహం మూవీ ఉండనుందని ట్రైలర్ల ద్వారా అర్థమవుతోంది. వైఎస్ జగన్ చేసిన ఓదార్పు యాత్ర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం, దీక్ష, పాదయాత్ర, ఆయన జైలుకు వెళ్లడం లాంటి అంశాలు ఈ చిత్రంలో ఉండనున్నాయి. 2019 ఎన్నికల తర్వాత వైఎస్ జగన్ సీఎం అవడంతో ఈ మూవీ ముగుస్తుందని తెలుస్తోంది.

వ్యూహం సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించారు. వైఎస్ భారతి పాత్రను మానస పోషించారు. రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు.

వ్యూహం సినిమా తర్వాత దీనికి కొనసాగింపుగా శపథం మూవీ కూడా చేస్తానని ఇప్పటికే దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ ప్రకటించారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక జరిగిన పరిస్థితులను ఆ చిత్రంలో చూపిస్తానని పేర్కొన్నారు. అయితే, వ్యూహం సినిమానే చాలా అడ్డంకులను ఎదుర్కొంది. ఇప్పుడు ఎట్టకేలకు లైన్ క్లియర్ చేసుకుంది.

రాజకీయ చిత్రాల హోరు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరో రెండు నెలల్లోనే జరగనున్నాయి. ఈ తరుణంలో రాజకీయ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా రూపొందించిన ‘యాత్ర 2’ సినిమా నేడు (ఫిబ్రవరి 8) థియేటర్లలో రిలీజ్ కానుంది. మరోవైపు, ఏపీ రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలని రైతులు చేస్తున్న పోరాటంపై రాజధాని ఫైల్స్ మూవీ వస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 15వ తేదీన రిలీజ్ కానుంది. ఇప్పుడు వ్యూహం సినిమాకు కూడా లైన్ క్లియర్ అయింది. ఈ చిత్రం ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

IPL_Entry_Point