Vyuham, Shapatham Trailer: రెండు సినిమాలకు ఒకే ట్రైలర్.. రిలీజ్ చేసిన రామ్‍గోపాల్ వర్మ
Vyuham, Shapatham Movies Trailer: వ్యూహం, శపథం సినిమాల ట్రైలర్ వచ్చేసింది. రెండు చిత్రాలకు ఒకే ట్రైలర్‌ను రిలీజ్ చేశారు దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ. పొలిటికల్ సినిమాలుగా ఇవి వస్తున్నాయి.
Vyuham, Shapatham Films Trailer: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ.. వ్యూహం, శపథం సినిమాలు రూపొందించారు. ఈ చిత్రాలు వారం వ్యవధిలోనే విడుదల కానున్నాయి. ఫిబ్రవరి 23వ తేదీన వ్యూహం, మార్చి 1వ తేదీన శపథం చిత్రాలు విడుదల కానున్నాయి. ఇప్పుడు, ఈ రెండు సినిమాలకు ఒకే ట్రైలర్‌ను తీసుకొచ్చారు రామ్‍గోపాల్ వర్మ (RGV). వ్యూహం, శపథం చిత్రాల ట్రైలర్ నేడు (ఫిబ్రవరి 13) రిలీజ్ అయింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి జీవిత ఘటనలు, ఏపీ రాజకీయాలు ప్రధాన అంశాలుగా వ్యూహం, శపథం చిత్రాలను ఆర్జీవీ రూపొందించారు. ఈ చిత్రంలో వైఎస్ జగన్ పాత్రను అజ్మల్ పోషించారు. వైఎస్ జగన్ సీఎం కాక ముందు ఘటనలను వ్యూహం చిత్రంలో.. 2019 ఎన్నికల తర్వాత ఆయన సీఎం అయ్యాక పరిస్థితులను శపథంలో చూపిస్తానని ఆర్జీవీ గతంలోనే చెప్పారు. ఇందుకు తగ్గట్టుగా ఇప్పుడు ఏకంగా రెండు సినిమాలకు ఓ ట్రైలర్ తీసుకొచ్చారు.
వైఎస్ జగన్‍కు వ్యతిరేకంగా ఇతర ప్రధాన రాజకీయ పార్టీలు కుట్రలు చేశాయన్నట్టుగా ఈ ట్రైలర్లో చూపించారు దర్శకుడు ఆర్జీవీ. వారు గొడవలను సృష్టించడం, జనాలను రెచ్చగొట్టారనేలా ట్రైలర్లో ఉంది. జగన్‍కు వ్యతిరేకంగా కూటములు కట్టే సీన్లను పొందుపరిచారు ఆర్జీవీ. జగన్ జైలుకు వెళ్లడం, బయటికి రావడం కూడా ఈ చిత్రంలో ఉండనుంది. 2019 తర్వాత వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి భారీ విజయంతో సీఎం అయిన అంశం కూడా ట్రైలర్లో ఉంది.
వ్యూహం, శపథం చిత్రాల్లో వైఎస్ జగన్‍గా అజ్మల్, వైఎస్ భారతి పాత్రలో మానసా రాధాకృష్ణ నటించారు. ధనుంజయ్ ప్రభునే, సురభి పద్మావతి, రేఖా నిరోషా, వాసు ఇంటూరి, కోటా జయరాం, ఎలినా తునేజా కీలకపాత్రలు పోషించారు. ఆనంద్ సంగీతం అందించగా.. సజీశ్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీ చేశారు.
అభ్యంతరాలు ఇవే..
ఈ చిత్రాల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‍ను అభ్యంతరకరంగా చూపించారనే విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల మరో మూడు నెలల్లోనే జరగాల్సి ఉండగా.. ఈ సినిమాలు మరింత రాజకీయ దుమారాన్ని రేపే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
‘వ్యూహం’కు గ్రీన్ సిగ్నల్
చంద్రబాబు నాయుడిని కించపరిచేలా వ్యూహం మూవీ ఉందని తెలుగు దేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఈ చిత్రం సెన్సార్ సర్టిఫికేట్‍ను సింగిల్ బెంచ్ రద్దు చేసింది. అయితే, డివిజన్ బెంచ్‍కు దర్శక నిర్మాతలు వెళ్లగా.. రెండోసారి సెన్సార్ తర్వాత వ్యూహం మూవీ రిలీజ్‍కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మొత్తంగా డిసెంబర్‌లో రిలీజ్ కావాల్సిన వ్యూహం ఫిబ్రవరి 23న వస్తోంది. శపథం మూవీని మార్చి 1న రిలీజ్ చేయనున్నట్టు ఆర్జీవీ ప్రకటించారు.
అయితే, శపథం చిత్రానికి సెన్సార్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. సెన్సార్ పూర్తయిందా లేదా అనే విషయం ఉత్కంఠగానే ఉంది. ఈ రెండు చిత్రాలను రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఆర్జీవీ డెన్ బ్యానర్‌పై డైరెక్టర్ రామ్‍గోపాల్ వర్మ స్వయంగా సమర్పిస్తున్నారు.